Share News

ఉత్కంఠ.. ఉపశమనం

ABN , Publish Date - Apr 09 , 2026 | 06:25 AM

ఒక్క రాత్రిలో ఇరాన్‌ నాగరికతనే అంతం చేస్తామని ట్రంప్‌ హూంకరింపులు.. ఏం జరిగినా తగ్గేదే లేదని ఇరాన్‌ మొండి ధైర్యం.. ఎలాంటి విలయం చూడాల్సి వస్తుందోనని...

ఉత్కంఠ.. ఉపశమనం

  • ఇరాన్‌-అమెరికా కాల్పుల విరమణ వెనుక 2 రోజుల చర్చోప చర్చలు

  • ఒకవైపు ఇరాన్‌ను బెదిరిస్తూనే చర్చలు కొనసాగించిన ట్రంప్‌

  • సంధికి వ్యతిరేకంగా రోజంతా నెతన్యాహు లాబీయింగ్‌!

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 8: ఒక్క రాత్రిలో ఇరాన్‌ నాగరికతనే అంతం చేస్తామని ట్రంప్‌ హూంకరింపులు.. ఏం జరిగినా తగ్గేదే లేదని ఇరాన్‌ మొండి ధైర్యం.. ఎలాంటి విలయం చూడాల్సి వస్తుందోనని ప్రపంచమంతా ఉత్కంఠ.. ఇరాన్‌-అమెరికా యుద్ధంపై గత సోమ, మంగళవారాల్లో చోటుచేసుకున్న పరిణామాలివి. కానీ, ఈ పరిణామాలు జరుగుతుండగానే తెరవెనుక మరో ముఖ్యమైన మంత్రాంగం నడిచింది. అదే కాల్పుల విరమణ ఒప్పందంపై సంప్రదింపులు. ట్రంప్‌ గత ఆదివారం ఇరాన్‌కు 48గంటల డెడ్‌లైన్‌ విధించిన విషయం తెలిసిందే. అయితే, ఆ డెడ్‌లైన్‌ సమయంలోనే పాకిస్థాన్‌, ఈజిప్టు, తుర్కియే దేశాల ప్రతినిధులు 15 అంశాలతో చర్చల ఎజెండాను తయారు చేసి రెండు దేశాలకు అందించారు. దానిని తిరస్కరించిన ఇరాన్‌.. తన 10 షరతులతో కూడిన ఎజెండాను పాక్‌ ప్రతినిధులకు అందించింది. ఆ షరతులకు మొదట అమెరికా ఒప్పుకోకపోవటంతో మధ్యవర్తులు అందులో పలు మార్పులు చేశారు. ఎట్టకేలకు మంగళవారం మధ్యాహ్నానికి సంధి చర్చల ప్రతిపాదనల తుది పత్రం ట్రంప్‌నకు చేరింది. దీంతో ఆయన రక్షణ మంత్రి హెగ్‌సేథ్‌, సైనిక ఉన్నతాధికారులతో వైట్‌హౌ్‌సలో రహస్య సమావేశం నిర్వహించారు. దీంతో ఒప్పందాన్ని అడ్డుకొనేందుకు అటు ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు.. ఇటు అరబ్‌ దేశాలైన సౌదీ, ఖతర్‌, యూఏఈలు.. ట్రంప్‌ సన్నిహితులతో లాబీయింగ్‌ మొదలుపెట్టాయి. అయితే, ఈ ఒత్తిళ్లకు లోబడకుండా ట్రంప్‌.. కాల్పుల విరమణకు ఆమోదం తెలిపారు.

చివరి గంటన్నర ఉత్కంఠ

ట్రంప్‌ విధించిన గడువు అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 8 గంటలకు.. భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 5.30 గంటలకు ముగిసింది. ఇరాన్‌ నాగరికత మొత్తాని తుడిచిపెట్టేస్తామని అందుకు కొన్ని గంటల ముందే ట్రంప్‌ హెచ్చరించటంతో ఏం జరగబోతోందోనని ప్రపంచమంతా ఉత్కంఠ నెలకొంది. ఇరాన్‌పై అణుబాంబు వేయబోతున్నారన్న ప్రచారం కూడా జరిగింది. అదే సమయంలో 14 రోజులపాటు కాల్పుల విరమణకు అంగీకరించాలని అటు అమెరికాకు, అందుకు ప్రతిగా హోర్ముజ్‌ జలసంధిని తెరవాలని ఇటు ఇరాన్‌కు సూచిస్తూ పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ చర్చల ప్రతిపాదన చేశారు. దానికి అమెరికా వెంటనే అంగీకరించింది. కానీ, ఇరాన్‌ నుంచి వేగంగా స్పందన రాలేదు. సమయం గడిచేకొద్దీ ఉత్కంఠ అంతకంతకూ పెరిగిపోయింది. సరిగ్గా గడువు మరో గంటన్నరలో ముగుస్తుందనగా కీలక పరిణామం చోటుచేసుకుంది. కాల్పుల విరమణకు ఒప్పుకుంటున్నట్లు ఇరాన్‌ సుప్రీంలీడర్‌ మొజ్తబా ఖమేనీ నుంచి ప్రకటన వెలుబడింది. దీంతో ప్రపంచమంతా ఊపిరి పీల్చుకుంది.


ప్రత్యక్ష చర్చలకు ఎవరు?

పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌ వేదికగా జరిగే ప్రత్యక్ష చర్చల్లో అమెరికా, ఇరాన్‌ తరఫున ఎవరెవరు పాల్గొంటారనేది ఆసక్తిగా మారింది. చర్చల కోసం అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌, ట్రంప్‌ ప్రత్యేక రాయబారి స్టీవ్‌ విట్కాఫ్‌, సలహాదారు కుష్నర్‌ పాకిస్థాన్‌కు వెళుతున్నట్టు వైట్‌హౌజ్‌ బుధవారం రాత్రి ప్రకటించింది. ఇక ఇరాన్‌ తరఫున ఆ దేశ పార్లమెంటు స్పీకర్‌ మొహమ్మద్‌ బఘర్‌ గలీబఫ్‌, విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ పాల్గొననున్నట్టు పాకిస్థాన్‌ ఉన్నతాధికార వర్గాలు తెలిపాయి.

ఇవి కూడా చదవండి..

ట్రంప్ గుడ్ న్యూస్.. దేశీయ సూచీలకు ఫుల్ జోష్..

ఇరాన్‌కు మరో రెండు వారాల గడువు.. డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం..

Updated Date - Apr 09 , 2026 | 06:25 AM