Share News

శాంతి మంత్రం

ABN , Publish Date - Apr 09 , 2026 | 06:54 AM

అమెరికా, ఇరాన్‌ మధ్య సై అంటే సై అన్నట్టుగా కొనసాగిన యుద్ధానికి కొంత విరామం వచ్చింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీవ్ర హెచ్చరికలతో పశ్చిమాసియాలో ఎప్పుడేం...

శాంతి మంత్రం

2 వారాల పాటు కాల్పుల విరమణకు అమెరికా, ఇరాన్‌ అంగీకారం

  • ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు.. ఐఆర్‌జీసీ ఆగ్రహం

  • లెబనాన్‌లో ఊచకోత.. ఒక్కరోజే 254 మంది మృతి

  • హోర్ముజ్‌ మళ్లీ మూత!.. ఒప్పందం నుంచి తప్పుకొంటామన్న ఇరాన్‌

  • వెంటనే జలసంధిని తెరవాలని వైట్‌హౌస్‌ ప్రకటన

పాకిస్థాన్‌ మధ్యవర్తిత్వం.. ఇరాన్‌ పది డిమాండ్లు

15 సూత్రాల ప్రణాళికను ప్రతిపాదించిన ట్రంప్‌

శుక్రవారం నుంచి పాకిస్థాన్‌ వేదికగా చర్చలు

పలు అంశాల్లో పరస్పర విరుద్ధంగా డిమాండ్లు

సీజ్‌ఫైర్‌కు ఇరాన్‌ ప్రాధేయపడింది.. ట్రంప్‌

దయచూపారు: అమెరికా రక్షణ మంత్రి హెగ్సెత్‌

మా డిమాండ్ల ఆధారంగా చర్చలకు ట్రంప్‌ ఓకే

అందుకే కాల్పుల విరమణకు సరే అన్నాం: అరాగ్చీ

మా వేలు ఇంకా ట్రిగ్గర్‌పైనే ఉంది: ఐఆర్‌జీసీ

ఈ యుద్ధం ఇంకా ముగియలేదు: మొజ్తాబా

టెహ్రాన్‌/వాషింగ్టన్‌/న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 8: అమెరికా, ఇరాన్‌ మధ్య సై అంటే సై అన్నట్టుగా కొనసాగిన యుద్ధానికి కొంత విరామం వచ్చింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీవ్ర హెచ్చరికలతో పశ్చిమాసియాలో ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళనకు చివరి క్షణంలో ఉపశమనం లభించింది. రెండు వారాల పాటు కాల్పుల విరమణ పాటించేందుకు అమెరికా, ఇరాన్‌ అంగీకరించాయి. ఇరాన్‌ పెట్టిన పది డిమాండ్లను పరిశీలిస్తామని అమెరికా పేర్కొనగా.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇప్పటికే ప్రతిపాదించిన 15 సూత్రాల ప్రణాళికలోని చాలా వరకు అంశాలను చర్చల కోసం పరిగణనలోకి తీసుకుంటామని ఇరాన్‌ వెల్లడించింది. శుక్రవారం నుంచి పాకిస్థాన్‌ వేదికగా ఇరుదేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. అయితే ఈ కాల్పుల విరమణ ఏ మేరకు అమలవుతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగాయి. ముఖ్యంగా లెబనాన్‌లో ఇజ్రాయెల్‌ ఊచకోతకు పాల్పడింది. దీనికి నిరసనగా హోర్ముజ్‌ జలసంధిని తిరిగి మూసివేస్తున్నట్టు ఐఆర్‌జీసీ వర్గాలు అనధికారికంగా ప్రకటించాయి. దీనిపై స్పందించిన వైట్‌హౌజ్‌ వెంటనే జలసంధిని తిరిగి తెరవాలని ప్రకటన చేసింది. మరోవైపు ఇరువర్గాలు ప్రతిపాదించిన అంశాల్లో చాలా వరకు పరస్పర విరుద్ధంగా ఉండటం, అసలే మాత్రం వెనక్కి తగ్గకుండా ఇరు వర్గాల నుంచి వెలువడుతున్న హెచ్చరికలు, కాల్పుల విరమణపై కుదిరిన అంగీకారం ఏక్షణంలోనైనా విచ్ఛిన్నం కావొచ్చన్న తరహాలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ వ్యాఖ్యలు చేయడం ఆందోళన రేపుతోంది. పాకిస్థాన్‌ వేదికగా జరిగే చర్చలు ఎలా కొనసాగుతాయన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు కాల్పుల విరమణ ప్రకటనతో ముడి చమురు ధరలు ఒక్కసారిగా 13శాతం వరకు తగ్గాయి. ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు లాభాల బాట పట్టాయి.


ఒప్పందంలోని అంశాలపై తకరారు

కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి అమెరికా, ఇరాన్‌ ప్రతిపాదనల మధ్య పరస్పర వైరుధ్యాలు ఎన్నో ఉన్నాయి. హోర్ముజ్‌ జలసంధికి సమీపంలోనే అమెరికా యుద్ధ నౌకలు మోహరించి ఉంటాయని ట్రంప్‌ పేర్కొన్నారు. కానీ అసలు పశ్చిమాసియాలో అమెరికా సేనలు ఉండవద్దన్నది ఇరాన్‌ ప్రధాన డిమాండ్లలో ఒకటి కావడం గమనార్హం. ఇక ఇరాన్‌పై ఆంక్షలు ఎత్తివేస్తామని ట్రంప్‌ పేర్కొన్నా.. యూరోపియన్‌ దేశాలు అందుకు అంగీకరిస్తాయా అన్నది సందేహంగా మారింది. ఇరాన్‌పై యుద్ధం, హోర్ముజ్‌ తెరవడం కోసం ట్రంప్‌ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా.. నాటో దేశాలు స్పందించలేదు. ఇప్పుడు ఎలా స్పందిస్తాయన్నది తేలాల్సి ఉంది. మరోవైపు కాల్పుల విరమణను ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు స్వాగతించినా.. ఇరాన్‌ పెట్టిన షరతుల్లో ఒకటైన లెబనాన్‌పై దాడుల నిలిపివేతను మాత్రం అంగీకరించలేదు. లెబనాన్‌లో ఇజ్రాయెల్‌ భూతల దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

‘అణు’వంతైనా కుదరక..

అమెరికా డిమాండ్లలో కీలకమైన ఇరాన్‌ అణు కార్యక్రమం నిలిపివేత, శుద్ధి చేసిన యురేనియం అప్పగింత అంశాల్లో కూడా పరస్పర విభిన్న ప్రకటనలు వెలువడుతున్నాయి. ఇరాన్‌ అణుశుద్ధిని పూర్తిగా నిలిపివేస్తామని హామీ ఇచ్చిందని ట్రంప్‌ చెప్పారు. కానీ ఈ అంశంపై ఇరాన్‌ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. అంతేకాదు.. కాల్పుల విరమణకు సంబంధించి ఇరాన్‌ ఫార్సీ భాషలో విడుదల చేసిన ప్రకటనలో ఇరాన్‌ అణుశుద్ధిని కొనసాగించడానికి అమెరికా అంగీకరించిందని పేర్కొంది. అయితే తర్వాత ఆంగ్లంలో విడుదల చేసిన ప్రకటనలో మాత్రం ఆ అంశం లేదు. ఇరాన్‌ ఫార్సీ భాషలో విడుదల చేసిన 10 అంశాల ప్రణాళిక మోసపూరితమని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. మరోవైపు ఇరాన్‌ స్వచ్ఛందంగా యురేనియం అప్పగించాలని, లేకపోతే భారీ దాడి చేపట్టి అయినా స్వాధీనం చేసుకుంటామని అమెరికా రక్షణ మంత్రి పీట్‌ హెగ్సెత్‌ వ్యాఖ్యానించడం గమనార్హం.

జల ‘సందిగ్ధం’!

హోర్ముజ్‌ జలసంధిలో నౌకల రాకపోకల కోసం చార్జీలు వసూలు చేస్తామని ఇరాన్‌ తమ 10 సూత్రాల ప్రణాళికలో పేర్కొంది. దీనిని గల్ఫ్‌ దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇన్నాళ్లూ స్వేచ్ఛా మార్గంగా ఉన్న హోర్ముజ్‌ జలసంధిపై ఇరాన్‌కు అధికారికంగా ఆధిపత్యం సమకూరితే తమకు సమస్యగా పరిణమిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హోర్ముజ్‌ జలసంధికి మరోవైపున ఉన్న ఒమన్‌తో కలిసి చార్జీలు వసూలు చేస్తామని ఇరాన్‌ తమ ప్రణాళికలో పేర్కొంది. ఆ చార్జీల ద్వారా వచ్చే ఆదాయాన్ని తమ దేశ పునర్నిర్మాణానికి వినియోగించుకుంటామని తెలిపింది. అయితే చార్జీల వసూలుకు ఒమన్‌ నిరాకరించింది.


ఏ క్షణంలోనైనా మళ్లీ దాడులు: నెతన్యాహు

అమెరికా-ఇరాన్‌ కాల్పుల విరమణపై ఇజ్రాయెల్‌కు ముందే సమాచారం ఉందని ఆ దేశ ప్రధాని నెతన్యాహు చెప్పారు. దీనితో యుద్ధం ముగిసినట్టు కాదని, కాల్పుల విరమణ నిబంధనల్లో దేనిని అతిక్రమించినా ఇరాన్‌పై దాడులు చేస్తామని పేర్కొన్నారు. తమ వేలు ట్రిగ్గర్‌పై ఉందని, ఏ క్షణంలోనైనా మళ్లీ దాడులు చేస్తామని హెచ్చరించారు.

ఇస్లామాబాద్‌ చర్చలు

శాంతిని సాధించాలి: షెహబాజ్‌

తమ మధ్యవర్తిత్వంతో అమెరికా, ఇరాన్‌ కాల్పుల విరమణకు ముందుకు రావడంపై పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల 10న (శుక్రవారం) పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌ వేదికగా ప్రత్యక్ష చర్చలకు రావాలని ఇరుపక్షాల నేతలను ఆహ్వానించారు. ఇస్లామాబాద్‌ చర్చలు స్థిరమైన శాంతిని నెలకొల్పాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు.

ఇరాన్‌ 10 సూత్రాల ప్రణాళిక

1. ఇరువైపులా పరస్పరం దాడులు చేసుకోకుండా కచ్చితమైన హామీ.. ఇరాన్‌ అణుశుద్ధికి అంగీకారం

2. హోర్ముజ్‌ జలసంధిలో ఇరాన్‌ సాయుధ దళాల పర్యవేక్షణలో నౌకల రాకపోకలు

3. లెబనాన్‌లో హెజ్బొల్లాపై దాడులు సహా అన్ని చోట్లా యుద్ధం నిలిపివేత

4. పశ్చిమాసియాలోని అన్ని స్థావరాలు, మోహరింపు కేంద్రాల నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ

5. ఇరాన్‌కు వ్యతిరేకంగా ఐరాస భద్రతా మండలి, ఇతర సంస్థల్లో చేసిన అన్ని తీర్మానాల రద్దు

6. హోర్ముజ్‌ జలసంధిపై ఇరాన్‌ ఆధిపత్యానికి హామీ ఇచ్చేలా ట్రాన్సిట్‌ ప్రొటోకాల్‌ ఏర్పాటు. ఇందుకోసం పరస్పర అంగీకారంతో కూడిన నిబంధనల రూపకల్పన.

7. ఇరాన్‌కు జరిగిన నష్టంపై అంచనాల రూపకల్పన. పూర్తిస్థాయిలో పరిహారం చెల్లింపు

8. ఇరాన్‌పై ఉన్న అన్ని ప్రాథమిక, అనుబంధ ఆంక్షలు తొలగింపు

9. విదేశాల్లో సీజ్‌ చేసిన అన్ని ఇరాన్‌ ఆస్తులు, నిధుల విడుదల

10. పైన షరతులన్నీ అంతర్జాతీయ చట్టాల కింద తప్పనిసరిగా అనుసరించేలా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం


ట్రంప్‌ 15 సూత్రాల ప్రణాళిక

  • విస్తృతస్థాయిలో చర్చలకు వీలుగా నెల రోజులపాటు పూర్తిస్థాయి కాల్పుల విరమణ

  • ఇరాన్‌ అణ్వాయుఽధ కార్యక్రమాన్ని శాశ్వతంగా వదిలేయడం

  • ఇరాన్‌లో అణుశుద్ధిని నిలిపివేయడం

  • ఇప్పటికే శుద్ధిచేసిన యురేనియం నిల్వలను అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ)కు అప్పగించడం

  • ఇరాన్‌లోని నతాంజ్‌, ఇస్ఫహాన్‌, ఫోర్డో అణుకేంద్రాలను ఐఏఈఏ ఆధ్వర్యంలో పూర్తిగా ధ్వంసం చేయడం

  • హోర్ముజ్‌ జలసంధిని నిరంతరం తెరిచి ఉంచడం

  • పశ్చిమాసియాలోని వివిధ దేశాల్లో ప్రాంతీయ మిలీషియా కార్యకలాపాలు ఆపేయడం

  • వివిధ సాయుధ గ్రూపులకు మద్దతు నిలిపేయడం

  • బాలిస్టిక్‌ క్షిపణులు సంఖ్య, సామర్థ్యంపై నియంత్రణ

  • కేవలం స్వీయ రక్షణకే క్షిపణులను వినియోగించడం

  • పైన షరతులకు ఇరాన్‌ అంగీకరిస్తే.. ఆ దేశానికి ఇచ్చే హామీలనూ ట్రంప్‌ ప్రణాళికలో పేర్కొన్నారు.

  • ఇరాన్‌పై అన్ని రకాల ఆంక్షల ఎత్తివేత

  • ఇరాన్‌లో బుషెహర్‌ అణువిద్యుత్‌ ప్లాంటు సహా ఆ దేశ పౌర అణు కార్యక్రమానికి సహకారం

  • ‘స్నాప్‌బ్యాక్‌’ ఆంక్షల విధానాన్ని ఎత్తివేయడం. (ఒప్పందంలో ఇరాన్‌ ఏదైనా అంశాన్ని ఉల్లంఘిస్తే.. ఆ దేశంపై ఐక్యరాజ్యసమితి గతంలో విధించిన ఆంక్షలు ఆటోమేటిగ్గా మళ్లీ వర్తించే విధానమే ‘స్నాప్‌బ్యాక్‌’)

ఇవి కూడా చదవండి..

ట్రంప్ గుడ్ న్యూస్.. దేశీయ సూచీలకు ఫుల్ జోష్..

ఇరాన్‌కు మరో రెండు వారాల గడువు.. డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం..

Updated Date - Apr 09 , 2026 | 06:54 AM