అమెరికాతో రాజీకి సిద్ధమైన ఇరాన్!
ABN , Publish Date - Feb 15 , 2026 | 02:27 PM
అమెరికాతో రాజీకి సిద్ధమేనని ఇరాన్ సంకేతాలిచ్చింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ శాఖ డిప్యూటీ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాతో రాజీకి ఇరాన్ సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ దిశగా ఇరాన్ విదేశాంగ శాఖ డిప్యూటీ మంత్రి మాజిద్ తఖ్తత్ రవంచీ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బంతి అమెరికన్ల కోర్టులో ఉందని కామెంట్ చేశారు. ఒప్పందానికి తామూ సిద్ధమేనన్న విషయాన్ని అమెరికా రుజువు చేసుకోవాలని అన్నారు. డీల్ విషయంలో అమెరికా నిబద్ధతతో ఉంటే రాజీకి దారి ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు. ఆంక్షల ఎత్తివేతపై చర్చకు అమెరికా సిద్ధమైతే అణుకార్యకలాపాలపై పరిమితులకు తామూ సిద్ధమేనని వ్యాఖ్యానించారు. డీల్ విషయంలో ఇరాన్ సాచివేత ధోరణి అవలంబిస్తోందని అమెరికా ఆరోపిస్తున్న తరుణంలో మంత్రి కామెంట్స్‌కు ప్రాధాన్యం ఏర్పడింది.
అణ్వాయుధ అభివృద్ధికి ఇరాన్ అడుగులు వేస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆంక్షలకు తెరలేపారు. ఇరాన్‌కు బ్రేకులు వేసేందుకు ఏకంగా సైనిక దళాలను కూడా తరలించారు. మరోవైపు, అమెరికా ఆరోపణలను ఇరాన్ కొట్టిపారేయడమే కాకుండా అమెరికాపై ప్రతిదాడులకు కూడా సిద్ధమని హెచ్చరించింది. మరోవైపు, ఒమాన్ వేదికగా ఇరు దేశాల మధ్య ఈ నెల మొదట్లో చర్చలు జరిగాయి. అయితే, చర్చలు సానుకూలంగా సాగాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అప్పట్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జెనీవాలో మరోమారు ఇరు దేశాల ప్రతినిధితులు చర్చించనున్నారు.
ఈ వార్తలూ చదవండి:
బంగ్లాదేశ్ ప్రధాని ప్రమాణస్వీకారానికి ప్రధాని మోదీకి ఆహ్వానం
బంగ్లాదేశ్‌లో బీఎన్‌పీ భారీ విజయం