సముద్రగర్భ ఇంటర్నెట్ కేబుల్స్‌పైనా టోల్ విధింపు.. ఇరాన్ కొత్త ఆలోచన
ABN , Publish Date - May 18 , 2026 | 01:29 PM
హోర్ముజ్ మీదుగా ప్రయాణించే నౌకల నుంచి టోల్ వసూలు కోసం ప్రయత్నిస్తున్న ఇరాన్ తాజాగా అక్కడి సముద్రగర్భ ఇంటర్నెట్ కేబుల్స్‌పై ఫీజుల వసూలుకు సిద్ధమైనట్టు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇంటర్నెట్ డెస్క్: హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టు బిగించడంతో ముడి చమురు రవాణాకు తీవ్ర ఆటంకాలు ఏర్పడి ధరలు ఆకాశాన్నంటాయి. ఈ క్రమంలో ఇరాన్ తాజాగా హోర్ముజ్ జలసంధిలోని సముద్ర గర్భ ఇంటర్నెట్ కేబుల్స్‌పై కూడా దృష్టిసారించింది. ఈ కేబుల్స్‌పై కూడా టోల్ వసూలుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
సముద్రం అడుగున ఉన్న ఈ కేబుల్స్ గ్లోబల్ ఇంటర్నెట్ వ్యవస్థకు జీవనాడిగా మారాయి. గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి దిగ్గజ టెక్ సంస్థలన్నీ ఈ తీగల ద్వారా జరిగే డేటా మార్పిడిపై అధారపడ్డాయి. అమెరికా, ఐరోపా, ఆసియా దేశాల్లోని ఇంటర్నెట్ హబ్స్‌ను ఈ తీగలే అనుసంధానిస్తాయి. వీటికి నష్టం జరిగితే ఇంటర్నేట్ సేవలు నిలిచిపోవడం, లేదా నెమ్మదించడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది.
హోర్ముజ్‌పై సౌర్వభౌమత్వం తమదే అని పట్టుబడుతున్న ఇరాన్.. నౌకల రవాణాతో పాటు కేబుల్స్ వినియోగంపై కూడా టోల్ వసూలు కోసం ప్రయత్నిస్తోంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ వంటి సంస్థలు ఈ కేబుల్స్‌ను వినియోగించినందుకు తమకు ఫీజు చెల్లించాలని కోరుతోంది. కంపెనీలు తమ డిమాండ్స్‌కు ఒప్పుకోకపోతే ఇంటర్నెట్ ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడవచ్చని కూడా ఇరాన్ పత్రికలు కొన్ని హెచ్చరించాయి. ఈ కేబుల్స్ వాడినందుకు ఫీజులు వసూలు చేస్తామని ఇరాన్ మిలిటరీ ప్రతినిధి ఒకరు గతవారమే ఎక్స్ వేదికగా ప్రకటించారు.
ఇరాన్ చట్టాలకు అనుగుణంగా టెక్ సంస్థలు తమ కార్యకలాపాలు నిర్వహించాల్సి ఉంటుందని ఇరాన్ సైన్యం చెబుతోంది. సముద్రగర్భ కేబుల్స్ ఆపరేటర్లు తమకు లైసెన్సు ఫీజులు కూడా చెల్లించాలని పేర్కొంది. ఇక కేబుల్స్ రిపేర్లు, నిర్వహణ కాంట్రాక్టులు ఇరాన్ సంస్థలకే ఇవ్వాల్సి ఉంటుందని చెబుతోంది. ఇలాంటి ఫీజుల వసూలు చట్టబద్ధమని కూడా ఇరాన్ వాదిస్తోంది. సముద్రగర్భ మౌలికవసతులకు సంబంధించి ఫీజులు వసూలు చేసుకునే హక్కు తీరప్రాంత దేశాలకు ఉంటుందని అంతర్జాతీయ చట్టాలు చెబుతున్నాయని అంటోంది. సూయిజ్ కెనాల్ అడుగున ఉన్న సముద్రగర్భ కేబుల్స్‌పై ఈజిప్టు ఇప్పటికే పలు రకాల ఫీజులు వసూలు చేస్తున్న విషయాన్ని ఇరాన్ మీడియా ప్రస్తావించింది.
అయితే, సూయిజ్ కెనాల్ జలమార్గం మనుషులు నిర్మించినది కావడంతో ఈ జలసంధికి సంబంధించిన నిబంధనలు హోర్ముజ్‌కు వర్తిస్తాయా? అన్న చర్చ కూడా జరుగుతోంది. ఇక అమెరికా ప్రభుత్వ ఆంక్షల ప్రకారం, అక్కడి సంస్థలు ఇరాన్‌తో ఎలాంటి లావాదేవీలు జరపకూడదు. దీంతో, వాటి నుంచి ఇరాన్ ఫీజులను ఎలా వసూలు చేస్తుందనే ప్రశ్న కూడా తలెత్తుతోంది.
ఈ వార్తలనూ చదవండి:
స్టాక్ మార్కెట్‌లో ట్రంప్ కలకలం! 90 రోజుల్లో 3,700 లావాదేవీలు
ఇరాన్‌లో 134 ఏళ్ల నాటి విష్ణు దేవాలయం.. వీడియో షేర్ చేసిన అమితాబ్ బచ్చన్..