పశ్చిమాసియా భగ్గు
ABN , Publish Date - Mar 20 , 2026 | 05:12 AM
పశ్చిమాసియా తగలబడుతోంది. మూడు వారాలుగా సాగుతున్న ఇరాన్- అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంలో తాజాగా ఇరుపక్షాలు పరస్పరం అత్యంత కీలకమైన చమురు, సహజవాయు క్షేత్రాలు, రిఫైనరీలు......
ఇరాన్ సౌత్‌పార్స్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ దాడి
ప్రతీకారంగా ఖతార్‌లోని రస్ లఫాన్‌లో ఇరాన్ విధ్వంసం
దెబ్బతిన్న ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ రిఫైనరీ
సౌదీ, యూఏఈ, కువైట్ చమురు క్షేత్రాలపైనా దాడులు
ఆపకుంటే మేమూ యుద్ధంలోకి వస్తాం.. సౌదీ హెచ్చరిక
సౌత్‌పార్స్‌పై ఇజ్రాయెల్ దాడి విషయం నాకు తెలియదు
ఇరాన్ వెనక్కు తగ్గకుంటే నాశనం చేస్తాం: ట్రంప్
హోర్ముజ్ జలసంధిని తెరిచేందుకు మేం సాయం చేస్తాం
జపాన్‌తోపాటు పలు యూరప్ దేశాల వెల్లడి
దాడులతో నిలిచిపోయిన గ్యాస్, చమురు ఉత్పత్తి
భారత్ సహా ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం
న్యూఢిల్లీ, మార్చి 19: పశ్చిమాసియా తగలబడుతోంది. మూడు వారాలుగా సాగుతున్న ఇరాన్- అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంలో తాజాగా ఇరుపక్షాలు పరస్పరం అత్యంత కీలకమైన చమురు, సహజవాయు క్షేత్రాలు, రిఫైనరీలు, ఇతర ఇంధన మౌలిక వసతులపై భీకర దాడులు మొదలుపెట్టాయి. దీంతో ప్రపంచాన్ని చమురు, గ్యాస్ ధరల మంటలు చుట్టుముట్టాయి. ఇరాన్‌కు వెన్నెముక వంటి సౌత్‌పార్స్ సహజ వాయు క్షేత్రంపై ఇజ్రాయెల్ బుధవారం క్షిపణి దాడులు చేయటంతో ఇరాన్ ప్రతీకారంతో చెలరేగిపోయింది. పొరుగున ఉన్న ఖతార్‌కు జీవనాడి వంటి రస్ లఫాన్ పారిశ్రామిక నగరంలోని సహజవాయు క్షేత్రం, రిఫైనరీపై క్షిపణులు, డ్రోన్లతో గురువారం విరుచుకుపడింది. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద సహజవాయు (ఎల్‌ఎన్‌జీ) సరఫరాదారు అయిన ఈ క్షేత్రం తీవ్రంగా దెబ్బతిన్నది. మరోవైపు ఎర్ర సముద్రం ఒడ్డున ఉన్న సౌదీ అరేబియాకు చెందిన కీలకమైన సామ్‌రెఫ్ రిఫైనరీపై కూడా ఇరాన్ డ్రోన్ దాడులు చేసింది. ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని చమురు మౌలిక వసతులపై దాడులు కొనసాగించింది. ఈ దాడులు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి. అనేక దేశాల్లో స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. చమురు, గ్యాస్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉండటంతో ఆర్థిక వ్యవస్థల్లో వణుకు మొదలైంది. దీని ప్రభావం భారత్‌పై తీవ్రంగా పడేఅవకాశం ఉంది. భారత్ తన ఎల్‌ఎన్‌జీ దిగుమతుల్లో 40 శాతం ఖతార్ నుంచే తెచ్చుకుంటోంది. పర్షియన్ గల్ఫ్‌లో ప్రస్తుతం దాదాపు 700 నౌకలు చిక్కుకుపోయాయి. గురువారం యూఏఈ, ఖతార్ తీరాల్లో నిలిపి ఉంచిన రెండు నౌకలపై కూడా దాడి జరిగింది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రయోగించిన క్షిపణి వెస్ట్‌బ్యాంక్‌లో పడటంతో ముగ్గురు పాలస్తీనా మహిళలు మరణించారు.
మేమూ యుద్ధంలోకి దిగుతాం: సౌదీ
ఇరాన్ తరచూ తమదేశంపై దాడులు చేస్తుండటంతో సౌదీ అరేబియా గురువారం తీవ్ర హెచ్చరికలు జారీచేసింది. దాడులు ఆపకుంటే తాము కూడా యుద్ధంలోకి దిగాల్సి వస్తుందని సౌదీ విదేశాంగమంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ గురువారం హెచ్చరించారు. సహనానికి కూడా హద్దు ఉంటుందని స్పష్టంచేశారు. రియాద్ నగరం, ఇతర చమురు రిఫైనరీలపై ఇరాన్ ప్రయోగించిన 5 బాలిస్టిక్ క్షిపణులను కూల్చివేసినట్లు పేర్కొన్నారు. ఒకవేళ సౌదీ కనుక యుద్ధంలో అడుగుపెడితే.. ఆ దేశంతో రక్షణ ఒప్పందం ఉన్న పాకిస్థాన్ కూడా సౌదీకి రక్షణగా యుద్ధంలోకి దిగాల్సి ఉంటుంది. కాగా, ఖతార్, యూఏఈ కూడా ఇరాన్‌కు హెచ్చరికలు జారీచేశాయి. తమదేశంలోని ఇరాన్ రాయబారులు 24 గంటల్లోగా దేశం విడిచి వెళ్లాలని ఖతార్ గురువారం ఆదేశించింది.
దాడులు జరిగింది వీటిపైనే...
1. రస్ లఫాన్
ఈ గ్యాస్ క్షేత్రం ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్‌ఎన్‌జీ ఉత్పత్తిదారు. దీనిని ఖతార్ ఎనర్జీ సంస్థ నిర్వహిస్తోంది. రస్ లఫాన్ ప్రపంచంలో అతిపెద్ద పారిశ్రామిక నగరాల్లో ఒకటి కూడా. ఇరాన్‌కు చెందిన సౌత్‌పార్స్, ఈ రస్ లఫాన్ ఒకే గ్యాస్ ఫీల్డ్‌లో ఉన్నాయి. పర్షియన్ గల్ఫ్‌లో ఉత్తరం వైపు ఉన్న క్షేత్రాన్ని రస్ లఫాన్ అని పిలుస్తారు. ఇది ఖతార్‌కు చెందినది. దక్షిణం వైపు ఉన్న క్షేత్రాన్ని సౌత్‌పార్స్ అని పిలుస్తారు. ఇది ఇరాన్‌కు చెందినది. ఇక్కడ 1970ల్లో గ్యాస్ నిక్షేపాలను కనుగొన్నారు. దీనిని ఇరుదేశాలు పంచుకుంటున్నాయి. రస్ లఫాన్ పేరుతో ఖతార్ 20 ఏళ్లలోనే అతిపెద్ద పారిశ్రామిక నగరాన్ని అభివృద్ధి చేసింది. ఇక్కడి నుంచి ఎల్‌ఎన్‌జీ 30 దేశాలకు ఎగుమతి అవుతోంది. భారత్ కూడా తన అవసరాల్లో ఎక్కువ భాగం ఎల్‌ఎన్‌జీని ఇక్కడి నుంచే దిగుమతి చేసుకుంటోంది. ఇక్కడ ముడి గ్యాస్‌ను ప్రాసెస్ చేసి, ఏటా 77 మిలియన్ టన్నుల ఎల్‌ఎన్‌జీని ఎగుమతి చేస్తున్నారు. దీనిపై ఇరాన్ దాడి చేయటంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ క్షేత్రం తీవ్రంగా దెబ్బతిన్నదని, ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేశామని ఖతార్ ప్రకటించింది.
2. సౌత్‌పార్స్
ఇది ఇరాన్‌కు అత్యంత కీలక గ్యాస్ క్షేత్రం. దీనిపై ఇజ్రాయెల్ బుధవారం దాడులు చేయటంతో మంటల్లో చిక్కుకుంది. దీంతో ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇక్కడ ఇరాన్ రోజుకు 730 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను వెలికితీస్తోంది. అయితే, అంతర్జాతీయ ఆంక్షల కారణంగా అందులో 70 శాతాన్ని ఆ దేశమే వాడుకుంటోంది.
3. ఖార్గ్ ద్వీపం
ఇరాన్‌కు చెందిన దాదాపు 90 శాతం ముడి చమురు ఈ ద్వీపం నుంచే ఇతర దేశాలకు ఎగుమతి అవుతోంది. ఈ ద్వీపంపై ఇజ్రాయెల్, అమెరికా కొద్దిరోజుల క్రితం వైమానిక దాడులు చేశాయి.
4. రువాయిస్ రిఫైనరీ
అబుదాబీ సమీపంలో ఉన్న ఈ చమురు శుద్ధి కేంద్రంపై ఇరాన్ డ్రోన్ దాడులకు పాల్పడింది. దీంతో ఇక్కడ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపేశారు.
5. రస్ తనూరా, సామ్‌రెఫ్ రిఫైనరీలు
సౌదీ అరేబియాకు చెందిన ఈ రిఫైనరీపై ఇరాన్ తాజాగా డ్రోన్ దాడులకు పాల్పడింది. దీంతో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపేశారు. సామ్‌రెఫ్ పశ్చిమాసియాలో అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రాల్లో ఒకటి. ఎర్రసముద్రం ఒడ్డున యాన్‌బు పోర్టు వద్ద ఇది ఉంది. దాడిలో రిఫైనరీకి వాటిల్లిన ప్రమాదాన్ని అంచనా వేస్తున్నామని సౌదీ ప్రభుత్వం ప్రకటించింది. హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయటంతో సౌదీ అరేబియా తన ముడి చమురును మొత్తం పైపుల ద్వారా యాన్‌బు పోర్టుకు తరలిస్తోంది. తాజాగా దానిపై కూడా దాడి జరగటంతో ఆందోళన నెలకొంది.
6. కువైట్ మినా రిఫైనరీలు
తమ మినా అబ్దుల్లా చమురు శుద్ధి కేంద్రంపై డ్రోన్ దాడి జరిగిందని కువైట్ గురువారం ప్రకటించింది. దానికి సమీపంలోనే ఉన్న మినా అల్ అహ్మదీ రిఫైనరీపై కూడా ఇటీవల దాడి జరిగింది. డ్రోన్ దాడిలో రిఫైనరీల్లో భారీగా మంటలు చెలరేగాయి. మినా అబ్దుల్లా రిఫైనరీలో రోజుకు 7,30,000 బ్యారెళ్ల పెట్రోలియం ఉత్పత్తులను తయారుచేస్తారు. అబుదాబీలోని హబ్‌షాన్, బాబ్ రిఫైనరీలను కూడా మూసివేసినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.
ఇరాన్‌ను పూర్తిగా నాశనం చేస్తాం: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను మరోసారి తీవ్రంగా హెచ్చరించారు. హోర్ముజ్ జలసంధిని తెరవకుంటే ఇరాన్‌ను పూర్తిగా నాశనం చేస్తామని, ఇందుకు ఆ మార్గంపై ఆధారపడిన దేశాల సహకారం కూడా తమకు అవసరం లేదని గురువారం ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు. ఖతార్‌పై దాడులు ఆపకుంటే సౌత్‌పార్స్ గ్యాస్ క్షేత్రాన్ని పూర్తిగా పేల్చివేస్తామని హెచ్చరించారు. ఈ గ్యాస్ ఫీల్డ్‌పై బుధవారం ఇజ్రాయెల్ దాడి చేసిన విషయం తనకు తెలియదని పేర్కొన్నారు. కాగా, ఇరాన్‌పై గతంలో ఎన్నడూ చూడనంత తీవ్రంగా దాడి చేస్తామని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సేథ్ హెచ్చరించారు. ఇదిలా ఉండగా హోర్ముజ్ జలసంధిని తెరిచేందుకు తాము సహాయం చేస్తామని బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, నెదర్లాండ్స్, జపాన్ ప్రకటించాయి. చమురు మౌలిక సదుపాయాలపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించాయి.