Share News

హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ సుప్రీం లీడర్ కీలక ప్రకటన.. నూతన అధ్యాయం మొదలైంది..

ABN , Publish Date - Apr 10 , 2026 | 07:23 AM

హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన చేశారు. ప్రపంచంలోని అత్యంత కీలకమైన జలమార్గాలలో ఒకటైన హోర్ముజ్ నిర్వహణలో ఇది ఇరాన్‌కు ఒక కీలకమైన నూతన అధ్యాయమని ఆయన అభివర్ణించారు.

హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ సుప్రీం లీడర్ కీలక ప్రకటన.. నూతన అధ్యాయం మొదలైంది..
Strait of Hormuz

టెహ్రాన్, ఏప్రిల్ 10: హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన చేశారు. హోర్ముజ్ జలసంధి నిర్వహణలో కొత్త దశకు చేరుకుంటున్నామని ఆయన అన్నారు. ప్రపంచంలోని అత్యంత కీలకమైన జలమార్గాలలో ఒకటైన హోర్ముజ్ నిర్వహణలో ఇది ఇరాన్‌కు ఒక కీలకమైన నూతన అధ్యాయమని ఆయన అభివర్ణించారు. తమ దేశంపై దాడి చేసిన వారిని శిక్షించకుండా వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. యుద్ధంలో జరిగిన నష్టాలకు టెహ్రాన్ పరిహారం కోరాలని భావిస్తోందని తెలిపారు. ‘జరిగిన నష్టానికి, అమరవీరుల త్యాగాలకు, యుద్ధంలో గాయపడిన వారికి పరిహారం కోసం మేము కచ్చితంగా డిమాండ్ చేస్తాము’ అని ఆయన అన్నారు.


అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన తన తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని తేల్చిచెప్పారు. ఇరాన్ యుద్ధాన్ని కోరుకోవడం లేదని, అయితే.. తమ హక్కులను మాత్రం వదులుకోదని ఆయన స్పష్టం చేశారు. ఇక, హోర్ముజ్ విషయంలో ఐఆర్‌జీసీ కొత్త రూల్స్ తెరపైకి తెచ్చింది. అమెరికాతో చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని దృష్టిలో పెట్టుకుని హోర్ముజ్‌‌లో ప్రతీ రోజు కేవలం 15 నౌకలను మాత్రమే అనుమతించాలని నిర్ణయించుకుంది. అది కూడా ఇరాన్ అనుమతి తీసుకున్న నౌకలకు మాత్రమే హోర్ముజ్‌లో ప్రయాణించే అవకాశం కల్పించనుంది.


హోర్ముజ్‌లో సీమైన్స్

హోర్ముజ్ జలసంధిలో ఇటీవల జరిగిన సైనిక ఘర్షణల నేపథ్యంలో ఇరాన్ సముద్రపు మైన్లు ఏర్పాటు చేసింది. హోర్ముజ్ గుండా ప్రయాణించే నౌకలకు తాజాగా, సీమైన్స్‌పై ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. హోర్ముజ్‌లో ఉన్న సీమైన్స్ వాణిజ్య నౌకలకు ప్రమాదకరమని ఇరాన్ పేర్కొంది. నౌకలు ఈ మైన్లను ఢీకొంటే భారీ పేలుళ్లు జరిగే అవకాశం ఉన్నందున, సురక్షితమైన ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాలని సూచించింది.


ఇవి కూడా చదవండి

మిశ్రమంగా బంగారం, వెండి ధరలు

మహిళా, పునర్విభజన బిల్లులు సిద్ధం

Updated Date - Apr 10 , 2026 | 07:34 AM