అమెరికా కీలక రాడార్ ధ్వంసం
ABN , Publish Date - Mar 08 , 2026 | 04:57 AM
అమెరికా అమ్ములపొదిలో కీలకమైన థాడ్ రాడార్ వ్యవస్థను ఇరాన్ కుప్పకూల్చింది. దాని విలువ 30 కోట్ల డాలర్లు (రూ.2,758 కోట్లు). జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరం...
30కోట్ల డాలర్ల థాడ్ వ్యవస్థను ధ్వంసం చేసిన ఇరాన్
టెహ్రాన్‌లో అంతర్జాతీయ విమానాశ్రయంపై
ఇజ్రాయెల్ బాంబులు.. పలు విమానాలు ధ్వంసం
ఇకపై పొరుగుదేశాల మీద విరుచుకుపడం
ఇప్పటిదాకా చేసిన దాడులకు క్షమాపణ చెబుతున్నాం
లొంగిపోయే ప్రసక్తే లేదు: ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్
లొంగకపోతే.. నేలమట్టం చేస్తాం: డొనాల్డ్ ట్రంప్
తాజాగా ఉపగ్రహ చిత్రాలతో వెలుగులోకి
టెహ్రాన్‌లో విమానాశ్రయంపై ఇజ్రాయెల్ బాంబులు.. పలు విమానాలు ధ్వంసం
లొంగిపోయే ప్రసక్తే లేదు: ఇరాన్
లొంగకపోతే.. నేలమట్టం చేస్తాం: ట్రంప్
టెహ్రాన్, వాషింగ్టన్, మార్చి 7: అమెరికా అమ్ములపొదిలో కీలకమైన థాడ్ రాడార్ వ్యవస్థను ఇరాన్ కుప్పకూల్చింది. దాని విలువ 30 కోట్ల డాలర్లు (రూ.2,758 కోట్లు). జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరం మువా్‌ఫక్ సాల్టి ఎయిర్‌బే్‌సలో ఉన్న థాడ్ క్షిపణి వ్యవస్థ ఉపయోగించే ఏఎన్/టీపీవై-2 రాడార్‌తోపాటు దానికి ఉపయోగపడే పరికరాలు ఇరాన్ దాడిలో పూర్తిగా ధ్వంసమైనట్లు ఉపగ్రహ చిత్రాలు వెల్లడించాయి. యుద్ధం ప్రారంభమైన తొలిరోజుల్లోనే ఈ దాడి జరిగినట్లు బ్లూమ్‌బర్గ్ ఏజెన్సీ వెల్లడించింది. దీనిని ఒక అమెరికా అధికారి కూడా ధ్రువీకరించారు. జోర్డాన్ ఎయిర్‌బే్‌సలో మంగళవారం జరిగిన థాడ్ ధ్వంసం మొదటిది కాదని, సోమవారం యూఏఈలోని అమెరికా స్థావరంలో ఉన్న థాడ్ రాడార్‌ను కూడా ఇరాన్ నేలమట్టం చేసిందని చైనాకు చెందిన గ్లోబల్‌టైమ్స్ వెల్లడించింది.
దీర్ఘశ్రేణి క్షిపణులే లక్ష్యంగా..
శత్రుదేశాల దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకొని ధ్వంసం చేసే లక్ష్యంతో ‘యూఎస్ థర్మల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్’(థాడ్) వ్యవస్థను రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా 8 థాడ్ వ్యవస్థలను అమెరికా మోహరించింది. వాటిలో జోర్డాన్ సైనిక స్థావరంలో ఉన్నది ఒకటి. ఇరాన్ మీద అమెరికా-ఇజ్రాయెల్ ప్రారంభించిన యుద్ధంలో థాడ్‌ది కీలకపాత్ర. ఇరాన్ క్షిపణులను థాడ్‌తోనే ఎదుర్కోవాలని ఇరుదేశాలు భావించాయి. అయితే, ప్రస్తుతం అది ధ్వంసం కావటంతో.. పేట్రియాట్ క్షిపణుల మీదనే ఆధారపడే పరిస్థితి తలెత్తింది. పేట్రియాట్ క్షిపణులు, దానికి సంబంధించిన రాడార్ వ్యవస్థ స్వల్పశ్రేణి క్షిపణులను మాత్రమే అడ్డుకోగలవు. వాటితో దీర్ఘశ్రేణి క్షిపణులను అడ్డుకోవటం కుదరదు. అంతేకాదు, ఇరాన్ కురిపిస్తున్న క్షిపణులు, డ్రోన్ల వర్షంతో ఇప్పటికే పేట్రియాట్ క్షిపణులు కూడా అమెరికా వద్ద గణనీయంగా ఖర్చయ్యాయి.
టెహ్రాన్‌లో ఎయిర్‌పోర్టుపై ఇజ్రాయెల్ దాడి
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని మెహ్రాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇజ్రాయెల్ తాజాగా దాడులు చేసింది. ఈ ఘటనలో విమానాశ్రయంలో భారీ ఎత్తున పేలుళ్లు సంభవించి, అక్కడున్న పలు విమానాలు దగ్ధమయ్యాయని తెలుస్తోంది. ఎయిర్‌పోర్టుతోపాటు ఇతర ప్రాంతాల మీద కూడా ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది. పేలుళ్ల దాటికి పలు ఇళ్లు ధ్వంసమైనట్లు సమాచారం. మరోవైపు, ఇజ్రాయెల్‌కు 15 కోట్ల డాలర్ల (రూ.1380 కోట్లు) విలువైన ఆయుధాలు అమ్మటానికి అమెరికా ప్రభుత్వం తాజాగా అంగీకరించింది. ఈ మేరకు ఇరుదేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.
‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ పేరుతో యుద్ధం ప్రారంభమై వారం రోజులు గడిచిన నేపథ్యంలో అమెరికా సెంట్రల్ కమాండ్ శనివారం ఒక ప్రకటన చేస్తూ.. ఇరాన్‌లో ఇప్పటి వరకూ 3 వేల లక్ష్యాల మీద దాడి చేశామని, ఇది కొనసాగుతుందే తప్ప తగ్గదని పేర్కొన్నారు.
220 మంది అమెరికా సైనికుల హతం: ఇరాన్
తాము చేసిన ప్రతిదాడుల్లో పలువురు అమెరికన్ సైనికులు హతమయ్యారని ఇరాన్ శనివారం ప్రకటించింది. బహ్రెయిన్‌లోని అమెరికా ఫిఫ్త్ ఫ్లీట్ మీద జరిపిన దాడిలో 21 మంది సైనికులు, అల్‌దఫ్రా వైమానిక స్థావరంపై జరిపిన దాడిలో దాదాపు 200 మంది సైనికులు మరణించారని వెల్లడించింది. కాగా, శనివారం ఉదయం అల్ ధఫ్రా ఎయిర్‌బేస్ మీద డ్రోన్ దాడుల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ధ్వంసమైందని ఇరాన్ తెలిపింది. పర్షియన్‌గల్ఫ్‌తోపాటు హొర్ముజ్ జలసంధిలో అమెరికా దళాలకు దిక్సూచిగా అల్‌దఫ్రా ఎయిర్‌బేస్ పని చేస్తోంది.
పొరుగు దేశాల మీద దాడులు చేయం.. కానీ: పెజెష్కియాన్
ఇరాన్ బేషరతుగా, సంపూర్ణంగా లొంగిపోవాలన్న ట్రంప్ హెచ్చరికను ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ శనివారం తోసిపుచ్చారు. ఇరాన్ శత్రువులు అటువంటి ఆశల్ని తమతోపాటు తమ సమాధుల్లోకి తీసుకెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. కాగా, ఇక మీదట తమ పొరుగుదేశాల మీద దాడులు చేయబోమని, ఆయా దేశాల నుంచి తమ మీద దాడులు జరగనంతవరకూ దీనికి కట్టుబడి ఉంటామని పెజెష్కియాన్ తెలిపారు. ఇప్పటి వరకూ తాము చేసిన దాడులకుగాను పొరుగుదేశాలకు ఇరాన్ ప్రజల తరఫున క్షమాపణ చెబుతున్నామన్నారు. అంతకుముందు, శనివారం ఉదయం దుబయ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఒక డ్రోన్ దాడి జరిగింది. ఆ ప్రాంతమంతా భారీగా పొగ వ్యాపించింది. దీంతో ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని.. ఎయిర్‌పోర్ట్ వద్ద ట్రెయిన్ టన్నెల్స్‌లోకి పరుగులు తీశారు. విమానాల రాకపోకలను కొద్దిసేపు నిలిపివేశారు.
లొంగకపోతే పూర్తిగా ధ్వంసం: ట్రంప్
ఇరాన్ మీద మరిన్ని తీవ్రమైన దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇజ్రాయెల్‌తో కలిసి తాము నిరంతరం జరుపుతున్న దాడుల కారణంగానే ఇరాన్ క్షమాపణలు చెప్పి పశ్చిమాసియా దేశాలకు లొంగిపోయిందన్నారు. పశ్చిమాసియాను ఆక్రమించి పాలించాలని ఇరాన్ భావిస్తోందని ఆరోపించారు. అది ఎన్నటికీ సాధ్యం కాదని, పశ్చిమాసియాలో పరాజిత దేశంగా ఇరాన్ మిగిలిపోతుందని శాపనార్థాలు పెట్టారు. ఇరాన్ లొంగిపోవాలని.. లేదంటే పూర్తిగా ధ్వంసమవుతుందని హెచ్చరించారు.
ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చలేం!
ఇరాన్ మీద పెద్ద ఎత్తున యుద్ధం జరిపినా కూడా.. ఆ దేశంలో ప్రభుత్వం కుప్పకూలే పరిస్థితి లేదని అమెరికా జాతీయ నిఘా విభాగం పేర్కొన్న ఒక రహస్య నివేదిక తాజాగా బయటకు వచ్చింది. ఇరాన్ ప్రభుత్వంలో స్పష్టమైన పని విభజన ఉందని, అత్యున్నత స్థానాల్లో ఉన్న వాళ్లు మరణించినా కూడా.. ప్రభుత్వ పనితీరు యథావిధిగా నడిచేలా మార్గనిర్దేశకాలున్నాయని, ప్రజా ఆందోళనలు ప్రభావవంతంగా లేవని ఆ నివేదిక పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
ఇకపై దాడులు చేయం...గల్ఫ్ దేశాలకు సారీ చెప్పిన ఇరాన్ అధ్యక్షుడు
ఇరాన్ బేషరతుగా లొంగిపోవాల్సిందే.. ట్రంప్ స్పష్టీకరణ