చనిపోయిన చిన్నారుల బ్యాగులతో చర్చలకు.. కంటతడి పెట్టిస్తున్న దృశ్యాలు
ABN , Publish Date - Apr 11 , 2026 | 10:46 AM
చర్చలకు పాకిస్థాన్ వచ్చిన ఇరాన్ ప్రతినిధులు విమానంలో తమతో పాటు ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన స్కూలు పిల్లల ఫొటోలు, రక్తంతో తడిసిన వారి బ్యాగులు, ఇతర వస్తువులను కూడా తీసుకువచ్చారు.
ఇస్లామాబాద్, ఏప్రిల్ 11: ఇరాన్ నాయకులను లక్ష్యంగా చేసుకుని టెహ్రాన్‌తో పాటు పలు నగరాలపై ఫిబ్రవరి 28వ తేదీ మధ్యాహ్నం ఇజ్రాయెల్, అమెరికా భీకర బాంబుదాడులు చేసిన సంగతి తెలిసిందే. మినాబ్ నగరంలోని ఓ బాలికల పాఠశాలపై బాంబు దాడి జరగ్గా.. 175 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 110 మంది విద్యార్థినులు, 26 మంది ఉపాధ్యాయులు, పిల్లలను ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చిన తల్లిదండ్రులు కూడా ఉన్నారు. దాదాపు 96 మంది దాకా తీవ్రంగా గాయపడ్డారు. ఇరాన్ ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. స్కూలుపై దాడి చేయటం ఏంటంటూ ఇజ్రాయెల్, అమెరికాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
చిన్నారుల బ్యాగులతో చర్చలకు..
ఈ రోజు (శనివారం) పాకిస్థాన్‌లో రెండు దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, అమెరికా ప్రత్యేక ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జేరెడ్ కుష్ననర్‌లు ఇప్పటికే పాకిస్థాన్ చేరుకున్నారు. పాకిస్థాన్ వచ్చిన ఇరాన్ ప్రతినిధి బృందంలో విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాక్చీ, రక్షణ మండలి కార్యదర్శి అలీ అక్బర్ అహ్మదియాన్, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అబ్దుల్ నాజర్ హెమ్మతి తదితరులు ఉన్నారు. చర్చలకు పాకిస్థాన్ వచ్చిన ఇరాన్ ప్రతినిధులు విమానంలో తమతో పాటు ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన స్కూలు పిల్లల ఫొటోలు, రక్తంతో తడిసిన వారి బ్యాగులు, ఇతర వస్తువులను కూడా తీసుకువచ్చారు.
ఒక్కో సీటులో ఒక్కో చిన్నారికి సంబంధించిన ఫొటో, ఇతర వస్తువుల్ని ఉంచారు. విమానం పాకిస్థాన్‌లో ల్యాండ్ అయిన తర్వాత ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘెర్ గాలిబఫ్ చిన్నారుల ఫొటోల దగ్గరకు వెళ్లారు. వాటిని చూస్తూ కంటతడి పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఆదిత్య రాజ్ కౌల్ ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఆ పోస్టుపై స్పందిస్తున్న నెటిజన్లు పిల్లల ప్రాణాలు బలి తీసుకున్న ఇజ్రాయెల్, అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
వెనక్కి తగ్గిన తుషార.. శ్రీలంక బోర్డుకు క్షమాపణలు..
బస్సులో అగ్నిప్రమాదం.. ఆందోళనలో ప్రయాణికులు