Share News

అమెరికా దాడులపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం.. సహకరించే దేశాలను లక్ష్యాలుగా చేసుకుంటామని హెచ్చరిక!

ABN , Publish Date - Jul 13 , 2026 | 07:16 AM

అమెరికా జరిపిన తాజా సైనిక దాడులపై ఇరాన్ తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ దాడులు ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను ఉల్లంఘించడమేనని అభివర్ణించిన ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ, వాషింగ్టన్ చర్యలు ప్రాంతీయ స్థిరత్వాన్ని, కాల్పుల విరమణ ఒప్పందాన్ని దెబ్బతీస్తున్నాయని ఆరోపించింది.

అమెరికా దాడులపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం.. సహకరించే దేశాలను లక్ష్యాలుగా చేసుకుంటామని హెచ్చరిక!
Iran Condemns US Strikes, Warns Countries Aiding Washington Could Become Legitimate Targets

టెహ్రాన్, జులై 13: అమెరికా జరిపిన తాజా సైనిక దాడులపై ఇరాన్ తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ దాడులను ఐక్యరాజ్యసమితి (UN) చార్టర్‌ను స్పష్టంగా ఉల్లంఘించడమేనని అభివర్ణించిన ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ, వాషింగ్టన్ చర్యలు ప్రాంతీయ స్థిరత్వాన్ని, కాల్పుల విరమణ ఒప్పందాన్ని దెబ్బతీస్తున్నాయని ఆరోపించింది. ఇది ముమ్మాటికీ ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచడమేనని ఆరోపించింది. ఈ మేరకు ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ, అమెరికాకు సహకరించే దేశాలకు ఇరాన్ గట్టి హెచ్చరికలు జారీ చేసింది.


'ఆ దేశాలు కూడా మా లక్ష్యాలే'

అమెరికా తమపై దాడులు చేయడానికి ఏ దేశమైనా తన భూభాగాన్ని లేదా సదుపాయాలను ఉపయోగించుకోవడానికి అనుమతిస్తే, ఆ దేశాలను కూడా తాము శత్రువులుగానే పరిగణిస్తామని ఇరాన్ స్పష్టం చేసింది. 'ఇరాన్‌పై సైనిక దాడులు చేయడానికి ఏ దేశ భూభాగం లేదా సదుపాయాలు ఉపయోగించినా, దానిని దురాక్రమణకు మూలంగా పరిగణిస్తాం. ఇరాన్ సాయుధ దళాల రక్షణాత్మక చర్యల్లో భాగంగా వాటిని చట్టబద్ధమైన లక్ష్యాలుగా (Legitimate Targets) చూస్తాం'. అని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.


అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలు 'పచ్చి అబద్ధం'

ఇటీవల మస్కట్‌లో జరిగిన చర్చల ఫలితాలపై అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను ఇరాన్ పూర్తిగా తోసిపుచ్చింది. వాటిని 'పచ్చి అబద్ధం' గా తేల్చింది. మస్కట్ చర్చలు కేవలం హోర్ముజ్ జలసంధి నిర్వహణ, అంతర్జాతీయ షిప్పింగ్ మార్గాల భద్రతకు సంబంధించిన ఏర్పాట్లపైనే జరిగాయని, అమెరికా అధ్యక్షుడు చిత్రీకరిస్తున్నట్లుగా కాదని ఇరాన్ స్పష్టం చేసింది.


ఐరాస స్పందనపై అసంతృప్తి

అమెరికా జరిపిన సైనిక చర్యలపై ఐక్యరాజ్యసమితి సెక్రటేరియట్ స్పందించిన తీరు సరిగ్గా లేదని ఇరాన్ విమర్శించింది. అంతర్జాతీయ చట్టాలను, ఐరాస చార్టర్‌ను ఉల్లంఘించిన అమెరికాను జవాబుదారీగా చేయాలని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్, భద్రతా మండలిని (UNSC) ఇరాన్ కోరింది.


అసలేం జరిగిందంటే..?

హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లే వాణిజ్య నౌకలు, పౌరులపై దాడులు చేసే ఇరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) నిన్న (ఆదివారం) ఇరాన్‌పై సరికొత్త సైనిక దాడులను ప్రారంభించింది. అంతకుముందు శనివారం కూడా అమెరికా దళాలు ల్యాండ్, సీ-బేస్డ్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్, డ్రోన్లు, నౌకాదళ నౌకల ద్వారా దాదాపు 140 ఇరాన్ సైనిక లక్ష్యాలపై కచ్చితమైన దాడులు చేశాయి. ఇందులో ఇరాన్ క్షిపణి, డ్రోన్ సైట్లు, నౌకాదళ సామర్థ్యాలు, మందుగుండు సామగ్రి నిల్వ కేంద్రాలు, తీర నిఘా ప్రాంతాలు ఉన్నాయి. అమెరికా దాడుల అనంతరం దక్షిణ ఇరాన్ నగరాలైన జాస్క్, బందర్ అబ్బాస్, సిరిక్‌లలో మూడు భారీ పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ ప్రెస్ టీవీ ధృవీకరించింది.


అంతర్జాతీయ ఆందోళన

మరోవైపు, ఇరాన్-అమెరికా మధ్య పెరుగుతున్న సైనిక ఘర్షణలపై ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఉద్రిక్తతలు ప్రాంతీయంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర పరిణామాలకు దారితీస్తాయని ఆయన హెచ్చరించారు.


Also Read:

తులసి ఆకులు నమిలితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయా?

ఈ డ్రై ఫ్రూట్స్‌ను మితంగా తినాలి.. ఎక్కువగా తింటే డేంజర్

Updated Date - Jul 13 , 2026 | 09:18 AM