ఇరాన్‌లో హైలర్ట్.. గగనతలం మూసివేత
ABN , Publish Date - May 23 , 2026 | 12:23 PM
అమెరికా మళ్లీ దాడులు మొదలుపెడుతుందన్న వార్తల నడుమ ఇరాన్ అప్రమత్తమైంది. దేశ పశ్చిమప్రాంతంలో గగనతలాన్ని సోమవారం వరకూ మూసివేస్తూ నోటామ్‌ను జారీ చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా మరోసారి దాడులకు సిద్ధం అవుతోందన్న వార్తల నేపథ్యంలో ఇరాన్ అప్రమత్తమైంది. తమ దేశ పశ్చిమ ప్రాంతంలో గగనతలాన్ని సోమవారం వరకూ మూసివేస్తూ నొటామ్‌ను (నోటీస్ టూ ఎయిర్‌మెన్) జారీ చేసింది. ఈ పరిణామంతో గల్ఫ్‌లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. యూఎస్ మరోసారి యుద్ధాన్ని ప్రారంభించిన పక్షంలో దీటుగా ఎదుర్కొనేందుకు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్, ఇతర సాయుధ దళాలు సిద్ధమవుతున్నట్టు ఇరాన్ వార్తా సంస్థ తస్నిమ్ ఒక కథనాన్ని ప్రచురించింది. అమెరికా ఆస్తులకు నష్టం కలిగేలా, ప్రయోజనాలు దెబ్బతినేలా దాడులకు ప్రణాళికలను ఇరాన్ మిలిటరీ సిద్ధం చేసినట్టు సమాచారం.
ఈ వారాంతాన్ని న్యూజెర్సీలో గడపాల్సిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చివరి నిమిషంలో తన ప్లాన్స్‌ను అకస్మాత్తుగా రద్దు చేసుకుని రాజధాని వాషింగ్టన్‌కు తిరిగొచ్చారు. దీంతో, పశ్చిమాసియాలో మళ్లీ ఘర్షణలు మొదలవుతాయన్న వార్తలు మీడియాలో వెలువడ్డాయి. ఈ వారాంతంలో మెమోరియల్ డే వేడుకల్లో పాల్గొనాల్సిన అమెరికా నిఘా సంస్థల సీనియర్ అధికారులు కూడా తమ ప్రణాళికలను రద్దు చేసుకుని వాషింగ్టన్‌కు తిరిగొచ్చేశారు. రాబోయే 24 గంటల్లో దౌత్యపరమైన పురోగతి లేని పక్షంలో దాడులు మొదలుపెట్టేందుకు ట్రంప్ కూడా సుముఖంగానే ఉన్నట్టు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. పరిస్థితులు అంతకంతకూ ఉద్రిక్తంగా మారుతున్నా తెరవెనుక దౌత్యమార్గాల్లో ప్రయత్నాలు ముమ్మర స్థాయిలో జరుగుతున్నట్టు కూడా తెలుస్తోంది. చర్చల్లో కొంత పురోగతి కనిపించిందని విశ్వసనీయ వర్గాలు చెప్పినట్టు తస్నిమ్ వార్తా సంస్థ పేర్కొంది.
ఈ వార్తలనూ చదవండి:
టీవీ షో వ్యాఖ్యాతను ఎత్తి చెత్తబుట్టలో వేసి.. ట్రంప్ మరో వీడియో వైరల్
ఇవాంకా ట్రంప్ హత్యకు కుట్ర? ఇరాన్‌లో శిక్షణ పొందిన ఉగ్రవాది అరెస్టు..