ట్రంప్ 48 గంటల డెడ్‌లైన్.. ఏమాత్రం వెనక్కు తగ్గని ఇరాన్
ABN , Publish Date - Mar 22 , 2026 | 04:40 PM
ట్రంప్ వార్నింగ్ వేళ ఇరాన్ ఓ కీలక ప్రకటన చేసింది. హోర్ముజ్ ఐల్యాండ్‌లో శత్రువులకు సంబంధించిన ఎఫ్ 15 ఫైటర్ జెట్‌ను కూల్చేశామని తెలిపింది. టెహ్రాన్ టైమ్స్ ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ఎక్స్ ఖాతాలో విడుదల చేసింది.
టెహ్రాన్, మార్చి 22: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు హోర్ముజ్ జలసంధి విషయంలో 48 గంటల డెడ్‌లైన్ విధించిన సంగతి తెలిసిందే. హోర్ముజ్ జలసంధిని 48 గంటల్లోగా పునరుద్ధరించాలని, లేదంటే ఇరాన్ విద్యుత్ కేంద్రాలను నేలమట్టం చేస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అతిపెద్ద కేంద్రం నుంచే ఈ దాడులు మొదలవుతాయని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘ది ట్రూత్’లో శనివారం ఓ పోస్టు పెట్టారు. ట్రంప్ అల్టిమేటం ఇచ్చినా ఇరాన్ మాత్రం కొంచెం కూడా వెనక్కు తగ్గటం లేదు.
ఎఫ్ 15 ఫైటర్ జెట్‌ను కూల్చేశాం: ఇరాన్
ట్రంప్ వార్నింగ్ వేళ ఇరాన్ ఓ కీలక ప్రకటన చేసింది. హోర్ముజ్ ఐల్యాండ్‌లో శత్రువులకు సంబంధించిన ఎఫ్ 15 ఫైటర్ జెట్‌ను కూల్చేశామని తెలిపింది. టెహ్రాన్ టైమ్స్ ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ఎక్స్ ఖాతాలో విడుదల చేసింది. 29 సెకన్ల ఆ వీడియోలో ఇరాన్ దళాలు హోర్ముజ్ ఐల్యాండ్‌పై ఎఫ్ 15 ఫైటర్ జెట్‌ను గుర్తించి పేల్చివేసిన దృశ్యాలు ఉన్నాయి. అయితే, ఆ ఫైటర్ జెట్ అమెరికాకు చెందినదా లేదా ఇజ్రాయెల్‌కు చెందినదా అన్నది తెలియరాలేదు. ఇరాన్ కూడా దీనిపై క్లారిటీ ఇవ్వలేదు.
మరింత పెరిగిన ఉద్రిక్తతలు..
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. డిమోనా అణు పరిశోధనా కేంద్రం లక్ష్యంగా ఇరాన్ దాడులు చేసింది. డిమోనా ప్రాంతంలో ఇజ్రాయెల్ అణుబాంబులు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇరాన్ దాడి తర్వాత అణు రేడియోధార్మికత ఎక్కువైందని ఐఏఈఏ ప్రకటించింది. ఇరాన్ దాడులతో ఇజ్రాయెల్ రగిలిపోతోంది. ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని ఐడీఎఫ్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడుతున్నాయి. ఇరాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా క్షిపణుల వర్షం కురిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ మంత్రులతో మోదీ కీలక భేటీ
చార్టర్డ్ ఫ్లైట్ డిమాండ్.. విరాట్ రియాక్షన్ ఇదే!