Share News

అమెరికాతో డీల్‌ వద్దు

ABN , Publish Date - Jun 15 , 2026 | 03:41 AM

యుద్ధాన్ని ముగించేందుకు అమెరికాతో ఇరాన్‌ ప్రభుత్వం శాంతి ఒప్పందానికి సిద్ధపడడంపై ఇరాన్‌ ప్రజల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి.

అమెరికాతో డీల్‌ వద్దు

  • ఇరాన్‌లోని పలు నగరాల్లో నిరసనలు

  • విదేశాంగ మంత్రి అబ్బాస్‌ వైదొలగాలని డిమాండ్‌

  • ఒప్పందంపై డైలమా.. యురేనియం చుట్టూ పద్మవ్యూహం

  • డీల్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌లోనూ ర్యాలీలు

టెహ్రాన్‌, జూన్‌ 14: యుద్ధాన్ని ముగించేందుకు అమెరికాతో ఇరాన్‌ ప్రభుత్వం శాంతి ఒప్పందానికి సిద్ధపడడంపై ఇరాన్‌ ప్రజల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సంప్రదాయ వర్గం ముస్లింలు ప్రతిపాదిత డీల్‌కు వ్యతిరేకంగా భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. అమెరికాతో చర్చల్లో కీలకపాత్ర పోషిస్తున్న విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీనే అందరూ నిందిస్తున్నారు. అమెరికా దాడిలో మరణించిన సుప్రీంలీడర్‌ అలీ ఖమేనీ పుట్టిన మషాద్‌ పట్టణంలోని విదేశాంగ శాఖ కార్యాలయం ముందు శనివారం భారీ సంఖ్యలో గుమిగూడిన ఆందోళనకారులు.. అబ్బాస్‍కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘ద్రోహి అబ్బాస్‌ అరాగ్చీ, అరాగ్చీని చంపేయాలి, అరాగ్చీ అమెరికాకు లొంగిపోయాడు’ అని పెద్దపెట్టున నినాదాలు చేశారు. దేశంలోని ఇతర ముఖ్య పట్టణాల్లో కూడా ర్యాలీలు జరిగాయి. అబ్బాస్‌ అరాగ్చీ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో ఈ డీల్‌ గురించి అబ్బాస్‌ మాట్లాడిన తర్వాత నిరసన ప్రదర్శనలు ఎక్కువయ్యాయి. ప్రతిపాదిత డీల్‌కు ఒప్పుకుంటే హోర్ముజ్‌ జలసంధిపై ఇరాన్‌ పట్టు కోల్పోతుందని నిరసనకారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. శాంతి ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్థాన్‌ నేతలను కూడా ఇరాన్‌ ప్రజలు నిందిస్తున్నారు. మరోవైపు ఈ డీల్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌లోనూ నిరసన ప్రదర్శనలు జరిగాయి. డీల్‌కు అమెరికా ఒప్పుకుంటే ఇరాన్‌ మరింత బలపడుతుందని, యుద్ధం లక్ష్యం నీరుగారిపోతుందని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా శాంతి ఒప్పందంపై ఇంకా డైలమా కొనసాగుతూనే ఉంది. ఆదివారమే ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించినా.. అలాంటిదేమీ జరగలేదు. ఒప్పందానికి ఇంకా సమయం పడుతుందని ఇరాన్‌ మీడియా ఆదివారం వెల్లడించింది. కాగా, ఆదివారం లెబనాన్‌ రాజధాని బీరూట్‌పై ఇజ్రాయెల్‌ దాడి చేయడాన్ని ట్రంప్‌ ఖండించారు. ఒప్పందాన్ని చెడగొట్టవద్దని నెతన్యాహుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


యురేనియం చుట్టూ పద్మవ్యూహం

ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత ఆ దేశంలోని యురేనియంను కూడా తాము తెచ్చుకుంటామని ట్రంప్‌ ప్రకటించినప్పటికీ అది అంత తేలికైన పని కాదని తెలుస్తోంది. 60 శాతానికి పైగా శుద్ధిచేసిన ఆ యురేనియం సమీపానికి కూడా ఎవరూ వెళ్లకుండా ఇరాన్‌ అత్యంత కఠినమైన పద్మవ్యూహం లాంటి ఉచ్చులు ఏర్పాటు చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇరాన్‌లో ఇస్ఫహాన్‌, నతాంజ్‌, ఫోర్దో అణు కేంద్రాలు కీలకమైనవి. ఎత్తయిన కఠిన పర్వతాల కింద వందల అడుగుల లోతులో సొరంగాల్లో ఇవి ఉన్నాయి. గతేడాది జూన్‌లో అమెరికా బంకర్‌ బస్టర్‌ బాంబులతో ఈ సొరంగాలను పేల్చివేసింది. అయితే, అవి పూర్తిగా ధ్వంసం కాలేదని సమాచారం. ఇరాన్‌ వద్ద శుద్ధిచేసిన యురేనియం 440 కిలోలవరకు ఉన్నట్లు అంచనా. ఇందులో ఎక్కువ మొత్తం ఇస్ఫహాన్‌ కేంద్రంలోనే ఉన్నట్లు సమాచారం. అది కూడా వాయువు రూపంలో సెంట్రివ్యూజుల్లో ఉన్నట్లు చెబుతున్నారు. ఆ యురేనియం వద్దకు ఎవరూ వెళ్లకుండా ఇరాన్‌ గుహల ముఖద్వారాలను కూల్చివేసినట్లు, గుహలకు వెళ్లే దారిలో అడుగడుగునా మందుపాతరలు పాతిపెట్టినట్లు సమాచారం.

Updated Date - Jun 15 , 2026 | 03:41 AM