హోర్ముజ్‌లో కలకలం! నావలో మంటలు.. భారతీయుడి మృతి
ABN , Publish Date - May 09 , 2026 | 07:07 PM
హోర్ముజ్ జలసంధిలోని నావలో మంటలు చెలరేగడంతో ఒక భారతీయ నావికుడు కన్నుమూశారు. ఘటన సమయంలో నావలో మొత్తం 18 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనలో గాయపడ్డ వారికి దుబాయ్‌లోని ఒక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: హోర్ముజ్ జలసంధికి సమీపంలో ఒక నావలో మంటలు చెలరేగడంతో ఒక భారతీయ నావికుడు కన్నుమూసినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ ఘటనలో మరో నలుగురు గాయాలపాలైనట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ప్రమాద సమయంలో నావలో 18 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. మంటలు చెలరేగటానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనలో గాయపడ్డ వారికి దుబాయ్‌లో వైద్య చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై దుబాయ్‌లోని భారతీయ కాన్సులేట్ కూడా స్పందించింది. క్షతగాత్రులను ఆసుపత్రిలో పరామర్శించామని తెలిపింది. నావ యజమానితో నిత్యం అందుబాటులో ఉన్నామని కూడా పేర్కొంది. అన్ని రకాల సాయాలను అందిస్తున్నామని తెలిపింది. ఈ ఘటన విచారకరమని కూడా పేర్కొంది.
ఇరాన్, యూఎస్ మధ్య హోర్ముజ్ వేదికగా ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్న వేళ ఈ పరిణామానికి ప్రాధాన్యం ఏర్పడింది. శుక్రవారం హోర్ముజ్‌లో ఇరాన్, యూఎస్ దళాలు పరస్పరం కాల్పులకు దిగిన విషయం తెలిసిందే. మొదట కాల్పులకు దిగింది అమెరికాయేనని ఇరాన్ ఆరోపించింది. నౌకలను, సాధారణ పౌరులను అమెరికా టార్గెట్ చేసిందని ఆరోపించింది. కానీ ఇరాన్ దాడులకు తాము ప్రతిదాడులు మాత్రమే చేశామని అమెరికా తేల్చి చెప్పింది. ఈ కాల్పులను చిన్న విషయంగా కొట్టిపారేసిన యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ ఆ తరువాత ఇరాన్‌కు గట్టి హెచ్చరిక చేశారు. చర్చలను మళ్లీ ప్రారంభించకపోతే ఇలాంటి దాడులను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఈ వార్తలనూ చదవండి:
వచ్చే వారం ఇస్లామబాద్‌కు అమెరికా, ఇరాన్ ప్రతినిధులు.. శాంతి చర్చలు జరగబోతున్నాయా..
లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. ఐదుగురి మృతి..