ఇరాన్‌లోని భారతీయులకు కీలక సూచన.. హెల్ప్‌లైన్ నంబర్ల విడుదల
ABN , Publish Date - Feb 23 , 2026 | 02:54 PM
ఇరాన్‌పై ఏ క్షణమైనా అమెరికా దాడి చేసే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌లో నివసిస్తున్న భారతీయులకు భారత ప్రభుత్వం కీలక సూచన చేసింది. ఇరాన్‌ను సాధ్యమైనంత త్వరగా వీడాలని వారికి సూచించింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: ఇరాన్‌పై ఏ క్షణమైనా అమెరికా దాడి చేసే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌లో నివసిస్తున్న భారతీయులకు భారత ప్రభుత్వం కీలక సూచన చేసింది. ఇరాన్‌ను సాధ్యమైనంత త్వరగా వీడాలని వారికి సూచించింది. ఇరాన్ వీడి.. స్వదేశానికి వచ్చే క్రమంలో వాణిజ్య విమానాలు సహా అందుబాటులో ఉన్న ఏదైనా రవాణా సౌకర్యాలను ఉపయోగించుకోవాలని వారిని కోరింది. ఇరాన్‌లో ఉన్న భారతీయ విద్యార్థులు, యాత్రికులు, వ్యాపారవేత్తలు, పర్యాటకులకూ ఈ సూచనలు వర్తిస్తాయని పేర్కొంది. ఈ మేరకు టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.
ఇరాన్‌లోని భారతీయ పౌరులు, భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అక్కడి ఎంబసీ తెలిపింది. అలాగే నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు జరిగే ప్రాంతాలకు వీలైనంత దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. అత్యవసరమైతే తమను సంప్రదించాలని సూచించింది. ఏమైనా తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటే స్థానిక మీడియా ఆశ్రయించాలని సలహా ఇచ్చింది.
ఎన్ఆర్ఐలు.. తమ పాస్‌పోర్ట్‌లు, ఇతర ముఖ్యమైన ప్రయాణ పత్రాలను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలని ఎంబసీ అధికారులు తెలిపారు. ఈ మేరకు టెహ్రాన్‌లోని తమ కార్యాలయంలో వారి పేర్లు నమోదు చేసుకోనివారు ఉంటే.. అధికారిక ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలని తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంలో అంటే.. 2026, జనవరి 5న కూడా ఇరాన్‌లోని భారతీయులకు ఇదే తరహా సూచనలు చేసిన సంగతి తెలిసిందే.
అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లివే..
ఇరాన్‌లో ఇంటర్నెట్ సమస్యలు ఉత్పన్నమైతే.. భారత్‌లోని తమ కుటుంబ సభ్యులతో ఇ-రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని స్పష్టం చేసింది. అత్యవసర సమయంలో భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలంటూ హెల్ప్‌లైన్ నంబర్లను విడుదల చేసింది.
+989128109115
+989128109109
+989128109102
+989932179359
అలాగే cons.tehran@mea.gov.in ఇ-మెయిల్ ద్వారా కూడా తమను సంప్రదించవచ్చని ఇరాన్‌లోని భారతీయులకు భారత్ సూచించింది.