మేమే కాదు..మీరూ లాభపడ్డారు
ABN , Publish Date - Oct 10 , 2026 | 02:27 AM
తమ ఉద్యోగులకు గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం కల్పించే ‘పర్మినెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్’ (పెర్మ్) నుంచి అంతర్జాతీయ, భారతీయ ఐటీ దిగ్గజ కంపెనీలను సస్పెండ్ చేస్తూ అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని భారత్ ఖండించింది.

భారతీయులకు ఉద్యోగాలొచ్చాయి..అమెరికా సంపద పెరిగింది
పరస్పరం ప్రయోజనం పొందాం..ఆ విషయాన్ని గుర్తించండి
భారతీయ ఐటీ కంపెనీలనుపెర్మ్ నుంచి అమెరికా సస్పెండ్ చేయడంపై భారత్ తీవ్ర ఆక్షేపణ
విదేశీ ఉద్యోగులు ‘ఒప్పంద బానిసలుఅన్న వాన్స్ వ్యాఖ్యలపై ఆగ్రహం
వాషింగ్టన్, న్యూఢిల్లీ, అక్టోబరు 9: తమ ఉద్యోగులకు గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకోవటానికి అవకాశం కల్పించే ‘పర్మినెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్’ (పెర్మ్) నుంచి అంతర్జాతీయ, భారతీయ ఐటీ దిగ్గజ కంపెనీలను సస్పెండ్ చేస్తూ అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని భారత్ ఖండించింది. ఈ తరహా చర్యలు ఇరుదేశాల ఉమ్మడి ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లవని స్పష్టం చేసింది. అమెరికన్లకు అవకాశాలు ఇవ్వకుండా విదేశీ ఐటీ నిపుణులను ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయన్న ఆరోపణలతో ఇన్ఫోసిస్, టాటా, విప్రో, హెచ్‌సీఎల్, మైక్రోసాఫ్ట్, అడోబ్, క్యాప్‌జెమినీ, కాగ్నిజెంట్ కంపెనీలను పెర్మ్ నుంచి అమెరికా సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం భారత విదేశాంగశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. నిపుణులైన భారతీయులు అమెరికాకు వెళ్లి ఉద్యోగాలు చేయటం వల్ల భారత్‌కే కాదు, అమెరికాకూ అపారమైన ప్రయోజనాలు కలుగుతున్నాయని గుర్తు చేసింది. ‘అమెరికా కంపెనీలు బలోపేతమవుతున్నాయి. అమెరికాలో సంపద పెరుగుతోంది’ అని పేర్కొంది. అమెరికాలో పని చేస్తున్న విదేశీ ఉద్యోగులను ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ‘ఒప్పంద బానిసలు’గా పేర్కొనటాన్ని కూడా విదేశాంగశాఖ తీవ్రంగా ఆక్షేపించింది. ‘ఇటువంటి వ్యాఖ్యలు సరైనవి కావు. అమెరికాలోని భారతీయ నిపుణులు బాగా చదువుకున్నవాళ్లు, ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు, ఆవిష్కరణల రంగానికి తమ నైపుణ్యాలతో ఎంతగానో తోడ్పాటును అందిస్తున్నవాళ్లు. తరతరాల వలసప్రజల శ్రమ, ఆవిష్కరణలతోనే అమెరికా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందింది అన్న విషయాన్ని మర్చిపోవద్దు’ అని హితవు పలికింది.
మాపై ప్రభావం ఉండదు: టీసీఎస్
పెర్మ్ నుంచి సస్పెండ్ చేయటం వల్ల తమ కంపెనీపై పెద్దగా ప్రభావం ఉండదని టీసీఎస్ ప్రకటించింది. అమెరికాలోని తమ సంస్థల్లో స్థానికులకే ఉద్యోగావకాశాల్లో ప్రాధాన్యమిస్తున్నామని, గత రెండేళ్లలో పెర్మ్ నియామకాలు రెండంకెల్లో కూడా లేవని స్పష్టం చేసింది. అమెరికా కార్మికశాఖ జారీ చేసే నిబంధనలను పూర్తిగా పాటిస్తున్నట్లు పేర్కొంది. అమెరికాలో తమ కంపెనీకి చెందిన 31 కార్యాలయాలు, డెలివరీ సెంటర్లు నడుస్తున్నాయని.. వచ్చే ఐదేళ్లలో మరో 15 వేల మందిని ఉద్యోగాల్లోకి తీసుకోనున్నామని తెలిపింది. మైక్రోసాఫ్ట్ కూడా తాజా పరిణామంపై స్పందిస్తూ.. అమెరికాలోని తమ ఉద్యోగుల్లో మెజారిటీ అమెరికన్లేనని వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వానికి తాము సమర్పించిన 6వేల హెచ్-1బీ వీసా దరఖాస్తుల్లో 20 శాతం మాత్రమే కొత్త వారివని స్పష్టం చేసింది. కాగా, వాన్స్ వ్యాఖ్యల నేపథ్యంలో అమెరికాలో పనిచేస్తున్న భారతీయులు తిరిగి ఇండియాకు వచ్చేయాలని జోహో సంస్థ వ్యవస్థాపకుడు శ్రీధర్ పిలుపునిచ్చారు.
టెక్ దిగ్గజాలు జాతీయ సంపద: ట్రంప్
మైక్రోసాఫ్ట్‌తోపాటు కీలక టెక్నాలజీ కంపెనీల అధిపతులకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శుక్రవారం ప్రతిష్ఠాత్మక ‘నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్’ పురస్కారాలను అందజేశారు. ఈ అవార్డు అందుకున్న వారిలో సత్య నాదెళ్ల (మైక్రోసాఫ్ట్), ఎలాన్ మస్క్ (స్పేస్ ఎక్స్), సెర్జీ బ్రిన్ (గూగుల్), జెన్‌సన్ హువా (ఎన్‌విడియా), లిసా సు (అడ్వాన్స్డ్ మైక్రో డివైజెస్) ఉన్నారు. వీరందరూ అమెరికాకు వలస వచ్చిన వారే కావటం విశేషం. ఈ టెక్ దిగ్గజాల అధిపతులను జాతీయ సంపదగా ట్రంప్ అభివర్ణించారు. ‘మైక్రోసా్‌ఫ్టను గత 30 ఏళ్లలో విప్లవాత్మకంగా కొత్తపుంతలు తొక్కించి ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు, విద్యార్థులు, వినియోగదారులకు సాధికారత కల్పించటంలో సత్య నాదెళ్ల కీలక పాత్ర పోషించారు’ అంటూ ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ఓవైపు, వీసా విధానాన్ని మైక్రోసాఫ్ట్ తీవ్రంగా దుర్వినియోగం చేసిందని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆరోపణలు గుప్పిస్తుంటే, మరోవైపు ట్రంప్ అదే సంస్థ అధిపతిని ఆకాశానికి ఎత్తటం విచిత్రం.
ఈ వార్తలు కూడా చదవండి
నోబెల్ దక్కలేదని ట్రంప్ అసహనం.. విజేత పిళ్లైపై విమర్శలు
జేడీ వాన్స్ వ్యాఖ్యలపై భారత్ తీవ్ర అభ్యంతరం