ఇండోనేషియాకు ‘బ్రహ్మోస్’.. ‘అస్త్ర’
ABN , Publish Date - Jul 08 , 2026 | 06:34 AM
ఇండోనేషియా పర్యటన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతోతో ప్రధాని మోదీ మంగళవారం ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య...
రెండు దేశాల మధ్య రక్షణ సంబంధాల విస్తరణ
ఈవీఎంల తయారీలో సాయం
ఆ దేశ చెల్లింపుల వ్యవస్థతో మన యూపీఐ అనుసంధానం
తూర్పు జావాలో ఐఐఎం బెంగళూరు క్యాంపస్ ఏర్పాటు
భారత్-ఇండోనేషియా మధ్య పలు కీలక ఒప్పందాలు
జకార్తా, జూలై 7: ఇండోనేషియా పర్యటన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతోతో ప్రధాని మోదీ మంగళవారం ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య రక్షణ, వాణిజ్యం, డిజిటల్, అంతరిక్షం, సాంకేతికత, సాంస్కృతిక రంగాల్లో సహకారాన్ని విస్తరిస్తూ పలు ఒప్పందాలు కుదిరాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో అద్భుత పనితీరు కనబర్చిన బ్రహ్మోస్ క్షిపణులను ఇండోనేషియాకు అందించడానికి భారత్ అంగీకారం తెలిపింది. అలాగే స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఎయిర్ టు ఎయిర్ క్షిపణి వ్యవస్థ ‘అస్త్ర’ను కూడా ఆ దేశానికి అందించనుంది. ఇండోనేషియాలో ఖనిజాలు, మైనింగ్ రంగంలో భారత్ పెట్టుబడులు పెట్టనుంది. ఖనిజాల వెలికితీత, ప్రాసెసింగ్‌కు సంబంధించిన సాంకేతికత మెరుగుదలకు సహకారం అందించనుంది. రెండు దేశాల మధ్య తీర రక్షణ దళాన్ని బలోపేతం చేయడం, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భద్రత, నౌకాయాన స్వేచ్ఛకు సహకారంపై ఒప్పందం కుదిరింది. ఇండోనేషియాలో స్టెయిన్‌లెస్ స్టీల్ శ్లాబ్ తయారీ కేంద్రం స్థాపనకు సెయిల్, పీటీ క్రాకటౌ స్టీల్ మధ్య ఉమ్మడి ఒప్పందం కుదిరింది. తూర్పు జావా ప్రావిన్స్‌లోని సింఘసరి ఎస్‌ఈజడ్‌లో బెంగళూరు ఐఐఎం క్యాంపస్ ఏర్పాటు కోసం కూడా ఒప్పందం జరిగింది. అదేవిధంగా ఇరు దేశాల పౌరులకు వ్యాపార లావాదేవీలను, సరిహద్దు ప్రయాణాలను సులభతరం చేసే దిశగా ఇండోనేషియా చెల్లింపుల వ్యవస్థతో భారత్ యూపీఐ లింక్ కానుంది. ఈవీఎంల ఎగుమతి, ఎన్నికల నిర్వహణ టెక్నాలజీకి సంబంధించి భారత్, ఇండోనేషియా అవగాహనా ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. భారత ఎన్నికల సంఘం ఇప్పటివరకు ఆస్ట్రేలియా, బ్రెజిల్, చిలీ, దక్షిణాఫ్రికా, ఫిజీ, మెక్సికో సహా 28 దేశాలు, మూడు అంతర్జాతీయ సంస్థలతో సహకార ఒప్పందాలు చేసుకుంది.
మోదీని కాపీ కొడుతుంటా: ప్రబోవో
ప్రధాని మోదీ కెరీర్‌ను, భారత్‌లో ఆయన అమలు చేస్తున్న కార్యక్రమాలను చాలావరకూ తాను కాపీ కొడుతుంటానని ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో తెలిపారు. దీనిని బహిరంగంగా అంగీకరించడానికి తనకు ఎలాంటి సంకోచమూ లేదన్నారు. మంగళవారం జకార్తాలో మోదీ గౌరవార్థం ఏర్పాటు చేసిన విందులో ఆయన మాట్లాడారు. భారత ప్రధాని కార్యక్రమాలకు కాపీరైట్ లేనందుకు కృతజ్ఞుడినని ఆయన చమత్కరించారు. అనంతరం దీనిపై మోదీ స్పందిస్తూ ‘అధ్యక్షుడు పబ్రోవో కాపీరైట్ గురించి ప్రస్తావించారు. ఈ ప్రేమ, ఆప్యాయత, స్నేహం, పరస్పర గౌరవ భావనపై కాపీరైట్ కలిగి ఉండటం ఎవరికీ సాధ్యం కాదు. ప్రబోవోతో నా స్నేహం కాపీరైట్ పరిమితులు అన్నింటినీ దాటిపోయింది’ అని వ్యాఖ్యానించారు. ఇండోనేషియాలోని యోగ్యకర్తాలో ఉన్న పురాతన ప్రంబనన్ ఆలయ సముదాయ పరిరక్షణ ప్రాజెక్టును అధ్యక్షుడు ప్రబోవోతో కలిసి బుధవారం ప్రారంభించనున్నట్లు మోదీ ప్రకటించారు.
మోదీకి ఇండోనేషియా అత్యున్నత పురస్కారం
ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించినందుకు గాను ప్రధాని మోదీని ఇండోనేషియా ప్రభుత్వం అత్యున్నత పురస్కారంతో గౌరవించింది. ‘బింటాంగ్ ఆదిపూర్ణ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియా’ పతకాన్ని ఆ దేశాధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో మోదీకి ప్రదానం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సింగరేణికి తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపు.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ సీఎం
రూ.15 విలువైన ఆర్డర్‌కు రూ.500 టిప్పు.. డెలివరీ బాయ్ రియాక్షన్ వీడియో వైరల్