ఆరోగ్యం క్షీణిస్తోంది.. జైల్లోనే నేను చనిపోవచ్చు: ఇమ్రాన్ ఖాన్
ABN , Publish Date - Nov 16 , 2026 | 06:18 PM
తన ఆరోగ్యం అంతకంతకూ క్షీణిస్తోందని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు. జైల్లో తనకు, తన భార్య బుష్రా బీబీకి సరైన వైద్యం దక్కడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: తన ఆరోగ్యం క్షీణిస్తోందని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు. జైల్లో తనకు, తన భార్య బుష్రా బీబీకి సరైన వైద్యం దక్కడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ పాక్ సుప్రీం కోర్టు న్యాయమూర్తులకు బహిరంగ లేఖ రాశారు. జైల్లోనే తాను మరణించవచ్చని లేఖలో పేర్కొన్నారు. ఇమ్రాన్ ఖాన్ లేఖను ఆయన లాయర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
తన కుడి కంటి చూపు 85 శాతం మేర తగ్గిపోయిందని ఇమ్రాన్ ఖాన్ లేఖలో పేర్కొన్నారు. తనకు గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు కూడా ఉందని అన్నారు. ఇటీవల తన భార్య బుష్రాకు కంటి ఆపరేషన్ తరువాత ఆమె చూపు మరింత తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె కంటిచూపు శాశ్వతంగా పోగొట్టుకునే ప్రమాదంలో ఉందని అన్నారు. తమకు సరైన వైద్య సాయం అందేలా చూడాలని గతంలోనే న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. అయినప్పటికీ జైలు అధికారుల తీరు వల్ల తమకు కావాల్సిన వైద్యసాయం అందట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 74 ఏళ్ల వయసున్న తనకు మళ్లీ కోలుకోలేని పరిస్థితి వస్తోందని చెప్పారు. జైల్లో నే మరణించవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.
‘ఓ జైలు గదిలో నన్ను ఒంటిరిగా ఖైదు చేశారు. బయటిప్రపంచం నుంచి ఎలాంటి సమాచారం అందకుండా చేశారు. రోజులో 22 గంటలు ఒంటరిగానే ఉంటున్నాను. బీపీ కారణంగా నాకు బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు ఉందని డాక్టర్లు చెప్పారు. ఓ మాజీ ప్రధాని గానో, రాజకీయ పార్టీ అధినేతగానో నేను ఈ లేఖ రాయట్లేదు. క్రికెట్ ద్వారా, దానధర్మాలు, ప్రజాసేవ ద్వారా జీవితాన్ని దేశం కోసం అంకితం చేసిన వ్యక్తిగా రాస్తున్నాను. ప్రజలకు ఉచితంగా వైద్యం అందించేందుకు ఆసుపత్రులు నిర్మించాను. ఈ పరిస్థితుల్లో నాకూ, నా భార్యకు మంచి వైద్యం దక్కాలని మాత్రమే కోరుకుంటున్నాను’ అని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు కాపాడలేవు.. బిగ్ బీకి బెదిరింపులు
ఎన్నికల సంఘానికి 48 ప్రశ్నలు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ