Hindu Man Set On Fire: బంగ్లాదేశ్‌లో ఆగని అరాచకాలు.. నెలలో నలుగురు హిందువులపై..
ABN , Publish Date - Jan 01 , 2026 | 04:49 PM
బంగ్లాదేశ్‌లో మతోన్మాదులు పెచ్చు మీరి విలయతాండవం చేస్తున్నారు. హిందువులను టార్గెట్‌గా చేసుకుని చంపేస్తున్నారు. గత నెలలో నలుగురు హిందులపై దాడులు జరిగాయి. ముగ్గురు చనిపోగా.. ఒకరు ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య ఉన్నాడు.
బంగ్లాదేశ్‌లో హిందువులపై మారణకాండలు ఆగటం లేదు. కొంతమంది మతోన్మాదులు టార్గెట్ చేసి మరీ హిందువులపై దాడులు చేసి చంపేస్తున్నారు. నెలలో నలుగురు హిందువులపై దాడులు జరగటం అక్కడి హిందువులను తీవ్రంగా భయపెడుతోంది. డిసెంబర్ 16వ తేదీన ఓ బట్టల ఫ్యాక్టరీలో పని చేస్తున్న దీపు చంద్రదాస్ అనే యువకుడు మతోన్మాదుల దాడికి గురయ్యాడు. అతడితో పాటు పని చేస్తున్న వారే దారుణానికి ఒడిగట్టారు. కొట్టి చంపేసి, చెట్టుకు వేలాడదీసి కాల్చేశారు. దైవ దూషణకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ ఈ ఘోరం చేశారు.
ఈ సంఘటన జరిగిన వారం రోజులకే రాజ్‌భరీలోని హోసయ్‌దంగ గ్రామానికి చెందిన 29 ఏళ్ల అమ్రిత్ మండల్ అలియాస్ సామ్రాట్ అనే యువకుడిని మతోన్మాదులు దారుణంగా కొట్టి చంపేశారు. దొంగతనాలకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ ఈ ఘోరానికి ఒడిగట్టారు. 29వ తేదీన సైల్‌హెట్ సదర్ కాదిర్‌పురకు చెందిన భజేంద్ర బిశ్వాస్ అనే 40 ఏళ్ల వ్యక్తి తనతో పాటు పని చేసే యువకుడి చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. ఆ యువకుడు భజేంద్రను తుపాకితో కాల్చి చంపేశాడు. పొరపాటున తుపాకీ పేలటంతో ఈ దారుణం జరిగిందని పోలీసులకు చెప్పాడు.
ఈ మూడు సంఘటనల నుంచి తేరుకోక ముందే మరో సంఘటన జరిగింది. డిసెంబర్ 31వ తేదీన ఖోకన్ దాస్ అనే హిందూ వ్యక్తి మతోన్మాదుల దాడిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యాడు. ఆస్పత్రి బెడ్‌పై ప్రాణాలతో పోరాడుతూ ఉన్నాడు. షరియాత్పూర్ జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. నిన్న రాత్రి ఖోకన్ దాస్ ఇంటికి వెళుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఓ గ్యాంగ్ అతడిపై కత్తులతో దాడి చేసింది. విచక్షణా రహితంగా పొడిచేసింది. తర్వాత అతడిపై గ్యాంగ్ సభ్యులు కిరోసిన్ పోసి నిప్పంటించారు. అక్కడినుంచి పారిపోయారు. స్థానికులు అతడ్ని గుర్తించి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
శీతాకాలంలో టీ ఎక్కువగా తాగడం.. వెచ్చగా ఉంటుందా లేదా డీహైడ్రేషన్ వస్తుందా?
పాముకు గోరు ముద్దలు తినిపిస్తే ఇలానే అవుతుంది.. పాపం ఆ వ్యక్తి..