Hindu Journalist Shot: బంగ్లాదేశ్‌లో వరుస దారుణాలు.. 24 గంటల్లో ఇద్దరు హిందువుల హత్య
ABN , Publish Date - Jan 06 , 2026 | 07:29 AM
డిసెంబర్ నెలలో ఏకంగా నలుగురు హిందువులు బంగ్లాదేశ్‌లో హత్యకు గురయ్యారు. దీపు చంద్రదాస్‌తో అలజడి మొదలైంది. డిసెంబర్ 31వ తేదీన ఖోకోన్ చంద్రదాస్‌కు ఓ గ్యాంగ్ దాడి చేసింది. పెట్రోల్ పోసి నిప్పంటించింది.
బంగ్లాదేశ్‌లో మరో హిందువు హత్యకు గురయ్యాడు. ఓ హిందూ జర్నలిస్ట్‌ను గుర్తు తెలియని దుండగులు తుపాకితో కాల్చి చంపారు. అంతటితో ఆగకుండా అతడి గొంతు కోసేశారు. ఈ దారుణ సంఘటన బంగ్లాదేశ్‌లోని జెస్సోర్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. కపాలి ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల రానా ప్రతాప్ అనే వ్యక్తి స్థానికంగా ఓ ఐస్ ఫ్యాక్టరీని నిర్వహిస్తున్నాడు. ఓ న్యూస్ పేపర్‌కు ఎడిటర్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. సోమవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ప్రతాప్ రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నాడు.
ఇద్దరు వ్యక్తులు బైకుపై అతడి దగ్గరకు వచ్చారు. ప్రతాప్‌తో గొడవ పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే తుపాకితో అతడి తలపై కాల్పులు జరిపారు. దాదాపు 7 బుల్లెట్లను కాల్చారు. 3 బుల్లెట్లు ప్రతాప్ తలలో దిగాయి. అనంతరం అతడి గొంతు కోసి అక్కడినుంచి పారిపోయారు. ప్రతాప్ అక్కడికక్కడే చనిపోయాడు. మర్డర్ గురించిన సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రతాప్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక, ఈ సంఘటనపై ప్రతాప్‌తో పాటు పని చేస్తున్న ఎడిటర్ అబ్దుల్ మాట్లాడుతూ..
‘రానా ప్రతాప్ మా యాక్టింగ్ ఎడిటర్. ఆయనపై పలు పోలీస్ కేసులు ఉండేవి. వాటన్నిటిలో ఆయన నిర్దోషిగా తేలారు. ఈ మర్డర్ జరగడానికి కారణం ఏంటో నాకు తెలియటం లేదు’ అని అన్నాడు.
24 గంటల్లో ఇద్దరు..
రానా ప్రతాప్ హత్య జరిగిన కొన్ని గంటల్లోనే మరో హత్య జరిగింది. 40 ఏళ్ల శరత్ మణి చక్రబర్తీ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి చంపేశారు. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఈ దారుణం జరిగింది.
కాగా, గత డిసెంబర్ నెలలో ఏకంగా నలుగురు హిందువులు బంగ్లాదేశ్‌లో హత్యకు గురయ్యారు. దీపు చంద్రదాస్‌తో అలజడి మొదలైంది. డిసెంబర్ 31వ తేదీన ఖోకోన్ చంద్రదాస్‌కు ఓ గ్యాంగ్ దాడి చేసింది. పెట్రోల్ పోసి నిప్పంటించింది. తీవ్రంగా గాయపడ్డ చంద్రదాస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ప్రాణాలు విడిచాడు. జనవరి నెలలో రానా ప్రతాప్ హత్య మొదటిది. వరుస హత్యలతో బంగ్లాదేశ్‌లోని హిందువులు బిక్కు బిక్కుమని బతుకుతున్నారు.
ఇవి కూడా చదవండి
పేలుడు పదార్థాల పరిశోధనలో హెచ్‌సీయూకు గుర్తింపు
నగరంలో మరో సైబర్ మోసం.. రూ.2.42 లక్షలకు టోకరా