బాలికపై లైంగిక వేధింపులు.. రోబోను సీజ్ చేసిన పోలీసులు
ABN , Publish Date - Oct 14 , 2026 | 11:34 AM
జర్మనీలోని కొలోన్ నగరంలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. 16 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపుల కేసులో పోలీసులు ఓ రోబోను సీజ్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: జర్మనీలోని కొలోన్ నగరంలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. 16 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపుల కేసులో పోలీసులు ఓ రోబోను సీజ్ చేశారు. రోబో వల్ల ఇబ్బంది పడ్డ బాలిక వీడియోను లైవ్ స్ట్రీమింగ్ చేసినట్టుగా కూడా వెలుగులోకి రావడం కలకలానికి దారి తీసింది. బాలిక వెనక వైపు నుంచి వచ్చిన రోబో ఆమెపై చేతులు వేసి అసభ్యకర చర్యలకు దిగినట్టు పోలీసులు తెలిపారు. గత ఆదివారం రాత్రి 11.45 సమయంలో రద్దీగా ఉన్న ఓ వీధిలో ఈ ఘటన జరిగింది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వద్ద తన ఫ్రెండ్స్‌తో పాటు ఉన్న బాలికతో రోబో అసభ్యంగా ప్రవర్తించింది.
ఈ ఘటనలో పోలీసులు ఇప్పటికే రోబోను సీజ్ చేశారు. సీసీటీవీ కెమెరా వీడియోను పరిశీలించి అసలేం జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ సమయంలో రోబోను ఎవరు ఆపరేట్ చేశారో తెలుసుకునేందుకు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. రోబోను కొనుక్కున్న ఓ 16 ఏళ్ల బాలుడు, అతడి స్నేహితుడు ఈ నీచానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ సమయంలో వారే బాలిక వీడియోలను తీసి ఉండచ్చని చెప్పారు. ఘటన తీవ్రతను నిర్ధారించాక లైంగిక దాడి ఆరోపణలపై కేసు నమోదు చేసే అవకాశం ఉందని అన్నారు.
రోబో కదలికలను గమనించిన పోలీసులు దాన్ని రిమోట్ కంట్రోల్‌తో ఆపరేట్ చేశారా? లేదా అలా ప్రోగ్రామింగ్ చేశారా? అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. ఇదో అసాధారణ ఘటన అని నగర పోలీసుల ప్రతినిధి తెలిపారు. ఇలాంటి కేసును తాము గతంలో ఎన్నడూ చూడలేదని అన్నారు. తమకు లభించిన మొబైల్ ఫోన్స్‌తో నిందితుల గుట్టురట్టయ్యే అవకాశం ఉందని అన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
పాక్‌లో లష్కర్ టాప్ కమాండర్ హత్య?
ఎగ్జిక్యూటివ్ రూమ్‌లో సీక్రెట్ మైక్.. ఓపెన్ఏఐ ఇంజినీర్ అరెస్ట్