సుప్రసిద్ధ బ్రిటిష్ రచయిత జెఫ్రీ ఆర్చర్ ఇక లేరు
ABN , Publish Date - Oct 07 , 2026 | 02:56 AM
ప్రముఖ బ్రిటిష్ రచయిత జెఫ్రీ ఆర్చర్(86) ఇక లేరు! 2014 నుంచి ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన.. లండన్‌లోని తన నివాసంలో సోమవారం తుదిశ్వాస విడిచారు.
తన చివరి నవల విడుదల
కావడానికి సరిగ్గా ఒక్కరోజు
ముందు కన్నుమూత
భారతీయులకు ఆంగ్ల నవలలపై
ఆసక్తి పెరగడానికి ప్రధాన
కారణం ఆయనే!
లండన్, అక్టోబరు 6: ప్రముఖ బ్రిటిష్ రచయిత జెఫ్రీ ఆర్చర్(86) ఇక లేరు! 2014 నుంచి ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన.. లండన్‌లోని తన నివాసంలో సోమవారం తుదిశ్వాస విడిచారు. తన చివరి నవల ‘ఆడమ్ అండ్ ఈవ్’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడానికి ఒక్కరోజు ముందు ఆయన కన్నుమూయడం గమనార్హం. ఇతర ఆంగ్ల రచయితలతో పోలిస్తే.. అందరికీ సులువుగా అర్థమయ్యేలా తేలికైన పదాలతో జెఫ్రీ ఆర్చర్ రాసే ఉత్కంఠభరిత నవలలు ఉర్రూతలూగిస్తాయని పేరుంది. మధ్యతరగతి భారతీయ పాఠకులకు ఆంగ్ల రచనలపై ఆసక్తి పెరగడానికి జెఫ్రీ ఆర్చరే కారణమంటే అతిశయోక్తి కాదు. అందుకే ఆయనకు తన స్వదేశంలో కన్నా భారత్‌లోనే ఎక్కువ అభిమానులున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ ఆయన పుస్తకాలు 30 కోట్లకు పైగా అమ్ముడు పోయాయి. బ్రిటన్‌లోని ఒక సాధారణ దిగువ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన ఆర్చర్.. 29 ఏళ్ల వయసులో (1969లో) ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీ అయ్యారు. కెనడాకు చెందిన ఒక ఫ్రాడ్ కంపెనీలో పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా దివాలా తీశారు. ఆ సమయంలో ఎదుర్కొన్న అప్పులవాళ్ల ఒత్తిడి, ఆర్థిక కష్టాల నేపథ్యంలో.. తనను మోసం చేసినవారి కథనే ఒక ఆసక్తికరమైన నవలగా రాస్తే? అన్న ఆలోచనతో ఆయన రాసిన మొదటి నవలే.. ‘నాట్ ఏ పెన్నీ మోర్, నాట్ ఏ పెన్నీ లెస్’. ఈ నవల ఇంటర్నేషనల్ బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. ఆ తర్వాత రాసిన కేన్ అండ్ ఏబెల్ ఆయన్ను స్టార్ రైటర్‌గా మార్చడంతో.. ఆర్చర్ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
‘‘శనివారం అక్టోబరు 10వ తేదీన సాయంత్రం 7 గంటలకు.. నా చివరి నవల ఆడమ్ అండ్ ఈవ్ గురించి చర్చిస్తాను’’ అని ఆయన తన చివరి ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో పెట్టారు. అది తన జీవితంలోనే అత్యుత్తమ నవల అని న్యూయార్క్‌టైమ్స్‌కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. కానీ, అది విడుదల కాకుండానే జెఫ్రీ ఆర్చర్ కన్నుమూశారు.
ఈ వార్తలు కూడా చదవండి
మోదీపై ట్రంప్‌నకు చాలా మంచి అభిప్రాయం: ఆస్ట్రేలియా మాజీ ప్రధాని
దుబాయ్ ముస్లింలపై ప్రేమ ఎందుకు? : సింగర్ మికా సింగ్