Share News

భార్యలు తమ భర్తల మాట వినాలి.. జెన్‌ జీ అబ్బాయిల అభిప్రాయం

ABN , Publish Date - Mar 07 , 2026 | 09:34 PM

సమాజంలో స్త్రీపురుషుల పాత్రపై జెన్-జీ తరం అభిప్రాయాన్ని తెలియజేసే ఒక సర్వే తాజాగా విడుదలైంది. కింగ్స్ కాలేజ్ లండన్ ఈ సర్వే ఫలితాలను తాజాగా ప్రచురించింది.

భార్యలు తమ భర్తల మాట వినాలి.. జెన్‌ జీ అబ్బాయిల అభిప్రాయం
Gen Z gender roles survey

ఇంటర్నెట్ డెస్క్: జెన్ జీ యువత అభిప్రాయాలపై తాజాగా విడుదలైన ఒక అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సమాజంలో, వ్యక్తిగత బంధాల్లో స్త్రీలు, పురుషుల బాధ్యతలపై జెన్ జీ యువత అభిప్రాయాలను తెలుసుకునేందుకు కింగ్స్ కాలేజ్ లండన్ ఒక సర్వే నిర్వహించింది. బ్రిటన్, యూఎస్ఏ, భారత్ సహా మొత్తం 29 దేశాల్లో 23 వేల మంది జెన్ జీ యువత అభిప్రాయాలతో ఈ అధ్యయనాన్ని ప్రచురించింది.

ఈ సర్వే ప్రకారం, భార్యలు తమ భర్తల మాటకు కట్టుబడి ఉండాలని 1997-2012 మధ్య పుట్టిన జెన్-జీ అబ్బాయిల్లో 31 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇక కుటుంబాలకు సంబంధించి భర్తలదే తుది నిర్ణయంగా ఉండాలని 33 శాతం మంది తెలిపారు.

అయితే, ముందు తరాల పురుషుల్లో ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన వారు సుమారు 13–17 శాతం మధ్యే ఉన్నారు. ఈ అభిప్రాయంతో జెన్ జీ యువతులు మాత్రం విభేదిస్తున్నారు. కేవలం 18 శాతం మంది మాత్రమే ఈ అభిప్రాయంతో ఏకీభవించారు. ఇంతకంటే ముందు తరం మహిళల్లో కేవలం 6 శాతం మంది మాత్రమే ఈ అభిప్రాయంతో ఉన్నారు.


ఇక మహిళలు మరీ స్వతంత్రంగా తమకు ఎవరి అవసరం లేదన్నట్టు కనిపించడం తగదని జెన్-జీ పురుషుల్లో 24 శాతం మంది తెలిపారు. యువతుల్లో మాత్రం 15 శాతం మందే ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఇక పురుషులు శారీరకంగా దృఢంగా ఉండాలని 43 శాతం మంది జెన్-జీ పురుషులు చెప్పారు. ఇక పిల్లల పెంపకంలో పాలు పంచుకునే పురుషులు అంత మ్యాన్లీగా కనిపించరని మరో 21 శాతం పేర్కొన్నారు. ఇక కెరీర్‌లో దూసుకుపోయే మహిళలు మరింత ఆకర్షణీయంగా ఉంటారని 41 శాతం మంది జెన్ జీ పురుషులు తెలిపారు. మునుపటి తరంతో పోలిస్తే జెన్-జీలో ఇలాంటి అభిప్రాయం ఉన్న వారి సంఖ్య అధికంగా ఉండటం కొసమెరుపు. స్త్రీపురుషుల పాత్రలపై సమాజంలో అంచనాలు, ఈ విషయంలో యువతీయువకుల వ్యక్తిగత అభిప్రాయాలు మధ్య అంతరాలను ఈ సర్వే ప్రతిఫలిస్తోందని పరిశోధకులు తెలిపారు.


ఈ వార్తలూ చదవండి:

ఖమేనీ నలుగురు కొడుకులు క్షేమం.. వెలుగుచూసిన ఫోటోలు

ఇరాన్ ఇంకెంతమాత్రం మధ్యప్రాచ్యాన్ని శాసించలేదు: ట్రంప్

Updated Date - Mar 07 , 2026 | 10:13 PM