జీ7 సదస్సులో ఆసక్తికర సంభాషణ.. సిగరెట్ మానేశానని చెప్పిన ఇటలీ ప్రధాని మెలనీ..
ABN , Publish Date - Jun 17 , 2026 | 10:59 AM
జీ7 సదస్సులో ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాధినేతల మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఇటలీ ప్రధాని జార్జియా మెలనీ సిగరెట్ అలవాటు గురించి మాట్లాడుతున్న దృశ్యాలు ఉన్నాయి.
ఇంటర్‌నెట్ డెస్క్: జీ7 సదస్సులో ఇటలీ, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాధినేతల మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఇటలీ ప్రధాని జార్జియా మెలనీ సిగరెట్ అలవాటు గురించి మాట్లాడుతున్న దృశ్యాలు ఉన్నాయి. ఆ వీడియోలో ఏముందంటే.. బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలనీ, జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్, యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా ఓ చోట నిల్చుని మాట్లాడుకుంటున్నారు.
జార్జియా మాట్లాడుతూ.. ‘నేను నిద్రలేవాలంటే కనీసం మూడు కప్పుల కాఫీ తాగాల్సిందే’ అని అన్నారు. జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ స్పందిస్తూ.. ‘సిగరెట్ కూడా కావాలా?’ అని అడిగారు. ఇందుకు మెలనీ ‘నేను నెల క్రితమే సిగరెట్ మానేశాను’ అని అన్నారు. దీంతో చర్చ పొగ తాగడంపైకి మళ్లింది. యూకే ప్రధాని కైర్ స్టార్మర్ ‘మీరెప్పుడు సిగరెట్ తాగటం మానేశారు’ అని యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టాను అడిగారు. ‘నేను సిగరెట్ తాగటం మానేసి 21 సంవత్సరాలు అయింది’ అని కోస్టా చెప్పుకొచ్చారు.
బహుమతుల పంపకాలు..
జీ7 సదస్సులో పాల్గొన్న దేశాధినేతలు ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు. ఫ్రాన్స్‌లోని ఆల్ప్స్ పర్వతాలలో వచ్చే ఏడాది జరగబోయే 'సైక్లింగ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్'ను ప్రోత్సహించడానికి మాక్రాన్ అక్కడ ఉన్న ఏడుగురు నాయకులకు ప్రత్యేకంగా వారి కోసం తయారుచేసిన సైకిళ్లను బహుమతిగా ఇచ్చారు. ఇరాన్ యుద్ధం విషయంలో ఇటీవల ట్రంప్‌తో విభేదించిన జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్.. వరల్డ్ కప్ గౌరవార్థం ట్రంప్ పుట్టిన రోజున ఆయనకు జర్మనీ జాతీయ ఫుట్‌బాల్ టీమ్ జెర్సీని బహుమతిగా ఇచ్చారు.
ఇవి కూడా చదవండి
నెదర్లాండ్స్‌లో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి
రెచ్చిపోయిన దొంగలు.. ఏటీఎమ్ మాయం