ఫ్రాన్స్‌లోని ఎక్స్ కార్యాలయాల్లో సోదాలు..!
ABN , Publish Date - Feb 03 , 2026 | 09:05 PM
ఫ్రాన్స్‌లోని ఎక్స్ కార్యాలయాల్లో స్థానిక అధికారులు సోదాలు నిర్వహించారు. ఎక్స్ ఆల్గోరిథమ్‌లో మార్పులపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన ప్రాసిక్యూటర్లు తాజాగా సోదాలు చేపట్టారు.
ఇంటర్నెట్ డెస్క్: ఫ్రాన్స్‌లోని పలు ఎక్స్ కార్యాలయాల్లో మంగళవారం నాడు అధికారులు (Paris Prosecutors' Office) సోదాలు నిర్వహించారు. ఆల్గోరిథమ్‌లో మార్పులు, పిల్లల అసభ్య చిత్రాలు, డీప్‌ఫేక్ వీడియోల వ్యాప్తి ఆరోపణలపై దర్యాప్తులో భాగంగా అధికారులు ఎక్స్‌కు చెందిన పలు కార్యాలయాల్లో సోదాలు చేశారు (Raids in X Offices in France).
గతేడాది జనవరిలోనే పారిస్ ప్రాసిక్యూషన్ సైబర్ క్రైమ్ విభాగం ఎలాన్ మస్క్ సారథ్యంలోని ఎక్స్ సంస్థపై దర్యాప్తు ప్రారంభించింది. ఆల్గోరిథమ్‌లోని మార్పులు కారణంగా ఎక్స్‌లో డేటా ప్రాసెసింగ్ సిస్టమ్‌లో పక్షపాత ధోరణి చూపిందని ఫ్రాన్స్ పార్లమెంటు సభ్యుడు ఒకరు ఆరోపించారు. చిన్నారుల అసభ్య చిత్రాలు, డీప్ ఫేక్ వీడియోల వ్యాప్తి సంబంధిత ఆరోపణలూ వచ్చాయి. దీంతో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు ప్రాసిక్యూటర్ కార్యాలయం రంగంలోకి దిగింది.
ఇక 2023-25 మధ్య కాలంలో ఎక్స్‌కు సీఈఓగా ఉన్న లిండా యాకరీనోను, ఎలాన్ మస్క్‌ను ప్రశ్నించేందుకు అనుమతి కోసం ప్రాసిక్యూటర్లు దరఖాస్తు చేసుకున్నారు. ఏప్రిల్ 20న వారిని ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
కాగా, ఎక్స్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నామని పారిస్ ప్రాసిక్యూటర్స్ కార్యాలయం ఎక్స్ వేదికగా వెల్లడించింది. ప్రస్తుత దర్యాప్తు నిర్మాణాత్మక ధోరణిలో సాగుతోందని తెలిపింది. ఎక్స్ కార్యకలాపాలు ఫ్రాన్స్ చట్టాలకు అనుగుణంగా ఉండాలన్నదే తమ అభిమతమని పేర్కొంది.
ఇవీ చదవండి:
భారత్, అమెరికా 'ట్రేడ్ డీల్' వెనుక ఉన్న కీలక వ్యక్తి ఎవరంటే..!
హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్ల షెడ్యూల్ విడుదల