మచ్చార్ పుర్రెకు ఫ్రాక్చర్
ABN , Publish Date - Oct 07 , 2026 | 02:40 AM
ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ గొడ్డలి (క్రాష్ యాక్స్)తో చేసిన దాడిలో పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్ పుర్రెకు పగులు వచ్చింది. పుర్రె ఎముక కొంతభాగం మెదడు వైపు నొక్కుకుపోయింది.
కో-పైలట్ గొడ్డలితో దాడి చేయడంతో
మెదడు వైపు చొచ్చుకుపోయిన ఎముక భాగం
ఆ దెబ్బ ధాటికి మసకబారిపోయిన దృష్టి!
పుర్రె భాగాన్ని సరిచేసిన సౌదీ వైద్యులు
ఆ తర్వాతే అబుధాబికి తరలింపు
ఫ్లైదుబాయ్ సంస్థలో చేరికకు ముందే విమానం
హైజాక్, కూల్చివేతకు హమ్మామీ కుట్ర
అబుధాబి, అక్టోబరు 6: ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ గొడ్డలి (క్రాష్ యాక్స్)తో చేసిన దాడిలో పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్ పుర్రెకు పగులు వచ్చింది. పుర్రె ఎముక కొంతభాగం మెదడు వైపు నొక్కుకుపోయింది. దీనితో స్మిత్ మచ్చార్ దృష్టి కాస్త మసకబారడంతోపాటు జ్ఞాపకశక్తిపైగా ప్రభావం పడింది. ఆ విమానం సౌదీ అరేబియాలోని తబుక్‌లో ల్యాండింగ్ కాగానే పైలట్ మచ్చార్‌ను సైనిక ఆస్పత్రికి తరలించిన అధికారులు.. ఆయనకు అత్యవసరంగా శస్త్రచికిత్స చేసి, పుర్రె భాగాన్ని సరిచేశారు. ఆ తర్వాతే యూఏఈలోని అబుధాబికి తరలించారు. సౌదీ అధికారులు మంగళవారం ఈ వివరాలు వెల్లడించారు.
గొడ్డలితో బలంగా కొట్టడంతో..
దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ వెళుతున్న ఫ్లైదుబాయ్ విమానాన్ని కూల్చివేసేందుకు ఒమన్ జాతీయుడైన కో-పైలట్ అల్‌హమ్మామీ ప్రయత్నించిన విషయం తెలిసిందే. దీనికి ముందు ప్రార్థన చేసుకుంటానంటూ వెళ్లిన అల్‌హమ్మామీ.. విమానం నడుపుతున్న పైలట్ స్మిత్ మచ్చార్ తలపై గొడ్డలితో దాడి చేశారు. ఆ దెబ్బ ధాటికి స్మిత్ మచ్చార్ పుర్రెకు పగులు వచ్చి, కొంతభాగం మెదడులోకి చొచ్చుకుపోయింది. చూపు మసకబారింది. విమానం ల్యాండ్ అయ్యాక ఇది గుర్తించిన సౌదీ మిలిటరీ ఆస్పత్రి వైద్యులు వెంటనే స్మిత్‌కు శస్త్రచికిత్స చేసి పుర్రె భాగాన్ని సరిచేసినట్టు అధికారులు వెల్లడించారు. కో-పైలట్ దాడిలో ఆయన చేతులు, ఛాతీ భాగంలోనూ తీవ్ర గాయాలైనట్టు తెలిపారు. సౌదీలో వైద్యం అనంతరం మెరుగైన చికిత్స కోసం స్మిత్ మచ్చార్‌ను అబుధాబిలోని యూఏఈ మిలిటరీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ మచ్చార్‌ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. స్మిత్ మచ్చార్ లేచి కొన్ని అడుగులు నడవగలుతున్నారని, కొద్దికొద్దిగా ఆహారం తీసుకుంటున్నారని తెలిసింది.
న్యూజిలాండ్‌లో అల్ హమ్మామీ శిక్షణ
ఒమన్‌కు చెందిన అల్‌హమ్మామీ నేపథ్యం, విమానం కూల్చివేసే యత్నాలపై దర్యాప్తు చేస్తున్న అధికారులు.. అతను 2018 నవంబర్ నుంచి 2019 మే వరకు న్యూజిలాండ్‌లో పైలట్ శిక్షణ తీసుకున్నట్టుగా గుర్తించారు. అప్పట్లో న్యూజిలాండ్‌కు రావడం నుంచి పైలట్ శిక్షణ వరకు అతడి వ్యవహారాలపై అక్కడి అధికారులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఫ్లైదుబాయ్ సంస్థలో చేరడానికి ముందే ఇజ్రాయెల్‌కు వెళ్లే విమానాల హైజాక్, కూల్చివేతకు అల్‌హమ్మామీ కుట్ర పన్నినట్టు తెలిసిందని వెల్లడించారు.విమానాన్ని
పేల్చేద్దామనుకున్న ఇజ్రాయెల్
విమానం హైజాక్ అయిందంటూ సిగ్నల్స్ రావడంతో అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట భవనాలను విమానాలతో ఢీకొని కూల్చివేసిన తరహాలో..ఇజ్రాయెల్ రాజధాని టెల్‌అవీవ్‌లో విధ్వంసం జరగవచ్చని భయాందోళనలు వ్యక్తమయ్యాయి. దీనితో వేగంగా స్పందించిన ఇజ్రాయెల్ యుద్ధ విమానాలను గాల్లోకి పంపి హైజాక్ ప్రొటోకాల్ అమలు చేసింది ఒకవేళ ఫ్లైదుబాయ్ విమానం ఇజ్రాయెల్‌కు సమీపంగా వస్తే పేల్చివేసేందుకు సిద్ధమయ్యారు. సౌదీ అరేబియాకు, ఇజ్రాయెల్‌కు మధ్యలో జోర్డాన్ ఉంది. జోర్డాన్ గగనతలంలోకి ఫ్లైదుబాయ్ విమానం ప్రవేశించి, ఇజ్రాయెల్ వైపు సాగితే.. క్షిపణులతో పేల్చివేయాలని నిర్ణయించారు. అయితే ఫ్లైదుబాయ్ విమానంలో ఇతర ఆఫ్ డ్యూటీ పైలట్లు.. విమానాన్ని జోర్డాన్ నుంచి వెనక్కి తిప్పి, సౌదీలోని తబుక్‌కు మళ్లించారు. దీంతో ఇజ్రాయెల్ తమ యుద్ధ విమానాలను వెనక్కి రప్పించేసింది.
ఈ వార్తలు కూడా చదవండి
మోదీపై ట్రంప్‌నకు చాలా మంచి అభిప్రాయం: ఆస్ట్రేలియా మాజీ ప్రధాని
దుబాయ్ ముస్లింలపై ప్రేమ ఎందుకు? : సింగర్ మికా సింగ్