కెప్టెన్ స్మిత్‌ను కాపాడేందుకు.. 45 నిమిషాల పోరాటం.. కళ్లు మూసుకోవద్దంటూ..
ABN , Publish Date - Oct 07 , 2026 | 12:53 PM
ఫ్లైదుబాయ్ ఉదంతంలో కోపైలట్ దాడిలో తీవ్రంగా గాయపడ్డ కెప్టెన్ స్మిత్ మచ్చార్ ప్రాణాలను కాపాడేందుకు విమానంలోని ఓ డెంటిస్ట్ విశ్వప్రయత్నం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ఫ్లైదుబాయ్ ఉదంతంలో కోపైలట్ దాడిలో తీవ్రంగా గాయపడ్డ కెప్టెన్ స్మిత్ మచ్చార్ ప్రాణాలను కాపాడేందుకు విమానంలోని ఓ డెంటిస్ట్ విశ్వప్రయత్నం చేశారు. 45 నిమిషాల పాటు శ్రమించి ఆయన ప్రాణాలను కాపాడారు. అసలు ఆ రోజున ఏం జరిగిందనే విషయాన్ని తాజాగా ఆయన కళ్లకు కట్టినట్టు వివరించారు. విమానాన్ని హైజాక్ చేసి ఇజ్రాయెల్‌లో కూల్చేందుకు కోపైలట్ హమ్మామ్ ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కెప్టెన్ మచ్చార్‌పై అతడు దాడి చేశాడు. ఈలోపు స్మిత్ కాక్‌పిట్ తలుపులు తెరవడంతో లోపలికి వచ్చిన ప్రయాణికులు నిందితుడిని నిలువరించి ప్లేన్‌ను సురక్షితంగా ల్యాండ్ చేశారు. తీవ్రగాయాల పాలైన మచ్చార్‌ను ఇజ్రాయెలీ డెంటిస్టు డాక్టర్ షుతా ముసాయేవ కాపాడారు.
ఒంటిపై లోతైన గాయాలు.. తీవ్ర రక్తస్రావం..
ఆ సమయంలో విమానంలో ఉన్న డాక్టర్ తానొక్కడినేనని ఇజ్రాయెలీ డెంటిస్టు తెలిపారు. ‘ఈ సమయంలో నేను ఏం చేయాలనేదానిపై తీవ్రంగా ఆలోచించాను. మచ్చార్ ఒంటిపై లోతైన గాయాలు ఉన్నాయి. తీవ్రంగా రక్తస్రావం అయ్యింది. టీషర్టు అడ్డుపెట్టి రక్తస్రావాన్ని ఆపే ప్రయత్నం చేశాము. ఐస్ ప్యాకెట్స్‌ను కూడా వినియోగించాము. రక్తస్రావానికి అడ్డుకట్ట వేసేందుకు దాదాపు 45 నిమిషాల పాటు శ్రమించాను. ఆయనను మెళకువగా ఉంచేందుకు నేను.. కళ్లు మూయవద్దు. నిద్రలోకి జారుకోవద్దు అంటూ పదే పదే చెప్పాను. మీరు మాకు కావాలి అంటూ ధైర్యం నింపే ప్రయత్నం చేశాను. త్వరలో కుటుంబం చెంతకు చేరుకుంటారని నమ్మకం కలిగించే ప్రయత్నం చేశాను. తనకు సాయం చేయాలని స్మిత్ పలుమార్లు కోరారు. రక్తస్రావం కారణంగా ఒకానక దశలో ఆయన పల్స్ ప్రమాదకర స్థాయిలో పడిపోయింది. పెదవులు నీలంగా మారాయి. దీంతో, విమానాన్ని వెంటనే ల్యాండ్ చేయాలని చెప్పాను. ఆయనకు ఎక్కువ సమయం లేదని అప్రమత్తం చేశాను’ అని చెప్పారు.
పైలట్‌ను కదపకుండా.. పెయిన్ కిల్లర్స్ ఇవ్వకుండా..
‘ఆయన వెల్లకిలా పడుకుని ఉన్నారు. కదిపితే రక్తస్రావం ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో నేను ఆయనను లేపే ప్రయత్నం చేయలేదు. ఆయనకు పెయిన్ కిల్లర్స్ ఇవ్వాలని విమానంలోని సిబ్బంది సూచించారు. రక్తస్రావం పెరగవచ్చనే భయంతో నేను వద్దని చెప్పాను. ఆయన మాట్లాడుతున్నారా? స్పృహ తప్పిపోతున్నారా? నాడి అందుతోందా? పెదాలు నీలి రంగులోకి మారుతున్నాయా అనే విషయాల్ని రెప్పవేయకుండా గమనిస్తూ నా శక్తిమేరకు ఆయనను కాపాడే ప్రయత్నం చేశాను’ అని చెప్పారు.
‘స్మిత్ మాకు హీరో. నా కుటుంబాన్ని, ఇతర ప్రయాణికులను కాపాడినందుకు ఆయనకు ధన్యవాదాలు చెబుతున్నారు. ఆయన మా ప్రాణాలను కాపాడారు. మేము ఆయనను రక్షించాము. ఇదంతా విధి రాత’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ వార్తలనూ చదవండి:
రష్యాలో ప్లేగు వ్యాధి భయాలు.. స్పందించిన ట్రంప్
భారతీయులున్న ఆయిల్ ట్యాంకర్‌పై డ్రోన్ దాడి