Share News

ఇరాన్‌పై దాడులకు సిద్ధమవుతున్న అమెరికా.. మిడిల్ ఈస్ట్ వైపు యుద్ధ విమానాలు..

ABN , Publish Date - Feb 22 , 2026 | 08:06 PM

ఇరాన్‌పై దాడులు చేయడానికి అమెరికా సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు.. అమెరికా నుంచి ఫైటర్ జెట్స్, రీఫ్యూయలింగ్ ట్యాంకర్స్, ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు మిడిల్ ఈస్ట్‌కు వెళ్లి వస్తున్నాయి. మిడిల్ ఈస్ట్‌లో పెద్ద సంఖ్యలో ఫైటర్ జెట్లు మోహరించబడ్డాయి..

ఇరాన్‌పై దాడులకు సిద్ధమవుతున్న అమెరికా.. మిడిల్ ఈస్ట్ వైపు యుద్ధ విమానాలు..
US Air Force air bridge

ఇంటర్‌నెట్ డెస్క్: అమెరికా, ఇరాన్‌ల మధ్య గత కొంత కాలం నుంచి యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇరాన్‌పై అమెరికా యుద్ధం చేయబోతోందన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. రెండు దేశాల మధ్య గొడవలకు చెక్ పెట్టడానికి న్యూక్లియర్ డీల్‌ను తెరపైకి తెచ్చినా లాభం లేకుండా పోయింది. రెండు దేశాల మధ్య అణు ఒప్పందం కోసం జరిగిన చర్చలు విఫలమైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇరాన్‌పై యుద్ధం చేయడానికి అమెరికా సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో అమెరికా యుద్ధానికి అన్ని రకాలుగా సిద్ధం అవుతున్నట్లు సమాచారం.


ఈ మేరకు ఫ్లైట్ రాడార్ ఓ వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో అమెరికా నుంచి ఫైటర్ జెట్స్, రీఫ్యూయలింగ్ ట్యాంకర్స్, ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు మిడిల్ ఈస్ట్‌కు వెళ్లి వస్తున్నాయి. మిడిల్ ఈస్ట్‌లో పెద్ద సంఖ్యలో ఫైటర్ జెట్లు మోహరించబడ్డాయి. జర్మనీలోని స్పాంగ్‌డహ్లామ్ ఎయిర్ బేస్.. ఇటలీలోని ఏవియానో ఎయిర్‌బేస్.. సౌత్ కరోలినాలోని మెక్ ఎంటైర్ జాయింట్ నేషనల్ గార్డ్ బేస్ నుంచి ఎఫ్-16 ఫైటింగ్ ఫాల్కన్స్ మిడిల్ ఈస్ట్‌ వైపు వెళ్లాయని ఎయిర్ అండ్ స్పేస్ ఫోర్స్ తెలిపింది. యూకేలోని ఆర్ఏఎఫ్ లేకెన్‌హీత్ నుంచి ఎఫ్ -15 ఈ స్ట్రైకర్ ఈగల్స్.. వర్జీనియాలోని జాయింట్ బేస్ లాంగ్లీ-యుస్టిస్ నుంచి ఎఫ్-22 రాప్టార్స్ కూడా మిడిల్ ఈస్ట్‌కు చేరుకున్నాయని వెల్లడించింది.


ఎఫ్-22 రాఫ్టార్స్‌ను గతంలో ఇరాన్‌ న్యూక్లియర్ సైట్లపై దాడులు చేయడానికి అమెరికా ఉపయోగించింది. గత సంవత్సరం ‘మిడ్ నైట్ హ్యామర్’ ఆపరేషన్‌లోనూ అమెరికా వీటిని వాడింది. కాగా, ఇరాన్ న్యూక్లియర్ బాంబు తయారీ కోసం యురేనియాన్ని సమకూర్చుకోవడాన్ని వెంటనే ఆపేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేశారు. రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నప్పటికీ ఒప్పందం మాత్రం జరగటం లేదు. ఇలాంటి సమయంలో అమెరికా దాడులకు సిద్ధమైంది. ఇరాన్ భద్రతా స్థావరాలను లేదా నాయకులను టార్గెట్ చేసే అవకాశం ఉందని అమెరికా అధికారులు అంటున్నారు. తమపై దాడులు చేస్తే ప్రతి దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరిస్తోంది.


ఇవి కూడా చదవండి..

ఎన్డీయే సీట్ల షేరింగ్ డీల్ పూర్తి... అస్సాం సీఎం హిమంత

రైస్ పుల్లింగ్ కేసులో వైసీపీ నేత అరెస్టు..

Updated Date - Feb 22 , 2026 | 08:38 PM