ఇతడిని పట్టిస్తే రూ. 9 కోట్లు మీవే.. యూఎస్ బంపర్ ఆఫర్
ABN , Publish Date - Mar 11 , 2026 | 11:58 AM
అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) బంపర్ ఆఫర్ ఇచ్చింది. భార్యను చంపి పరారీలో ఉన్న వ్యక్తిని పట్టించినా లేదా అతడి ఆచూకీ చెప్పినా 1 మిలియన్ డాలర్లు బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
న్యూయార్క్, మార్చి 11: అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) బంపర్ ఆఫర్ ఇచ్చింది. భార్యను చంపి పరారీలో ఉన్న వ్యక్తిని పట్టించినా లేదా అతడి ఆచూకీ చెప్పినా 1 మిలియన్ డాలర్లు (9 కోట్ల రూపాయలు పైనే..) బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇంతకీ సంగతేంటంటే.. అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన భారతీయ వ్యక్తి భద్రేశ్‌కుమార్ చేతన్‌బాయ్ పటేల్, అతడి భార్య పాలక్ పటేల్ మేరిల్యాండ్‌లోని ఓ డోనట్ షాపులో పని చేసేవారు. ఇద్దరూ తరచుగా గొడవలు పడుతూ ఉండేవారు. ఈ నేపథ్యంలోనే 2015, ఏప్రిల్ 12వ తేదీన కూడా ఇద్దరికీ గొడవైంది.
డోనట్ షాపులో ఉండగానే భద్రేశ్‌కుమార్ తన భార్యను అతి దారుణంగా పదునైన ఆయుధంతో పొడిచి చంపాడు. భార్యను చంపిన తర్వాత అక్కడినుంచి పరారయ్యాడు. పోలీసులు అతడిపై ఫస్ట్ డిగ్రీ మర్డర్, సెకండ్ డిగ్రీ మర్డర్, ఫస్ట్ డిగ్రీ అసాల్ట్, సెకండర్ డిగ్రీ అసాల్ట్ కింద కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న అతడి కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. 2015 నుంచి ఇప్పటి వరకు అతడి ఆచూకీ దొరకలేదు. భద్రేశ్‌కుమార్‌ను అరెస్ట్ చేయడానికి సాయం చేసిన వారికి లక్ష డాలర్లు ఇస్తామని పోలీసులు మొదట్లో ఓ ప్రకటన చేశారు.
తర్వాత ఆ మొత్తాన్ని 2,50,000 డాలర్లకు పెంచారు. అయినా ప్రజల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్న భద్రేశ్‌కుమార్‌ను పట్టుకోవడానికి ఎఫ్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అతడిపై ఉన్న బహుమతిని ఏకంగా 1 మిలియన్ డాలర్లు చేసింది. భద్రేశ్‌కుమార్ అమెరికాలోని దగ్గరి బంధువు ఇంట్లో తలదాచుకుని ఉంటాడని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. కెనడాకు పారిపోయి ఉండొచ్చన్న అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
భూ వివాదాలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు చర్యలు: మంత్రి అనగాని సత్యప్రసాద్