Share News

Trump Tariffs Europe: ట్రంప్ సుంకాల వల్ల చైనా, రష్యా పండగ చేసుకుంటున్నాయి: ఈయూ ఆగ్రహం..

ABN , Publish Date - Jan 18 , 2026 | 03:59 PM

గ్రీన్‌లాండ్ విషయంలో తమ వైఖరిని వ్యతిరేకిస్తున్న ఎనిమిది ఐరోపా దేశాలపై ట్రంప్ పది శాతం అదనపు సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. యూరప్ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల కారణంగా చైనా, రష్యా భారీగా మేలు పొందుతాయని యూరోపియన్ యూనియన్‌ అభిప్రాయపడింది.

Trump Tariffs Europe: ట్రంప్ సుంకాల వల్ల చైనా, రష్యా పండగ చేసుకుంటున్నాయి: ఈయూ ఆగ్రహం..
Trump tariff threat

యూరప్ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల కారణంగా చైనా, రష్యా భారీగా మేలు పొందుతాయని యూరోపియన్ యూనియన్‌ అభిప్రాయపడింది. గ్రీన్‌లాండ్ విషయంలో తమ వైఖరిని వ్యతిరేకిస్తున్న ఎనిమిది ఐరోపా దేశాలపై ట్రంప్ పది శాతం అదనపు సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ, యునైటెడ్ కింగ్‌డమ్, నెదర్లాండ్స్, ఫిన్లాండ్ దేశాల నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే ఉత్పత్తులపై ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పది శాతం అదనపు సుంకాలు చెల్లించాలి.


ట్రంప్ చర్యను యూరప్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. నాటో సభ్య దేశాలు గ్రీన్‌లాండ్ భద్రత కోసం చర్యలు తీసుకుంటే.. సుంకాలు విధిస్తామని బెదరించడం తప్పని, ఈ విషయంపై నేరుగా అమెరికా యంత్రాంగంతోనే తేల్చుకుంటామని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తెలిపారు. అమెరికా చేస్తున్న బెదిరింపులకు భయపడేది లేదని, గ్రీన్‌లాండ్ భద్రత విషయంలో రాజీ పడబోమని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మెక్రాన్ స్పష్టం చేశారు. కాగా, యూరప్ దేశాలపై అమెరికా విధించిన సుంకాల వల్ల రష్యా, చైనా లాభపడతాయని ఈయూ ఫారిన్ పాలసీ చీఫ్ కాజా కల్లాస్ అభిప్రాయపడ్డారు.


యూరోపియన్ యూనియన్ దేశాలను ఎవరూ బ్లాక్‌మెయిల్ చేయలేరని స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ చట్టాన్ని కాపాడుకునే విషయంలో ఈయూ ఎల్లప్పుడూ దృఢంగా ఉంటుందని యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా పేర్కొన్నారు. డెన్మార్క్ నియంత్రణంలో ఉన్న గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొంత కాలంగా చెబుతున్నారు. ఈ విషయంలో డెన్మార్క్‌కు ఐరోపా దేశాలు మద్దతుగా నిలిచాయి. దీంతో ట్రంప్ డెన్మార్క్‌తో పాటు దానికి మద్దతుగా నిలిచిన దేశాలపై అదనపు సుంకాలు విధించారు.


ఇవి కూడా చదవండి..

వార్నీ.. రీల్స్ కోసం ఇంతకు తెగిస్తారా.. మెట్రో రైల్లో ఎగిరి తంతే..


మీవి డేగ కళ్లు అయితే.. ఈ ఫొటోలో ఉన్న ముగ్గురిని 30 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Jan 18 , 2026 | 05:29 PM