Share News

మీడియా ప్రతినిధుల సమావేశంలో ట్రంప్ దురుసు ప్రవర్తన..

ABN , Publish Date - Apr 19 , 2026 | 12:53 PM

హోర్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న రెండు భారత వాణిజ్య నౌకలపై ఐఆర్‌జీసీకి చెందిన ఇరాన్ గన్‌బోట్లు కాల్పులు జరిపాయి. ఈ దాడిపై ప్రశ్న వేసిన ఓ జర్నలిస్ట్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీడియా ప్రతినిధుల సమావేశంలో ట్రంప్ దురుసు ప్రవర్తన..
Donald Trump

న్యూయార్క్, ఏప్రిల్ 19: అమెరికా, ఇరాన్‌ దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల కారణంగా ప్రపంచ దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఆయిల్, గ్యాస్ కొరతతో అల్లాడిపోతున్నాయి. శుక్రవారం హోర్ముజ్‌ను పూర్తిగా తెరుస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. హోర్ముజ్ తెరుచుకోవటంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. అయితే, హోర్ముజ్‌ దిగ్బంధనాన్ని కొనసాగిస్తామని ట్రంప్ ప్రకటించటంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. ఇరాన్ మళ్లీ హోర్ముజ్ జలసంధిని మూసి వేసింది. అంతేకాదు.. హోర్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న రెండు భారత వాణిజ్య నౌకలపై ఐఆర్‌జీసీకి చెందిన ఇరాన్ గన్‌బోట్లు కాల్పులు జరిపాయి.


నౌకలపై భారత జెండాలు ఉన్నప్పటికి ఈ దాడి జరిగింది. ఈ దాడిలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. కాల్పుల నేపథ్యంలో రెండు మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును భారత్‌కు తీసుకొస్తున్న ఆ రెండు నౌకలు హోర్ముజ్ జలసంధి నుంచి వెనక్కి మళ్లినట్టు సమాచారం. ఈ దాడిపై ప్రశ్న వేసిన ఓ జర్నలిస్ట్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ శనివారం మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఓ జర్నలిస్ట్ ‘హోర్ముజ్ జలసంధిలో భారత జెండా కలిగిన నౌకలపై కాల్పులు జరిగాయి. దీని గురించి ఏమంటారు?’ అని ప్రశ్నించారు.


ట్రంప్ కోపంగా .. ‘అవుట్’ అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను శశాంక్ మట్టు అనే వ్యక్తి ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్రంప్ ప్రవర్తనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా భారతీయులు ట్రంప్ తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు. ట్రంప్ కారణంగానే ప్రపంచ దేశాలకు ఆయిల్, గ్యాస్ కష్టాలు వచ్చాయని మండిపడుతున్నారు.


ఇవి కూడా చదవండి

33 శాతం మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి: కిరణ్ కుమార్ రెడ్డి

జగన్‌ నుంచి ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణకు ప్రమాదం ఉంది: గోరంట్ల

Updated Date - Apr 19 , 2026 | 12:57 PM