Share News

చైనాలో ట్రంప్‌

ABN , Publish Date - May 14 , 2026 | 05:14 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బుధవారం చైనా పర్యటనను ప్రారంభించారు. బీజింగ్‌ విమానాశ్రయంలో దిగిన ఆయనకు చైనా ఉపాధ్యక్షుడు హన్‌ జెంగ్‌ స్వయంగా...

చైనాలో ట్రంప్‌

3 రోజుల పర్యటనను ప్రారంభించిన అమెరికా అధ్యక్షుడు

ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం.. నేడు, రేపు జిన్‌పింగ్‌తో చర్చలు

బీజింగ్‌, మే 13: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బుధవారం చైనా పర్యటనను ప్రారంభించారు. బీజింగ్‌ విమానాశ్రయంలో దిగిన ఆయనకు చైనా ఉపాధ్యక్షుడు హన్‌ జెంగ్‌ స్వయంగా స్వాగతం పలికారు. తద్వారా ట్రంప్‌ పర్యటనకు ఎంత ప్రాధాన్యం ఇస్తుందో చైనా తెలియజేసినట్లయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా చైనాకు పుతిన్‌ సహా విదేశీ నేతలు ఎవరు వచ్చినా ఎయిర్‌పోర్టులో ఆయా రాష్ట్రాల ఉన్నతస్థాయి ప్రతినిధులే స్వాగతం పలుకుతుంటారు. ట్రంప్‌ విషయంలో చైనా ఈ సంప్రదాయాన్ని పక్కన పెట్టటం విశేషం. విమానాశ్రయంలో ట్రంప్‌నకు చైనా సైనిక దళం గౌరవ వందనం సమర్పించింది.. ట్రంప్‌ వెంట ఆయన కుమారుడు ఎరిక్‌, కోడలు లారా, టెస్లా అధిపతి ఎలాన్‌ మస్క్‌, ఆపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ తదితర వ్యాపారవేత్తలున్నారు. గురు, శుక్రవారాల్లో ట్రంప్‌, చైనా అధినేత జిన్‌పింగ్‌ పలు అంశాలపై చర్చలు జరపనున్నారు. దీనిపై ట్రంప్‌ సోషల్‌ మీడియాలో ఓ పోస్టు కూడా పెట్టారు. ‘చైనా ద్వారాలు తెరవాలని, తద్వారా ఈ తెలివైన వ్యక్తులు (అమెరికా వ్యాపారవేత్తలు) మీతో కలిసి పని చేసి చైనాను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తారని అసాధారణ నాయకుడైన ప్రెసిడెంట్‌ జిన్‌పింగ్‌కు విజ్ఞప్తి చేస్తా’ అని పేర్కొన్నారు. కాగా.. వాణిజ్యం, సుంకాలు, ఏఐ, టెక్నాలజీ, తైవాన్‌, ఇరాన్‌, పశ్చిమాసియా సంక్షోభం తదితర అంశాలపై ఇరు దేశాలు చర్చలు జరపనున్నాయి. కాగా, ట్రంప్‌ 2017లో తన తొలి దఫా పాలనలో చైనాలో పర్యటించారు. మళ్లీ ఆ దేశానికి రావటం 9 ఏళ్లలో ఇదే తొలిసారి.

ఈ వార్తలు కూడా చదవండి

ఎయిర్ ఇండియా సంస్థ కీలక నిర్ణయం.. ఆ మార్గాల్లో విమానాల రద్దు..

నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ దూకుడు.. ఐదుగురి అరెస్ట్

Updated Date - May 14 , 2026 | 05:14 AM