ఇరాన్, అమెరికా సీజ్ ఫైర్.. పాకిస్థాన్‌పై అమెరికా ఒత్తిడి తేవడంతో..
ABN , Publish Date - Apr 09 , 2026 | 12:23 PM
అమెరికా, ఇరాన్‌ల మధ్య రాజీ కుదర్చటాన్ని పాకిస్థాన్ గొప్పగా ప్రచారం చేసుకుంటోంది. తనను తాను శాంతిదూతగా చెప్పుకుంటోంది. ఇలాంటి సమయంలో బ్రిటన్‌కు చెందిన ది ఫైనాన్షియల్ టైమ్స్ న్యూస్ పేపర్ సంచలన కథనాన్ని ప్రచురించింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: 40 రోజుల పాటు కొనసాగిన యుద్ధానికి తెర దించుతూ అమెరికా, ఇరాన్ దేశాలు రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో రెండు దేశాల మధ్య రాజీ కుదిరింది. రెండు దేశాల మధ్య రాజీ కుదర్చటాన్ని పాకిస్థాన్ గొప్పగా ప్రచారం చేసుకుంటోంది. తనను తాను శాంతిదూతగా చెప్పుకుంటోంది. ఇలాంటి సమయంలో బ్రిటన్‌కు చెందిన ది ఫైనాన్షియల్ టైమ్స్ న్యూస్ పేపర్ సంచలన కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం ప్రకారం..
అమెరికా ఒత్తిడి కారణంగానే పాకిస్థాన్ మధ్యవర్తిత్వం చేయడానికి ముందుకు వచ్చింది. ఇరాన్, అమెరికాల మధ్య రాజీ కుదిరితే హోర్ముజ్ జలసంధి మళ్లీ తెరుచుకుంటుందని అమెరికా భావించింది. అందుకే ఇరాన్‌ను యుద్ధం ఆపేలా ఒప్పించమని పాకిస్థాన్‌ను కోరింది. గత కొన్ని వారాల నుంచి ట్రంప్ ప్రభుత్వం పాకిస్థాన్‌పై ఒత్తిడి తెస్తోంది. అమెరికా ఒత్తిడి కారణంగానే బలవంతంగా ఇరాన్‌తో చర్చలకు పాకిస్థాన్ ఒప్పుకుంది. ఎంతో కష్టం మీద ఇరాన్‌ను రాజీకి ఒప్పించింది. అమెరికాకు సంబంధించినంత వరకు పాకిస్థాన్ మధ్యవర్తి కాదు.. ఇరాన్‌తో సంధి చేసుకోవడానికి ఓ మార్గం మాత్రమేనని ది ఫైనాన్షియల్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది.
ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
ఇజ్రాయెల్ కారణంగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం విఫలం అయ్యేలా ఉంది. ఇజ్రాయెల్ నిన్న లెబెనాన్‌పై మిస్సైల్ దాడులు చేసింది. ఈ దాడుల్లో 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మళ్లీ మూసి వేసింది. దీంతో ట్రంప్ ఆగ్రహానికి గురయ్యారు. గురువారం ది ట్రూత్‌లో ఓ పోస్టు పెట్టారు. ‘అమెరికా ఈజ్ బ్యాక్. ఇప్పటికే బలహీనపడిన శత్రువును పూర్తిగా నిర్మూలించేందుకు సిద్ధంగా ఉన్నాం. హోర్ముజ్‌ను తెరవకపోతే దాడులు తప్పవు. ఒప్పందం కుదరకపోతే ఈసారి తీవ్రమైన దాడులు చేస్తాం. ఎన్నడూ లేని విధంగా ఇరాన్‌పై విరుచుకుపడతాం. ఇప్పటికే ఇరాన్ చుట్టూ అమెరికా బలగాలున్నాయి. అణ్వాయుధాలను ఇరాన్ వదలాల్సిందే’నని రాసుకొచ్చారు.
ఇవి కూడా చదవండి
డ్రాయింగ్ రూమ్ ఫర్నిచర్ వాస్తు టిప్స్
పాకిస్థాన్‌పై మాకు నమ్మకం లేదు.. ఇజ్రాయెల్ రాయబారి సంచలన వ్యాఖ్యలు..