Share News

ఇరాన్‌-హమాస్‌ బంధానికి బీటలు?

ABN , Publish Date - Mar 15 , 2026 | 06:40 AM

పశ్చిమాసియాలో యుద్ధం వేగంగా విస్తరిస్తున్న వేళ ఇరాన్‌, హమాస్‌ బంధానికి తొలిసారిగా బీటలు వారుతున్న సంకేతాలు వెలువడుతున్నాయి. గల్ఫ్‌ దేశాలపై దాడులు చేయొద్దని పాలస్థీనాకు...

ఇరాన్‌-హమాస్‌ బంధానికి బీటలు?

  • గల్ఫ్‌ దేశాలపై దాడులు వద్దన్న హమాస్‌

టెహ్రాన్‌, మార్చి 14: పశ్చిమాసియాలో యుద్ధం వేగంగా విస్తరిస్తున్న వేళ ఇరాన్‌, హమాస్‌ బంధానికి తొలిసారిగా బీటలు వారుతున్న సంకేతాలు వెలువడుతున్నాయి. గల్ఫ్‌ దేశాలపై దాడులు చేయొద్దని పాలస్థీనాకు చెందిన మిలిటెంట్‌ గ్రూప్‌ హమాస్‌ బహిరంగంగా ఇరాన్‌ను కోరింది. అనేక అరబిక్‌, పాలస్థీనియన్‌ మీడియా సంస్థల్లో ఈ ప్రకటన ప్రచురితమైంది. ఈ ప్రకటనను హమాస్‌ గానీ, ఇరాన్‌కు అనుబంధంగా ఉన్న ‘యాక్సిస్‌ ఆఫ్‌ రెసిస్టెన్స్‌’ గ్రూప్‌నకు చెందిన ఏ ఒక్క సభ్యుడుగానీ తోసిపుచ్చలేదు. దీంతో ఇరాన్‌-హమాస్‌ మధ్య సుమారు 17 ఏళ్లుగా కొనసాగుతున్న బంధంలో తొలిసారిగా ఘర్షణ కనిపిస్తోందని టాప్‌ ఇంటెలిజెన్స్‌ వర్గాలు పేర్కొన్నట్టు ఒక ఆంగ్ల టీవీ చానల్‌ తెలిపింది. యూఏఈ(యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌), బహ్రెయిన్‌, సౌదీ అరేబియా సహా అనేక గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ బాలిస్టిక్‌ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తున్న వేళ హమాస్‌ నుంచి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. గల్ఫ్‌ దేశాల నుంచి తనకు అందుతున్న ఆర్థిక, దౌత్యపరమైన మద్దతు ఆగిపోతుందనే ఆందోళనతోనే హమాస్‌ ఈ ప్రకటన చేసిందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. గల్ఫ్‌ దేశాల్లోని నెట్‌వర్క్‌ల ద్వారా అందే నిధులపైనే హమాస్‌ ఆధారపడి ఉందని, ఆ దేశాలపై ఇరాన్‌ దాడుల వల్ల ఇప్పుడా నిధులు ఆగిపోతాయని హమాస్‌ ఆందోళన చెందుతోందని తెలిపాయి. గాజాలో కాల్పుల విరమణకు దౌత్య చర్చలు నిర్వహించడంలో ఖతార్‌ కీలకంగా వ్యవహరించింది. తాజా దాడుల వల్ల ఖతార్‌ నుంచి కూడా దూరమవుతామనే ఆందోళన హమా్‌సలో ఏర్పడిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

ఇవి కూడా చదవండి...

గ్యాస్‌ సరఫరాపై సీఎం చంద్రబాబు ఫోకస్.. మంత్రులతో చర్చ

కేంద్రమంత్రి అన్నపూర్ణా దేవితో మంత్రి సీతక్క భేటీ.. చర్చించిన అంశాలివే

Updated Date - Mar 15 , 2026 | 06:40 AM