Share News

ఇరాన్‌కు చైనా క్షిపణులు?

ABN , Publish Date - Jul 31 , 2026 | 05:23 AM

యుద్ధంలో అమెరికాకు దీటుగా నిలుస్తున్న ఇరాన్‌కు చైనా నుంచి రక్షణ వ్యవస్థలు అందబోతున్నాయి. ఇరాన్‌పై దాడి చేస్తున్న అమెరికా విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లను సులువుగా కూల్చే...

ఇరాన్‌కు చైనా క్షిపణులు?

  • పాక్‌ మీదుగా క్షిపణుల సరఫరాకు ఒప్పందం!

  • భుజంపై పెట్టుకుని యుద్ధ విమానాలు,

  • హెలికాప్టర్లు, డ్రోన్లపై దాడిచేసే మ్యాన్‌పాడ్స్‌

  • కీలక వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్‌ కథనం

  • అదే జరిగితే నాకు నిరాశే..: ట్రంప్‌

  • క్షిపణుల సరఫరా నిరాధారమన్న చైనా

  • తరలింపు ఆరోపణలను ఖండించిన పాక్‌

వాషింగ్టన్‌/న్యూఢిల్లీ, జూలై 30: యుద్ధంలో అమెరికాకు దీటుగా నిలుస్తున్న ఇరాన్‌కు చైనా నుంచి రక్షణ వ్యవస్థలు అందబోతున్నాయి. ఇరాన్‌పై దాడి చేస్తున్న అమెరికా విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లను సులువుగా కూల్చే స్వల్పశ్రేణి క్షిపణులు.. పాకిస్థాన్‌ మీదుగా ఇరాన్‌కు సరఫరా కాబోతున్నాయి. చైనా అధికార వర్గాలు, హాంకాంగ్‌కు చెందిన సంస్థ అధికారులను ఉటంకిస్తూ రాయిటర్స్‌ వార్తా సంస్థ ఈ వివరాలు వెల్లడించింది. ఆ కథనం ప్రకారం.. ఒక వ్యక్తి భుజంపై పెట్టుకుని ప్రయోగించగల ‘క్యూడబ్ల్యూ-12, ఎఫ్‌ఎన్‌-16 మ్యాన్‌పాడ్స్‌ (మ్యాన్‌-పోర్టబుల్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్స్‌)’ చైనా నుంచి ఇరాన్‌కు సరఫరా కానున్నాయి. కేవలం 18 కిలోల బరువుండే ఈ మ్యాన్‌పాడ్స్‌.. పరారుణ, అతినీలలోహిత సెన్సర్ల ఆధారంగా దూసుకెళ్లి లక్ష్యాన్ని ధ్వంసం చేస్తాయి. రూ.670 కోట్ల విలువైన 400మ్యాన్‌పాడ్స్‌ సరఫరా కోసం హాంకాంగ్‌కు చెందిన ఝాంగ్‌కింగ్‌ బావోషాంగ్‌ ఇంటర్నేషనల్‌ ఇన్వె్‌స్టమెంట్‌ సంస్థ మధ్యవర్తిగా చైనా, ఇరాన్‌ మధ్య ఒప్పందం జరిగింది.

అదే జరిగితే నాకు నిరాశే..: ట్రంప్‌

‘‘ఇది నిజమైతే ఆశ్చర్యకరమే. ఇరాన్‌కు ఎలాంటి ఆయుధాలు ఇవ్వబోమని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ హామీ ఇచ్చారు. ఒకవేళ సరఫరా జరిగితే నేను నిరాశ చెందుతానని ఆయనకు బాగా తెలుసు’’ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యానించారు. కాగా, ఇరాన్‌కు క్షిపణుల సరఫరా వార్తలు నిరాధారమని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. క్షిపణుల సరఫరాతో తమకు సంబంధం లేదని పాక్‌ మిలిటరీ పబ్లిక్‌ రిలేషన్స్‌ విభాగం పేర్కొంది.

ఈ వార్తలనూ చదవండి:

కువైట్‌లోని చైనా కంపెనీపై ఇరాన్ దాడి

కుట్రపూరిత వీసా కేసు.. అమెరికా నుంచి భారతీయుడి బహిష్కరణ

Updated Date - Jul 31 , 2026 | 05:23 AM