మహిళల సంఖ్య తగ్గిపోయింది.. చైనా కోలుకోవడం అసాధ్యం: యూఎస్ ఇన్వెస్టర్
ABN , Publish Date - Jun 12 , 2026 | 01:51 PM
చైనా జనాభా మళ్లీ కోలుకోలేని స్థితికి చేరుకుందని అమెరికన్ ఇన్వెస్టర్, మార్టిన్ క్యాపిటల్ సంస్థ వ్యవస్థాపకుడు రాడ్ డీ మార్టిన్ తాజాగా తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: చైనాలో జనాభా తగ్గుదల నేపథ్యంలో దేశాభివృద్ధి పడిపోనుందని అమెరికన్ ఇన్వెస్టర్, మార్టిన్ క్యాపిటల్ సంస్థ వ్యవస్థాపకుడు రాడ్ డీ మార్టిన్ తాజాగా తెలిపారు. ప్రస్తుత గణాంకాల ప్రకారం చూస్తే చైనా జనాభా మళ్లీ పెరగడం అసాధ్యమని స్పష్టం చేశారు. జనాభా మళ్లీ పెరిగేందుకు సరిపడా చైనాలో మహిళల సంఖ్య లేదని అన్నారు. కాలం గడిచే కొద్దీ చైనాలో వినియోగదారులు తగ్గిపోయి, మార్కెట్ కుంచించుకుపోయి, శక్తిమంతమైన దేశం కావాలన్న చైనా కల చెదిరిపోతుందని చెప్పారు.
‘చైనా పతనం తథ్యం. గణాంకాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. జనాభా మళ్లీ కోలుకునేందుకు కావాల్సిన సంఖ్యలో అక్కడ మహిళలు లేరు’ అని అన్నారు. ఐరోపా, జపాన్‌లో మాత్రం జనాభా తగ్గుదల అనేది ఒక్కసారిగా కాకుండా క్రమంగా జరుగుతోందని చెప్పారు. మహిళల సంఖ్య తగ్గిపోయిన కారణంగా చైనాలో తీవ్ర స్థాయి మార్పులు కనిపిస్తున్నాయని చెప్పారు.
1980-2016 మధ్య చైనా అనుసరించిన ‘ఏక సంతాన విధానం’ వల్ల జనాభాలో స్త్రీపురుష నిష్ఫత్తి భారీ స్థాయిలో ప్రభావితమైందని నిపుణులు చెబుతున్నారు. ఏక సంతాన విధానానికి తోడు అబ్బాయిలే కావాలన్న తల్లిదండ్రుల భావన, ఆడపిల్లలు పుట్టకుండా అబార్షన్లు వంటివన్నీ ప్రస్తుత పరిస్థితికి దారితీశాయని చెబుతున్నారు. మునుపటి తరంలో మొదలైన అసమానతలన్నీ తదుపరి తరంలో మరింత తీవ్రంరూపం దాల్చే పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. 2100 నాటికల్లా చైనా జనాభా సగానికి (633 మిలియన్లు) పడిపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
రొమాన్స్ స్కామ్.. రూ. 24 లక్షలు మోసపోయిన వృద్ధురాలు..
చైనాలో గూఢచర్యం చేస్తున్న తాబేళ్లు, చేపలు..