Share News

భారత సరిహద్దుకు సమీపంలో అత్యాధునిక చైనా ఫైటర్ జెట్స్!

ABN , Publish Date - Jul 30 , 2026 | 06:05 PM

భారత సరిహద్దుకు సమీపంలో చైనా తన అత్యాధునిక 5వ తరం జే-20 ఫైటర్ జెట్స్‌ను మోహరించినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది.

భారత సరిహద్దుకు సమీపంలో అత్యాధునిక చైనా ఫైటర్ జెట్స్!
J-20 Jets Near border

ఇంటర్నెట్ డెస్క్: భారత సరిహద్దుకు సమీపంలో చైనా తన అత్యాధునిక 5వ తరం జే-20 ఫైటర్ జెట్స్‌ను మోహరించినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. కమర్షియల్ శాటిలైట్ చిత్రాల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వాస్తవాధీన రేఖకు సమీపంలోని జింజియాంగ్, డామ్‌జంగ్ వైమానికస్థావరాల్లో చైనా ఈ విమానాలను రెడీగా పెట్టింది.

జాతీయ మీడియా కథనాల ప్రకారం, జింజియాంగ్ ప్రావిన్స్‌లోని హుటాన్ ఎయిర్‌బేస్‌లో చైనా 8 జే-20 విమానాలను మోహరించింది. లద్దాఖ్‌లోని భారత వైమానిక స్థావరం దౌలత్ బేగ్ ఓల్డీకి సుమారు 254 కిలోమీటర్ల దూరంలో హుటాన్ స్థావరం ఉంది. ఇక టిబెట్‌లోని లాసా ప్రీఫెక్చర్‌లో గల డామ్‌జంగ్ ఎయిర్‌బేస్‌లో మరో నాలుగు జే-20 విమానాలు ఉన్నట్టు శాటిలైట్ చిత్రాల్లో బయటపడింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ ప్రాంతం నుంచి సుమారు 344 కిలోమీటర్ల దూరంలో డామ్‌జంగ్ ఎయిర్‌బేస్ ఉంది. హుటాన్ ఎయిర్‌బేస్ చిత్రాలను జులై 9న, డామ్‌జంగ్ ఎయిర్‌బేస్ చిత్రాలను జూన్ 24న తీశారు.


సరిహద్దు వెంబడి చైనా దూకుడు..

5వ తరం ఫైటర్ జెట్స్‌ అయిన జే-20 విమానాలు శత్రుదేశాల రాడార్‌ కంటికి చిక్కవన్న పేరుంది. చైనా ఎయిర్‌ఫోర్స్‌లో ఇవే అత్యాధునిక విమానాలని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇలాంటి విమానాలను చైనా ఈ మధ్యకాలంలో తరచూ సరిహద్దు వెంబడి మోహరిస్తోందని అంటున్నారు. గతంలో హుటాన్, డామ్‌జంగ్ ఎయిర్‌బేస్‌లో జే-20 విమానాలు స్వల్పంగా ఉండేవని సమాచారం. ఈ మధ్యకాలంలో వీటి సంఖ్య పెరుగుతూ వస్తోంది. టిబెట్, జింజియాంగ్ ప్రావిన్స్‌లో మిలిటరీ మౌలిక వసతులను ఆధునికీకరించే ప్రయత్నాల్లో భాగంగా చైనా ఈ జెట్స్‌ను మోహరిస్తోందన్న కామెంట్స్ ఉన్నాయి. భారత్‌ అవసరాలకు సరిపడా ఫైటర్ జెట్స్ ప్రస్తుతం అందుబాటులో లేవని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చైనా తన అత్యాధునిక జెట్స్‌ను వాస్తవాధీన రేఖ సమీపానికి తరలించడం కీలక పరిణామమని వ్యాఖ్యానిస్తున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

కువైట్‌లోని చైనా కంపెనీపై ఇరాన్ దాడి

కుట్రపూరిత వీసా కేసు.. అమెరికా నుంచి భారతీయుడి బహిష్కరణ

Updated Date - Jul 30 , 2026 | 06:42 PM