సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లపై చైనా ఉక్కుపాదం! వేల కొద్దీ అకౌంట్స్ క్లోజ్
ABN , Publish Date - May 08 , 2026 | 05:31 PM
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లపై చైనా ఉక్కుపాదం మోపుతోంది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న వేలకొద్దీ అకౌంట్స్‌ను ఇప్పటికే క్లోజ్ చేసింది. మరికొన్నింటిపై సమీక్ష ప్రారంభించింది.
ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియా కట్టడి కోసం రంగంలోకి దిగిన చైనా అక్కడి ఇన్‌ఫ్లుయెన్సర్‌లపై ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే వేల కొద్దీ అకౌంట్‌లను క్లోజ్ చేసింది. మరికొన్నింటికి రెడ్ అలర్ట్‌లు జారీ చేసింది. కొన్ని అకౌంట్లపై సమీక్ష ప్రారంభించింది. ముఖ్యంగా ఇన్వెస్ట్‌మెంట్ టిప్స్, మెడికల్ అంశాలకు సంబంధించిన సూచనలు అందిస్తామనంటూ హడావుడి చేసే ఇన్‌ఫ్లుయెన్సర్‌లతో ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో వారి కట్టడికి చైనా రంగంలోకి దిగింది.
చైనాలోని ఇంటర్నెట్ నియంత్రణ సంస్థ సైబర్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఇప్పటికే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ల కట్టడి కోసం పలు నిబంధనలు రూపొందించింది. చట్టాలు, ఆర్థిక అంశాలు, విద్య వంటి సున్నితమైన విషయాల్లో కంటెంట్ సృష్టించే వారు ముందుగా ఈ సలహాలు ఇచ్చేందుకు తమకున్న అర్హతలు ఏమిటో నిరూపించుకోవాలి.
తాము కంటెంట్ చేస్తున్న రంగాలకు సంబంధించి డిగ్రీలు, లేదా సర్టిఫికేట్‌లు, ఇతర ప్రొఫెషనల్ లైసెన్సులు ఉన్న వారు మాత్రమే వీడియోలు చేయాల్సి ఉంటుంది. సరైన నైపుణ్యాలు, అర్హతలు లేని కంటెంట్ క్రియేటర్లు ఇచ్చే సలహాలతో సమాజంలో తప్పుడు సమాచారం వ్యాపిస్తోందని చైనా చెబుతోంది. చివరకు యువత బలిపశువులుగా మారుతున్నారని అంటోంది. దీన్ని కట్టడి చేసేందుకు కంటెంట్ క్రియేటర్ల అర్హత అంశాన్ని తెరపైకి తెచ్చింది. వీటి ద్వారా ఆన్‌లైన్‌లో హెతుబద్ధమైన వాస్తవాలు అందుబాటులో ఉంటాయని అంటోంది.
తప్పుడు సమాచారం వ్యాప్తి కట్టడి బాధ్యత సోషల్ మీడియా వేదికలదేనని కూడా చైనా చెబుతోంది. తమ యూజర్ల సర్టిఫికేట్‌లు, ప్రొఫెషనల్ లైసెన్సులను చెక్ చేశాక కార్యకలాపాలకు అనుమతించాలని చెబుతోంది. పనిలో పనిగా సెలబ్రిటీ కల్చర్‌కు చెక్ పెట్టేందుకు అక్కడి స్థానిక ప్రభుత్వాలు వివిధ రకాల అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాయి. అయితే, ఈ చర్యలు భావప్రకటనా స్వేచ్ఛకు గొడ్డలి పెట్టు అని చైనాలో కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ప్రపంచాన్ని భయపెడుతున్న హంటావైరస్.. ఎలా వ్యాపిస్తుందంటే..
హోర్ముజ్‌లో అమెరికా వార్ షిప్‌లపై దాడి.. ఇరాన్‌పై ట్రంప్ ఆగ్రహం..