సెలవు తీసుకోండి.. ఖర్చు పెట్టండి!
ABN , Publish Date - May 31 , 2026 | 05:07 AM
నాలుగైదు దశాబ్దాలుగా ఆర్థిక వృద్ధిలో అప్రతిహతంగా దూసుకెళ్లిన చైనా.. కొన్నేళ్లుగా నేల చూపులు మొదలుపెట్టింది. ప్రపంచంలోనే రెండో పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన డ్రాగన్ కంట్రీ వృద్ధి రేటు తగ్గుతోంది.
ప్రజల వినియోగం పెంచేందుకు చైనా కొత్త ఫార్ములా.. మందగిస్తున్న ఆర్థిక వ్యవస్థకు ఉద్దీపన ఇచ్చే యత్నం
దేశవ్యాప్తంగా ఐదు రోజులు అదనపు సెలవులు
స్థానికంగా రాష్ట్రాల్లో స్కూళ్లకు మరిన్ని సెలవులు
ఇటీవలే అమల్లోకి కొత్త విధానం
(సెంట్రల్ డెస్క్)
నాలుగైదు దశాబ్దాలుగా ఆర్థిక వృద్ధిలో అప్రతిహతంగా దూసుకెళ్లిన చైనా.. కొన్నేళ్లుగా నేల చూపులు మొదలుపెట్టింది. ప్రపంచంలోనే రెండో పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన డ్రాగన్ కంట్రీ వృద్ధి రేటు తగ్గుతోంది. చైనాలో రెండు, మూడు రోజులకు మించి ఉండే సెలవురోజులు చాలా తక్కువ. దానికితోడు విపరీతమైన పనిఒత్తిడి, పనిగంటలూ ఎక్కువే. దీని తో ప్రజల వినియోగ వ్యయాలు ఆశించిన స్థాయిలో పెరగక.. ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలో వృద్ధికి ఊపునిచ్చేందుకు చైనా ‘సెలవుల’ మంత్రం పఠిస్తోంది. దేశవ్యాప్తంగా కచ్చితంగా పా టించాల్సిన సెలవులను మరో ఐదు రోజులు పెం చింది. స్థానికంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వీలును బట్టి సెలవులను పెంచాలనీ ఆదేశించింది. సెలవులు ఇవ్వడం ద్వారా ప్రజలు పర్యాటక, వినోద ప్రాంతాలకు వెళతారని, ఆహార, ప్రయాణ వ్యయం పెరిగి.. ఆర్థిక వ్యవస్థకు ఉద్దీపన కలుగుతుందని ఈ నిర్ణయం తీసుకుంది. ఈ వివరాలతో ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ పత్రిక కథనం ప్రచురించింది.
వరుస సెలవులు ఇస్తూ..
కమ్యూనిస్టు దేశమైన చైనా ఏటా మేడే సందర్భంగా మే 1వ తేదీతోపాటు మరో రెండు రోజులు కలిపి మూడు రోజులు సెలవు ప్రకటిస్తుంటుంది. కానీ ఈసారి మే 1 నుంచి ఐదో తేదీ వరకు ఐదు రోజులు సెలవులు ఇచ్చింది. చింగ్‌మింగ్ పండుగ సందర్భంగా ఇచ్చే రెండు రోజులకు అదనంగా మరో రోజు సెలవు ఇచ్చింది. నూతన సంవత్సరం సందర్భంగా ఇచ్చే సెలవులనూ ఒకరోజు పెంచింది. ఇక స్థానికంగా ఫుజియాన్ ప్రావిన్స్ (రాష్ట్ర) తమ పరిధిలో పాఠశాలలకు మూడు రోజుల చొప్పున రెండు సార్లు అదనంగా సెలవులు ప్రకటించింది. అదే బాటలో మరో 27 రాష్ట్రాలూ అదనంగా సెలవులు ఇస్తున్నాయి. ఈ చర్య ఫలితమిస్తున్నట్టే కనిపిస్తోందని చైనా అధికారులు చెబుతున్నారు కూడా. ఇటీవల ఇచ్చిన ఐదు రోజుల మేడే సెలవుల సందర్భంగా.. దేశవ్యాప్తంగా 11.7 కోట్ల రైల్వే ప్రయాణాలు అదనంగా నమోదయ్యాయని.. పర్యాటక, వినోద ప్రదేశాల్లో వందల కోట్ల యువాన్ల వ్యాపారం జరిగిందని వెల్లడించారు. పర్యాటక వృద్ధి ద్వారా వచ్చే ఐదేళ్లలో రూ.703 లక్షల కోట్ల (చైనా కరెన్సీలో 50 లక్షల కోట్ల యువాన్ల) ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నట్టు పేర్కొన్నారు.
ఒక్కసారిగా పోటెత్తుతున్న జనంతో సమస్య
దేశవ్యాప్తంగా అదనపు సెలవులు ప్రకటించడంతో మేడే సందర్భంగా చైనా వ్యాప్తంగా చాలా పర్యాటక ప్రదేశాలకు ఒకే సమయంలో జనం భారీ సంఖ్యలో పోటెత్తారు. దీనితో ఇబ్బందులు తలెత్తాయి. రవాణా, హోటళ్లు, ఇతర వ్యవస్థలపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఇది చూసి చాలా మంది ప్రయాణాలను మానుకున్నారు. దీన్ని గమనించిన చైనా ఉన్నతాధికారులు కొత్త ప్రతిపాదనలు తెరపైకి తెచ్చారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని పాఠశాలలకు ఇచ్చే అదనపు సెలవులను వేర్వేరు తేదీల్లో ఉండేలా చర్యలు చేపడుతున్నారు. పెంచిన పబ్లిక్ హాలిడేలను దేశవ్యాప్తంగా ఉద్యోగులందరికీ ఒకేసారి ఇవ్వకుండా.. వివిధ రంగాలు, స్థాయిల వారీగా వేర్వేరు దశల్లో పెయిడ్ హాలిడేలుగా ఇవ్వాలని నిర్ణయించారు. దీనివల్ల ఒకేసారి ఒత్తిడి పడకుండా.. ఏడాది పొడవునా పర్యాటక డిమాండ్ సమతుల్యం అవుతుందని భావిస్తున్నారు. మొత్తంగా ప్రజలకు సెలవులు ఇచ్చి.. వారితో ఖర్చుపెట్టించాలని, ఆర్థిక వ్యవస్థ జోరుగా కొనసాగించాలని చైనా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.