Share News

ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన చైనా.. ‘నీ వల్లే ఇదంతా..’

ABN , Publish Date - Apr 13 , 2026 | 06:10 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై చైనా ఘాటుగా స్పందించింది. ట్రంప్ కారణంగానే హోర్ముజ్ జలసంధికి ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని చైనా వ్యాఖ్యానించింది.

ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన చైనా.. ‘నీ వల్లే ఇదంతా..’
China US tensions Hormuz

ఇంటర్‌నెట్ డెస్క్: చైనా, జపాన్ దేశాలకు హోర్ముజ్ జలసంధిని తెరిచే ధైర్యం లేదంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ట్రంప్ వ్యాఖ్యలపై చైనా ఘాటుగా స్పందించింది. ట్రంప్ కారణంగానే హోర్ముజ్ జలసంధికి ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని చైనా వ్యాఖ్యానించింది. సోమవారం చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ.. ‘యుద్ధం మొదలవ్వడానికి ముందు హోర్ముజ్ జలసంధి తెరిచే ఉంది. ఏ అవసరం లేకపోయినా యుద్ధం మొదలెట్టింది మీరే. హోర్ముజ్‌ను మిగిలిన దేశాలకు కూడా లేకుండా మూయించి వేశారు’ అని అన్నారు.


ట్రంప్ దూకుడు..

ఇరాన్, అమెరికాల మధ్య శాంతి చర్చలు ఫలించకపోవటంతో ట్రంప్ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. హోర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. దిగ్బంధనానికి (Blockade) సిద్ధమయ్యారు. ఇరాన్ ఓడ రేవులకు వెళ్లే లేదా అక్కడి నుంచి వచ్చే నౌకలను అడ్డుకుంటామని ట్రంప్ తన సొంత సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే, అంతర్జాతీయ చట్టాల ప్రకారం దిగ్బంధనం నేరం. దిగ్బంధనాన్ని యుద్ధ చర్య (యాక్ట్ ఆఫ్ వార్‌)గా పరిగణిస్తారు.


చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి

ఇరాన్ ఓడ రేవులకు వెళ్లే లేదా అక్కడి నుంచి వచ్చే నౌకలను అడ్డుకుంటామని ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గువో జియాకున్ బీజింగ్‌లో జరిగిన సమావేశంలో స్పందించారు. హోర్ముజ్ జలసంధి కేవలం ఒక ప్రాంతానికి సంబంధించినది కాదని, ఇది ప్రపంచ వాణిజ్యం.. ఇంధన భద్రతకు వెన్నెముక అని పేర్కొన్నారు. ఉద్రిక్తతలు తగ్గించి, అన్ని పక్షాలు శాంతియుతంగా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు.


ఇవి కూడా చదవండి

మహిళల టీ20 ప్రపంచ కప్ 2026.. రికార్డు స్థాయిలో ప్రైజీ మనీ ప్రకటించిన ఐసీసీ

హిందూ దళిత సోదరులను మోసం చేయకండి: రఘురామ

Updated Date - Apr 13 , 2026 | 06:18 PM