ఆ పోస్టర్ వారి జీవితాన్నే మార్చేసింది.. రూ. 7 కోట్ల ఆస్తిని..
ABN , Publish Date - Jul 08 , 2026 | 08:20 AM
పిల్లలు లేని ఓ జంట గొప్ప మనసు చాటుకుంది. గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్న పిల్లల కోసం తమ ఆస్తినంతా ఇచ్చేసింది. తమతో ఎలాంటి సంబంధం లేని 455 మంది పిల్లల కోసం 7 కోట్ల రూపాయల ఆస్తిని ఇచ్చేశారు.
బీజింగ్, జులై 8: పిల్లలు లేని ఓ జంట గొప్ప మనసు చాటుకుంది. గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్న పిల్లల కోసం తమ ఆస్తినంతా ఇచ్చేసింది. తమతో ఎలాంటి సంబంధం లేని 455 మంది పిల్లల కోసం 7 కోట్ల రూపాయల ఆస్తిని ఇచ్చేశారు. ఈ సంఘటన చైనాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. షాంగైకి చెందిన డూ ఇంగ్రోంగ్, సూయింగ్ భార్యాభర్తలు. 2018లో డూ ఓ ఆస్పత్రి దగ్గర ఓ పోస్టర్ చూశాడు.
ఆ పోస్టర్‌లో.. ‘గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్న పిల్లలకు ఆర్థిక సాయం చేయండి’ అని ఉంది. ఆ పోస్టర్‌ను చూడగానే డూ చలించిపోయాడు. ఇంటికి వెళ్లిన తర్వాత భార్యకు విషయం చెప్పాడు. డూ, సూయింగ్‌లు ఏమాత్రం ఆలోచించకుండా అదే రోజు 10 మంది పిల్లల ఆపరేషన్ కోసం ఏకంగా 70 లక్షల రూపాయలు సాయం చేశారు. అంతేకాదు.. తమ ఆస్తిని మొత్తం పిల్లల గుండె ఆపరేషన్ల కోసం దానం చేశారు. దాదాపు 7 కోట్ల రూపాయలను చారిటీకి ఇచ్చేశారు. ‘మీకోసం కొంతైనా ఉంచుకోండి’ అని ఎంతమంది చెప్పినా వాళ్లు వినలేదు.
డూ మాట్లాడుతూ.. ‘మేము ఎక్కువ కాలం ఈ భూమ్మీద ఉండలేము. మా దగ్గర కొంత డబ్బు ఉంది. పెన్షన్ కూడా వస్తోంది. మాకు పెద్దగా డబ్బు అవసరం లేదు’ అని తేల్చి చెప్పాడు. అలా.. డూ దంపతులు తమ కోట్ల ఆస్తిని 455 మంది పిల్లల గుండె ఆపరేషన్ల కోసం ఇచ్చేశారు. డూ దంపతులకు దాన గుణం ఎక్కువ. చైనాలో ఏ ప్రకృతి విపత్తు, ప్రమాదాలు జరిగినా సాయం చేసేవారు. డూ 2018లో 81 ఏళ్ల వయసులో చనిపోయాడు. సూయింగ్ 2025లో 92 ఏళ్ల వయసులో చనిపోయింది. దంపతులిద్దరూ ప్రాణాలతో లేకపోయినా.. వారు చేసిన సేవలు మాత్రం చరిత్రలో నిలిచిపోయాయి.
ఇవి కూడా చదవండి
ప్రపంచ కప్ అర్జెంటీనాకే ఇవ్వాలని ఫిక్స్ చేశారు: ఈజిప్టు ప్లేయర్
విషాదం.. పవన్ అభిమాని హనుమకొండ నిరంజన్ మృతి..