కూలిన బంగారం గని.. 30 మంది దుర్మరణం
ABN , Publish Date - Aug 19 , 2026 | 08:24 AM
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ దేశంలో మంగళవారం ఓ బంగారం గని కూలిపోవడంతో 30 మంది కార్మికులు దుర్మరణం చెందారు.
ఇంటర్నెట్ డెస్క్: సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ దేశంలో మంగళవారం ఓ బంగారం గని కూలిపోవడంతో 30 మంది కార్మికులు దుర్మరణం చెందారు. ఇప్పటికీ గనిలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సహాయక సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు.
నానా మామ్‌బేరు ప్రిఫెక్చర్‌లోని అబ్బా ప్రాంతంలో మంగళవారం ఉదయం గని ఒక్కసారిగా కుప్పకూలిందని గని కార్మికుడు ఒకరు తెలిపారు. ఇప్పటివరకూ 30 మంది మృతదేహాలను వెలికి తీశామని స్థానిక డిప్యూటీ మేయర్ తెలిపారు. క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని చెప్పారు.
స్థానిక మీడియా కథనాల ప్రకారం, అక్కడి యువత చిన్న చిన్న సాధానలతో ఈ గనులను తవ్వుతుంటారు. వీటిని ఆర్టిసనల్ మైన్స్ అని పిలుస్తుంటారు. భారీ యంత్రాలు, రక్షణ వ్యవస్థలు లేకపోవడంతో ఈ గనుల్లో పనిచేసే వారికి నిత్యం ప్రాణాపాయం పొంచి ఉంటుంది. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ లోని ఆర్టిసనల్ మైన్స్ తరచూ కూలిపోతుంటాయని కూడా అక్కడి మీడియా చెబుతోంది. ఇక తాజా ఘటనలో బాధిత కుటుంబాలకు తాము అండగా ఉంటామని ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
హోర్ముజ్ మాదే.. కొత్త మ్యాప్ షేర్ చేసిన ట్రంప్
మీరు గట్టిగా మాట్లాడుతున్నారు.. నిశ్శబ్దంగా ఉండండి: వైట్ హౌస్‌లో విలేకరిపై ట్రంప్ ఆగ్రహం