స్కూల్లో కాల్పులు! చాట్‌జీపీటీతో హంతకురాలి అనుమానాస్పద చాటింగ్
ABN , Publish Date - Feb 21 , 2026 | 12:26 PM
ఇటీవల కెనడాలోని ఓ స్కూల్లో కాల్పులకు తెగబడి చిన్నారులను పొట్టనపెట్టుకున్న నిందితురాలి అనుమానాస్పద చాట్స్ గతేడాదే తమ దృష్టికి వచ్చాయని ఓపెన్ ఏఐ సంస్థ శుక్రవారం తెలిపింది. అయితే, ఆమెతో ముప్పు అంతగా లేదని భావించి పోలీసులను అప్రమత్తం చేయలేదని వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: కెనడాలోని ఓ స్కూల్లో కాల్పులు జరిపి పలువురు చిన్నారులను బలి తీసుకున్న యువతి జెస్సీ వాన్ రూట్‌సేలార్ (18) గురించి ఓపెన్ ఏఐ తాజాగా కీలక ప్రకటన చేసింది. జెస్సీ చాట్‌జీపీటీ అకౌంట్‌లో అనుమానాస్పద సంభాషణలు ఉన్నప్పటికీ ఆమెతో ముప్పు ఉండకపోవచ్చని భావించి పోలీసులకు సమాచారం ఇవ్వలేదని పేర్కొంది. ఆమె చాట్‌జీపీటీ సంభాషణల్లో ప్రమాద సంకేతాలు లేవనే నిర్ధారణకు అప్పట్లో వచ్చినట్టు పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్‌లోని టంబ్లర్ రిడ్జ్ ప్రాంతంలోని స్కూల్లో ఫిబ్రవరి 10న కాల్పుల ఘటన వెలుగు చూసింది. నిందితురాలు జెస్సీ తొలుత తన తల్లి, సోదరుడిని ఇంట్లోనే హత్య చేసి తుపాకీతో స్కూల్‌కు వచ్చింది. అనంతరం, అక్కడి విద్యార్థులపై కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో ఒక అధ్యాపకురాలితో పాటు 10-12 ఏళ్ల వయసున్న ఐదుగురు చిన్నారులు కన్నుమూశారు.
నిందితురాలు జెస్సీ గతంలో అదే స్కూల్‌లో చదువుకున్నట్టు పోలీసులు గుర్తించారు. ఆమె మధ్యలోనే చదువు మానేసిందని తెలిపారు. ఇక జెస్సీ అకౌంట్‌లో అనుమానాస్పద చాట్స్ గురించి గతేడాదే తమ దృష్టికి వచ్చిందని చాట్‌జీపీటీ మాతృసంస్థ ఓపెన్ఏఐ పేర్కొంది. ఒకానొక దశలో కెనడా పోలీసులను అలర్ట్ చేద్దామని కూడా తాము భావించినట్టు పేర్కొంది. ఆ స్థాయి ప్రమాదం లేకపోవచ్చని చివరకు నిర్ధారణకు వచ్చినట్టు తెలిపింది. ఇతరులపై ఆమె భౌతిక దాడులు చేసే ముప్పు తక్కువగా ఉన్నట్టు అంచనాకు వచ్చామని వెల్లడించింది. అయితే, తమ నిబంధనలను ఉల్లంఘించినందుకు గతేడాదే ఆమె అకౌంట్‌పై నిషేధం విధించామని పేర్కొంది. ఇక కాల్పులు ఘటన గురించి తెలియగానే సంస్థ సిబ్బంది పోలీసులను సంప్రదించారని తెలిపింది. ఈ ఘటనలో బాధితులకు సంఘీభావం చెబుతున్నామని పేర్కొంది. ఇక ఈ ఘటనకు సంబంధించి డిజిటల్ ఆధారాలు సహా అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని స్థానిక పోలీసులు తెలిపారు.
ఈ వార్తలూ చదవండి:
దిగుమతులపై 10 శాతం సుంకం.. ప్రకటించిన శ్వేతసౌధం