స్కూల్లో మారణహోమం.. 9 మందిని కాల్చి చంపిన మహిళ
ABN , Publish Date - Feb 11 , 2026 | 12:24 PM
ఓ మహిళ స్కూల్ విద్యార్థులపై కాల్పులకు తెగబడింది. దీంతో 9 మంది చనిపోగా.. 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. విద్యార్థులపై కాల్పుల అనంతరం ఆ మహిళ తనను తాను కాల్చుకుని ప్రాణాలు తీసుకుంది.
ఇంటర్‌నెట్ డెస్క్: కెనడాలోని ఓ స్కూల్లో మారణహోమం చోటుచేసుకుంది. ఓ మహిళ.. స్కూల్ విద్యార్థులపై కాల్పులకు తెగబడింది. దీంతో 9 మంది చనిపోగా.. 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. విద్యార్థులపై కాల్పుల అనంతరం.. ఆ మహిళ తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.
‘ది రాయల్ కెనెడియన్ మౌంటెడ్ పోలీస్’ తెలిపిన వివరాల మేరకు.. మంగళవారం మధ్యాహ్నం బ్రిటీష్ కొలంబియాలోని టంబ్లర్ రిడ్జ్ సెకండరీ స్కూల్‌లోకి ఓ మహిళ ప్రవేశించింది. గన్నుతో స్కూల్లోని విద్యార్థులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపింది. తర్వాత తనను తాను కాల్చుకుని చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్కూల్లో ఆరుగురి మృతదేహాలను గుర్తించారు. తీవ్రంగా గాయపడిన 26 మందిని ఆస్పత్రికి తరలించారు. అయితే.. ఓ విద్యార్థి మార్గం మధ్యలోనే ప్రాణాలు విడిచాడు. ప్రస్తుతం 25 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు.. స్కూలుకు దగ్గరలోని ఓ ఇంటి వద్ద రెండు శవాలను గుర్తించారు. నిందితురాలితో కలిపి మృతుల సంఖ్య 10కి చేరింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితురాలు ఎవరో తెలిసినప్పటికి.. ఆమె గురించి ఎలాంటి వివరాలనూ మీడియాకు వెల్లడించలేదు.
కాల్పుల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. స్కూల్లోని మిగిలిన విద్యార్థులను, సిబ్బందిని సురక్షిత ప్రదేశానికి తరలించారు. విద్యార్థులను వారి కుటుంబ సభ్యులకు అప్పగించే పనిలో పడ్డారు. ఈ మారణహోమంపై కెనడా ప్రధాని మార్క్ కార్నీ స్పందించారు. ఈ మేరకు బుధవారం ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారాయన. స్కూల్లో కాల్పుల ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఇవి కూడా చదవండి
మా దేశాన్ని టాయిలెట్ పేపర్ కంటే ఘోరంగా తీసిపడేశారు.. అమెరికాపై పాక్ మంత్రి ఆగ్రహం..