క్షణాల్లో 28,000 అడుగుల కిందికి.. బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో సాంకేతిక లోపం
ABN , Publish Date - Oct 06 , 2026 | 03:35 AM
ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ దుశ్చర్యను మరువక ముందే మరో విమానం తీవ్ర ఆందోళనకు గురిచేసింది.
ఐర్లాండ్ గగనతలంపై ఉండగా 37 వేల అడుగుల
ఎత్తు నుంచి ఒకేసారి 9 వేల అడుగుల దిగువకు పతనం
ఎమర్జెన్సీ కోడ్ పంపిన విమాన పైలట్లు
లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండింగ్
లండన్, అక్టోబరు 5: ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ దుశ్చర్యను మరువక ముందే మరో విమానం తీవ్ర ఆందోళనకు గురిచేసింది. లండన్‌లోని హీత్రూ విమానాశ్రయం నుంచి అమెరికాలోని షికాగోకు సోమవారం బయలుదేరిన బ్రిటిష్ ఎయిర్‌వేస్‌కు బోయింగ్ 777-200ఈఆర్ విమానం 37 వేల అడుగుల ఎత్తు నుంచి ఒకేసారి 9 వేల అడుగుల దిగువకు జారిపోయింది. దీంతో అందులోని ప్రయాణికులతోపాటు విమానయాన సంస్థ అధికారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ విమానం సోమవారం ఉదయం (స్థానిక కాలమానం) 11.50 గంటల సమయంలో హీత్రూ నుంచి బయలుదేరింది. అది ఐర్లాండ్ గగనతలంపై ఎగురుతుండగా ఉన్నట్లుండి ఏకంగా 28,000 అడుగులు జారిపోయింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన పైలట్లు 7700 ఎమర్జెన్సీ సిగ్నల్ పంపారు. సాధారణ ఎమర్జెన్సీకి ఈ కోడ్‌ను వాడుతారు. వెంటనే స్పందించిన హీత్రూ విమానాశ్రయ అధికారులు విమానాన్ని వెనక్కు రప్పించారు. అతికష్టం మీద విమానాన్ని నియంత్రించిన పైలట్లు.. పలు దఫాలుగా ప్రయత్నించిన తర్వాత హీత్రూలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటనపై బ్రిటిష్ ఎయిర్‌వేస్ అధికారులు పూర్తి వివరాలు వెల్లడించలేదు. అయితే, విమానంలో ప్రెషర్ పడిపోవటం వల్లే ఈ ఘటన జరిగిందని ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ విమానం 30 ఏళ్ల నాటిదని తెలిసింది. బ్రిటిష్ ఎయిర్‌వే్‌సలో అత్యంత ఎక్కువకాలంగా పనిచేస్తున్న విమానాల్లో ఇదీ ఒకటి అని యూకే ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఈ వార్తలు కూడా చదవండి
అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు సీరియస్.. నేరస్థుల్లో భయం పుట్టించాలంటూ.
ఐక్యరాజ్యసమితి ప్రాధాన్యం కోల్పోతోంది.. సంస్కరణలు తప్పనిసరి: జైశంకర్