Share News

అవన్నీ తప్పుడు కథనాలే!

ABN , Publish Date - Sep 18 , 2026 | 03:41 AM

భారత్‌లో జరిగిన బ్రిక్స్‌ వార్షిక శిఖరాగ్ర సదస్సుకు హాజరైన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమఫోసా అనారోగ్యానికి గురయ్యారంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న వదంతులను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. అవన్నీ ఫేక్‌ వార్తలని విదేశాంగ శాఖ ఫ్యాక్ట్‌చెక్‌ విభాగం స్పష్టం చేసింది.

అవన్నీ తప్పుడు కథనాలే!
EXTERNALAFFAIRS

  • బ్రిక్స్‌ సదస్సుకు హాజరైన చైనా, దక్షిణాఫ్రికా అధ్యక్షులు

  • అనారోగ్యానికి గురయ్యారంటూ వచ్చిన వదంతుల్ని

  • ఖండించిన భారత విదేశాంగ శాఖ

బీజింగ్‌, సెప్టెంబరు 17: భారత్‌లో జరిగిన బ్రిక్స్‌ వార్షిక శిఖరాగ్ర సదస్సుకు హాజరైన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రమఫోసా అనారోగ్యానికి గురయ్యారంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న వదంతులను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. అవన్నీ ఫేక్‌ వార్తలని విదేశాంగ శాఖ ఫ్యాక్ట్‌చెక్‌ విభాగం స్పష్టం చేసింది. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై ఇలాంటి దురుద్దేశపూర్వక పోస్టులు పెట్టొద్దని హెచ్చరించింది. బ్రిక్స్‌ సదస్సుకు హాజరైన జిన్‌పింగ్‌ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన బ్రిక్స్‌ గాలా డిన్నర్‌కు గైర్హాజరయ్యారు. సుదీర్ఘ ప్రయాణం, వరుస భేటీల వల్ల కలిగిన అలసట కారణంగానే ఆయన హోటల్‌ గదికి వెళ్లిపోయినట్టు విశ్వసనీయవర్గాలను ఉటంకిస్తూ అప్పట్లో కథనాలు వచ్చాయి. చైనాకు చేరుకున్నాక జిన్‌పింగ్‌ను బీజింగ్‌లోని 301 హాస్పిటల్‌కు తరలించారని ‘చైనా డెమొక్రటిక్‌ పార్టీ’ చైర్మన్‌ ‘వాన్‌జున్‌ షి’ తన ‘ఎక్స్‌’ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. మరికొందరు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు కూడా భారత్‌ పర్యటనకు జిన్‌పింగ్‌ అనారోగ్యానికి ముడిపెడుతూ పోస్టులు పెట్టారు. అనారోగ్యం కారణంగా అధ్యక్షుడు సిరిల్‌ రమఫోసా బహిరంగ కార్యక్రమాలకు హాజరు కారంటూ దక్షిణాఫ్రికా అధ్యక్ష కార్యాలయం చేసిన ప్రకటన ఈ వదంతులకు తోడైంది. దీంతో భారత విదేశాంగ శాఖ అప్రమత్తమై ఇవన్నీ తప్పుదోవ పట్టించే కథనాలని కొట్టిపారేసింది.

ఈ వార్తలు కూడా చదవండి

ఫ్యూచర్ సిటీలో ఎస్‌బీఐ డేటా సెంటర్‌ ఏర్పాటు.. 10 ఎకరాలు కేటాయించిన సర్కార్

భూముల అన్యాక్రాంతంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి: ఎంపీ రఘునందన్

Updated Date - Sep 18 , 2026 | 03:41 AM