బంగ్లాదేశ్‌లో మళ్లీ కార్మికుల నిరసనలు
ABN , Publish Date - Nov 15 , 2026 | 10:18 PM
బంగ్లాదేశ్ వస్త్రపరిశ్రమలో మరోసారి కలకలం రేగింది. వేతనాలను పెంచాలంటూ ఆదివారం కార్మికులు పలు ప్రాంతాల్లో నిరసనకు దిగడంతో 13 ఫ్యాక్టరీలను నిరవధికంగా మూసివేయాల్సి వచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్ వస్త్రపరిశ్రమలో మరోసారి కలకలం రేగింది. వేతనాలను పెంచాలంటూ ఆదివారం కార్మికులు పలు ప్రాంతాల్లో నిరసనకు దిగడంతో 13 ఫ్యాక్టరీలను నిరవధికంగా మూసివేయాల్సి వచ్చింది. మరో ఐదు పరిశ్రమలకు ఒక రోజు సెలవు ప్రకటించారు. కొన్ని చోట్ల నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్ప వాయువు ప్రయోగించారు. కొంతకాలం క్రితం పలువురు ఫ్యాక్టరీ వర్కర్లు జీతాల పెంపును డిమాండ్ చేస్తూ పారిశ్రామిక వాడల్లో నిరసనకు దిగిన విషయం తెలిసిందే.
ప్రపంచంలో చైనా తరువాత అతిపెద్ద వస్త్ర ఎగుమతిదారుగా బంగ్లాదేశ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ రంగం 4 మిలియన్‌ల పైచిలుకు కార్మికులకు ఉపాధి కల్పిస్తోంది. బంగ్లాదేశ్ ఎగుమతుల్లో 80 శాతం వస్త్ర పరిశ్రమదే. ఈ నేపథ్యంలో కార్మికుల నిరసనలు ఎక్కువ కాలం పాటు కొనసాగితే అంతర్జాతీయ సప్లై చైన్లలో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన నెలకొంది.
ఇదిలా ఉంటే, వేతన సవరణ కోసం ప్రభుత్వం కనీస వేతన బోర్డును నవంబర్ 1న ఏర్పాటు చేసింది. ఈ నెలాఖరుకల్లా నూతన వేతనాన్ని నిర్ణయిస్తామని పేర్కొంది. ఆ తరువాత డిసెంబర్ 1 నుంచి నూతన వేతన విధానం అమల్లోకి వస్తుంది. ఇక ప్రముఖ వస్త్రాల బ్రాండ్స్ హెచ్ అండ్ ఎమ్, జారాకు బంగ్లాదేశ్ నుంచే వస్త్రాలు ఎగుమతి అవుతుంటాయి.
ఈ వార్తలనూ చదవండి:
ఇరాన్ వద్ద ఇంకా 2,500 క్షిపణులు!
విమాన నియంత్రణ వ్యవస్థ ఆధునికీకరణకు తక్షణమే నిధులివ్వాలి.. కాంగ్రెస్‌కు ట్రంప్ విజ్ఞప్తి