Share News

మేడ్ ఇన్ చైనా యుద్ధ ట్యాంకు.. పాక్ మందుగుండు సామగ్రి.. అందుకే పేలిందా?

ABN , Publish Date - Sep 11 , 2026 | 08:04 PM

బంగ్లాదేశ్‌లో ఇటీవల మేడ్ ఇన్ చైనా యుద్ధ ట్యాంకు పేలుడు ఘటనకు సంబంధించి చైనా సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.

మేడ్ ఇన్ చైనా యుద్ధ ట్యాంకు..  పాక్ మందుగుండు సామగ్రి.. అందుకే పేలిందా?
Bangladesh Tank Explosion

ఇంటర్నెట్ డెస్క్: చైనా తయారు చేసిన ఓ యుద్ధ ట్యాంకు బంగ్లాదేశ్‌లో పేలిపోవడం ఇటీవల కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు బంగ్లాదేశీ సైనికులు మరణించగా ఓ సీనియర్ అధికారి గాయపడ్డారు. పేలుడుకు గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు జరుగుతోంది. అయితే, పేలుడు వెనక పాక్ మందుగుండు సామగ్రి కారణమై ఉండొచ్చన్న వాదన చైనా సోషల్ మీడియాలో తెరపైకి వచ్చింది. యుద్ధ ట్యాంకులో వినియోగించే మందుగుండు సామగ్రి పాక్ నుంచి బంగ్లాదేశ్ దిగుమతి చేసుకుందంటూ చైనా సోషల్ మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి.


మీడియా కథనాల ప్రకారం, బంగ్లాదేశ్‌లో జరిగిన ప్రమాదంలో టైప్-692జీ అనే మేడ్ ఇన్ చైనా యుద్ధ ట్యాంకు పేలిపోయింది. రష్యాకు చెందిన టీ-54 యుద్ధ ట్యాంకు ఆధారంగా చైనా ఈ ట్యాంకును రూపొందించింది. టీ-54 యుద్ధ ట్యాంకులను 1958-85 మధ్య కాలంలో వివిధ దేశాలు వినియోగించేవి. ప్రస్తుతం బంగ్లాదేశ్, పాక్‌తో పాటు చాఢ్, జాంబియా దేశాలు ఈ ట్యాంకును వినియోగిస్తున్నాయి. ఇక ఇటీవల పేలిన యుద్ధ ట్యాంకులో వినియోగించిన హీట్ అనే మందుగుండు సామగ్రిని పాక్ నుంచి దిగుమతి చేసుకున్నట్టు చైనా సోషల్ మీడియాలో పలువురు రాసుకొచ్చారు. అయితే, వీటిల్లో నాణ్యతాలోపం ఉందా లేదా అనేది పూర్తిస్థాయిలో నిర్ధారణ కాలేదు.


పాక్‌లోని వా ప్రాంతంలోగల ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ హీట్ మందుగుండు సామగ్రిని ఉత్పత్తి చేస్తోంది. ఇటీవల కాలంలో పాక్‌తో దౌత్యబంధం బలోపేతానికి ప్రయత్నిస్తున్న బంగ్లాదేశ్ రక్షణ రంగ సహకారాన్ని పెంచింది. పాక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నుంచి 40 వేల రౌండు యుద్ధ ట్యాంకు మందుగుండు సామగ్రి కోసం ఒప్పందం చేసుకుంది. ఈ నేపథ్యంలో చైనా విశ్లేషకులు కొందరు మాత్రం పాక్ వైపు వేలెత్తి చూపిస్తున్నారు. 2022లో బంగ్లాదేశ్ యుద్ధ ట్యాంకు పేలుడు సమయంలో కూడా మేడ్ ఇన్ పాక్ మందుగుండు సామగ్రి అంశం తెరపైకి వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇక తాజా ఘటనలో అసలేం జరిగిందనే విషయంలో మాత్రం స్పష్టత లేదు.


ఈ వార్తలనూ చదవండి:

సౌదీ యువరాజుకు షాకిచ్చిన ట్రంప్.. రెండు సార్లు ఫోన్ చేసినా..

పుతిన్ విమానం అంత ప్రత్యేకమా? ‘డూమ్స్‌డే ప్లేన్’లో ఉన్న సదుపాయాలివే!

Updated Date - Sep 11 , 2026 | 08:51 PM