Share News

బ్యాంకాక్‌లోని పబ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 27 మంది మృతి..

ABN , Publish Date - Jul 13 , 2026 | 06:30 AM

బ్యాంకాక్‌లోని ఓ పబ్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 27 మంది మృతి చెందగా.. 63 మందికి గాయాలయ్యాయి.

బ్యాంకాక్‌లోని పబ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 27 మంది మృతి..
Bangkok pub fire

ఇంటర్‌నెట్ డెస్క్: బ్యాంకాక్‌లోని ఓ పబ్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 27 మంది మృతి చెందగా.. 63 మందికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో స్థానికులు, విదేశీయులు ఉన్నారు. ఆదివారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రాథమిక దర్యాప్తు వివరాల మేరకు.. చతుచక్ ప్రాంతంలోని 'రోంగ్ బీర్ నా లాడ్‌ప్రావ్' పబ్‌లో ఆదివారం రాత్రి 11:57 గంటల సమయంలో.. లైవ్ బ్యాండ్ సంగీత ప్రదర్శన ఇస్తుండగా వేదిక సమీపంలోని సర్క్యూట్ బ్రేకర్ నుంచి పొగలు రావటం మొదలైంది.


ఆ వెంటనే పబ్‌లో కరెంట్ పోయింది. క్షణాల్లోనే పెద్ద పేలుడు సంభవించింది. వేదిక ముందు భాగం నుంచి మంటలు వేగంగా వ్యాపించాయి. పబ్ లోపల ఇంటీరియర్ డెకరేషన్ కోసం ఉపయోగించిన వస్తువుల కారణంగా సీలింగ్ ద్వారా మంటలు అత్యంత వేగంగా పబ్ అంతటా వ్యాపించాయి. పబ్ అత్యవసర ద్వారాల వద్ద స్టాళ్లు, టేబుళ్లు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు బయటకు రాకుండా దారులు మూసుకుపోయాయి. దట్టమైన పొగ, చీకటి కారణంగా ప్రాణాలు కాపాడుకోవడానికి చాలా మంది పబ్ వెనుక భాగంలో ఉన్న రెస్ట్‌రూమ్‌ల వైపు పరిగెత్తారు.


అయితే, అక్కడ ఎలాంటి అత్యవసర ద్వారాలు లేకపోవడంతో పొగ కారణంగా ఊపిరాడక ఎక్కువ మంది బాత్‌రూములలోనే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది అతి కష్టం మీద మంటల్ని అదుపులోకి తెచ్చారు. పోలీసులు గాయపడ్డ వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. థాయ్‌లాండ్ ప్రధాన మంత్రి అనుతిన్ చర్నవిరకుల్ సంఘటనా స్థలానికి వెళ్లారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. పబ్ నిబంధనలను పాటిస్తోందా? లేదా అనే అంశంపై పూర్తి స్థాయి ఫోరెన్సిక్ దర్యాప్తునకు ప్రధాన మంత్రి ఆదేశించారు.


ఇవి కూడా చదవండి

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

బ్యాంకాక్‌లోని పబ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 27 మంది మృతి..

Updated Date - Jul 13 , 2026 | 06:51 AM