క్షిపణుల కొరత ఆగిన దాడులు
ABN , Publish Date - Jul 27 , 2026 | 06:10 AM
ఇరాన్‌పై దాడులు మరింత పెంచుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ప్రకటించారు. ఊహించనంత భారీగా దాడులు ఉంటాయనీ చెప్పారు. కానీ అందుకు విరుద్ధంగా ఇరాన్‌పై...
అమెరికా వద్ద తరిగిపోతున్న క్షిపణుల నిల్వలు
ప్రభుత్వ సలహాదారుల హెచ్చరికలతో తగ్గిన ట్రంప్
ఆదివారం నిలిచిపోయిన అమెరికా, ఇరాన్ దాడులు
హోర్ముజ్‌లో సీమైన్ తగిలి పేలిపోయిన ట్యాంకర్!
సౌదీ ఆరామ్‌కో రిఫైనరీపై హుతీల దాడి
వాషింగ్టన్/దుబాయ్, జూలై 26: ఇరాన్‌పై దాడులు మరింత పెంచుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల ప్రకటించారు. ఊహించనంత భారీగా దాడులు ఉంటాయనీ చెప్పారు. కానీ అందుకు విరుద్ధంగా ఇరాన్‌పై దాడుల తీవ్రత తగ్గుతూ వచ్చింది. ఆదివారం అసలు ఎలాంటి దాడులూ చేయలేదు. అమెరికాకు క్షిపణుల కొరత తలెత్తుతుండటం, దౌత్య చర్యల్లో పురోగతి, యుద్ధం మరింత విస్తరించే ప్రమాదం ఉందని రక్షణశాఖ ఉన్నతాధికారులు, సలహాదారులు హెచ్చరించడమే దీనికి కారణమని అమెరికా మీడియా వెల్లడించింది. అమెరికా ఎంతగా దాడులు చేస్తున్నా ఇరాన్ ఏమాత్రం వెనక్కితగ్గడం లేదు.. పైగా చవకైన డ్రోన్లు, క్షిపణులతో గల్ఫ్‌లోని అమెరికా స్థావరాలపై విరుచుకుపడుతోంది. వాటిని అడ్డుకోవడానికి అమెరికా పేట్రియాట్, థాడ్ వంటి చాలా ఖరీదైన ఇంటర్‌సెప్టార్ క్షిపణులు వాడుతోంది. ఇది సుదీర్ఘంగా కొనసాగుతుండటంతో అమెరికా వద్ద క్షిపణుల నిల్వలు తగ్గిపోయాయి. దీనితో పశ్చిమాసియాలో అమెరికా స్థావరాలు, మిత్రదేశాల భద్రతపై ప్రభావం పడుతుందని సైన్యం ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం. మరోవైపు ఇరాన్ దెబ్బకు పశ్చిమాసియాలోని జోర్డాన్, బహ్రెయిన్ తదితర దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాల్లో రక్షణ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. దీనితో రక్షణ వ్యవస్థలను తప్పించుకుని మరీ ఇరాన్ క్షిపణులు అమెరికా స్థావరాల్లో విధ్వంసం సృష్టిస్తున్నాయి. యుద్ధాన్ని మరింత విస్తరించడంపై ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, సెంట్రల్ కమాండ్ చీఫ్ డాన్ కెయిన్ ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఇరాన్‌పై దాడులకు కాస్త విరామం ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించారని.. భారీస్థాయిలో దాడుల కోసం సైన్యం ప్రణాళిక సిద్ధం చేసినా.. ప్రస్తుతానికి పక్కనపెట్టాలని ఆదేశించారని రక్షణ వర్గాలు తెలిపాయి. దౌత్యపరమైన చర్చలకు మార్గం సుగమం చేయాలని పేర్కొన్నారని.. అయితే ఏక్షణమైనా విరుచుకుపడటానికి సిద్ధంగా ఉండాలని కూడా సూచించారని వెల్లడించాయి.
సీమైన్‌ను ఢీకొని పేలిన చమురు ట్యాంకర్!
తాము సూచించిన మార్గంలో కాకుండా ఒమన్ తీరానికి సమీపంగా హోర్ముజ్ జలసంధి దాటడానికి ప్రయత్నించిన ఒక చమురు ట్యాంకర్ సముద్ర మందుపాతర (సీమైన్)ను ఢీకొని పేలిపోయిందని ఇరాన్ వార్తా సంస్థ టాస్నిమ్ పేర్కొంది. అది ఏ దేశ నౌక, ఎంత మేర దెబ్బతిన్నది, ప్రాణ నష్టమేదైనా జరిగిందా అన్న వివరాలేవీ వెల్లడించలేదు. దీనిపై ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్‌జీసీ) నుంచి కూడా అధికారిక ప్రకటన ఏదీ రాలేదు.
సౌదీ ఆరామ్‌కో రిఫైనరీపై హుతీల దాడి
సౌదీ అరేబియాలోని ఆరామ్‌కో రిఫైనరీలపై యెమెన్‌కు చెందిన ఇరాన్ మద్దతున్న హుతి తిరుగుబాటుదారులు డ్రోన్ దాడులు చేశారు. ఎర్ర సముద్రతీరంలోని జిజాన్, యాంబు ప్రాంతాల్లో ఉన్న ఆరామ్‌కో చమురు కేంద్రాలపై దాడి చేశామని హుతీల సైనిక ప్రతినిధి యహ్యా సరియీ ప్రకటించారు. జిజాన్‌లోని రిఫైనరీపై దాడి జరిగిందని, అక్కడ భారీగా పొగలు వెలువడుతున్నాయని రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. యాంబు రిఫైనరీ వైపు దూసుకొచ్చిన రెండు బాలిస్టిక్ క్షిపణులను పేట్రియాట్ వ్యవస్థతో విజయవంతంగా అడ్డుకున్నట్టుగా గ్రీకు భద్రతా దళాలు వెల్లడించాయని తెలిపింది.
ఇవి కూడా చదవండి:
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వేళ బీజేపీ ఎంపీ కుమార్తె పోస్ట్ కలకలం
అడవిలో తప్పిపోయిన 23 మంది అధికారులు.. చివరకు