Share News

పోయిన గొంతును మళ్లీ వినిపించే ఏఐ

ABN , Publish Date - Oct 27 , 2026 | 02:23 AM

గొంతు క్యాన్సర్‌, ఇతర కారణాల వల్ల స్వరపేటికను తొలగించిన రోగులకు.. పక్షవాతం లేదా మెదడుకు గాయం కావడం వల్ల మాటపడిపోయినవారికి.. స్వరతంత్రుల పక్షవాతం, ఇతర నరాల సమస్యల కారణంగా మాట కోల్పోయినవారికి మాట్లాడ్డానికి ఉండే ప్రధాన అవకాశాల్లో ఒకటి.. వాయిస్‌ సింథసైజర్‌.

పోయిన గొంతును మళ్లీ వినిపించే ఏఐ
voice

  • గతంలో మాట్లాడిన ఆడియో క్లిప్‌ ఉంటే చాలు

  • వాయిస్‌ సింథసైజర్‌లో వారి గొంతే వినిపించే

  • పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసిన అమెరికా శాస్త్రజ్ఞులు

వాషింగ్టన్‌, అక్టోబరు 26: గొంతు క్యాన్సర్‌, ఇతర కారణాల వల్ల స్వరపేటికను తొలగించిన రోగులకు.. పక్షవాతం లేదా మెదడుకు గాయం కావడం వల్ల మాటపడిపోయినవారికి.. స్వరతంత్రుల పక్షవాతం, ఇతర నరాల సమస్యల కారణంగా మాట కోల్పోయినవారికి మాట్లాడ్డానికి ఉండే ప్రధాన అవకాశాల్లో ఒకటి.. వాయిస్‌ సింథసైజర్‌. కొన్ని ఉపకరణాల సాయంతో వారు తమ మనసులోని మాటలను వాయిస్‌ సింథసైజర్ల ద్వారా చెప్పగలుగుతారు. కానీ, వాటి ద్వారా వచ్చే మాట యాంత్రికంగా ఉంటుంది తప్ప వారి సొంత గొంతులా ఉండదు. అలాంటి ఇబ్బంది లేకుండా.. ఏఐ సాయంతో వారిగొంతే వాయిస్‌ సింథసైజర్‌ ద్వారా కూడా వినిపించే కొత్త పరిజ్ఞానాన్ని అమెరికాకు చెందిన ‘ఎలెవెన్‌ ల్యాబ్స్‌’ నిపుణులు అభివృద్ధి చేశారు. బాధితులు గతంలో మాట్లాడినప్పటి వాయిస్‌ క్లిపింగ్‌ ఒక్కటి ఉన్నా చాలు. మిగతా పని ఏఐ పూర్తిచేస్తుంది. వారు మాట్లాడే విధానం, పదాల మధ్య ఎలా గ్యాప్‌ ఇస్తున్నారు, భావోద్వేగాలను ఎలా పలికిస్తున్నారు.. ఇలా అన్నింటినీ విశ్లేషించి అచ్చం వారు మాట్లాడినట్టుగానే ఉండేలా చేస్తుంది.

అమెరికాకు చెందిన పాల్‌ ఫ్రాంకోయెర్‌ అనే వ్యక్తికి.. అమ్యోట్రోఫిక్‌ లాటెరల్‌ స్క్లెరోసిస్‌ అనే సమస్య కారణంగా మాట పడిపోతే, ఎలెవెన్‌ల్యాబ్స్‌ పరిశోధకులు ఈ టెక్నాలజీ సాయంతోనే వాయిస్‌ సింథసైజర్‌లో మళ్లీ అతడి గొంతు వినిపించేలా చేశారు. అమ్యోట్రోఫిక్‌ లాటెరల్‌ స్క్లెరోసిస్‌ అనేది.. మోటార్‌ న్యూరాన్‌ డిసీజ్‌. మెదడు, వెన్నుపూసలోని నాడీకణాలను క్రమంగా నాశనం చేస్తూ.. కండరాల కదలికలు ఆగిపోయేలా చేసే సమస్య ఇది. ఏఎల్‌ఎస్‌ కారణంగా.. మాట పడిపోతుంది.


నమిలి మింగే శక్తి కోల్పోతారు. నడవలేరు. చివరికి.. యంత్రాల సాయం లేకుండా కనీసం శ్వాస కూడా తీసుకోలేరు. దీన్ని నయం చేసే చికిత్స కూడా లేదు. నాడులు, కండరాలు క్రమంగా క్షీణించి చివరికి ప్రాణాలు పోతాయి. 2019లో ఈవ్యాధి బారిన పడిన ఫ్రాంకోయెర్‌ క్రమంగా మాట్లాడే శక్తిని కోల్పోయాడు. ‘ఐ గేజ్‌ టెక్నాలజీ’ ద్వారా ఇతరులకు తన భావాలు తెలిపేలా వైద్యులు అతడికి శిక్షణ ఇచ్చారు. ఐ గేజ్‌ టెక్నాలజీ అంటే.. అతడి కనుగుడ్ల కదలికల సాయంతో కంప్యూటర్‌ మౌస్‌ను క్లిక్‌ చేసే టెక్నాలజీ. దాని సాయంతో అతడు చెప్పాలనుకున్న మాట వాయిస్‌ సింథసైజర్‌ ద్వారా బయటకు వినపడేది. కానీ, అది రోబో గొంతులా ఉండేది. ఈ క్రమంలోనే.. అతడికి ఐగేజ్‌ టెక్నాలజీని అందించిన బ్రిడ్జింగ్‌ వాయిస్‌ అనే స్వచ్ఛంద సంస్థ ఎలెవెన్‌ ల్యాబ్స్‌ను సంప్రదించింది. ఏఐ సాయంతో సింథసైజర్‌లో అతడి గొంతు వచ్చేలా చేయాలంటే.. అతడి వాయిస్‌ క్లిపింగ్‌ కావాలని పరిశోధకులు అడిగారు. 2012లో అతడు ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 16 సెకన్ల క్లిప్‌ ఒకటి లభించింది. ఎలెవెన్‌ ల్యాబ్స్‌ పరిశోధకులు దాన్ని క్లోన్‌ చేసిచ్చారు. అప్పుడు బ్రిడ్జింగ్‌ వాయి్‌సకు చెందిన నిపుణులు దాన్ని ఐగేజ్‌ టెక్నాలజీతో అనుసంధానం చేసి, వాయిస్‌ సింథసైజర్‌లో అతడి స్వరం వినిపించేలా చేయగలిగారు (దురదృష్టవశాత్తూ ఏఎల్‌ఎస్‌ సమస్య ముదిరి.. ఆ తర్వాత ఏడు నెలలకు ఆయన మరణించారు). ఏ కారణం వల్లనైనా మాట పోగొట్టుకుని, వాయిస్‌ సింథసైజర్లను ఉపయోగిస్తున్నవారికి ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

వందల ఏఐ క్లౌడ్ స్టార్టప్‌లు కనుమరుగవుతాయి: మస్క్ హెచ్చరిక

అమెరికా మళ్లీ దాడి చేసినా మా విధానాలు మారవు: ఇరాన్ విదేశాంగ మంత్రి

Updated Date - Oct 27 , 2026 | 02:30 AM